Share News

రియల్టర్‌ను అపహరించిన వైసీపీ నేత

ABN , Publish Date - Dec 12 , 2024 | 03:46 AM

ఆర్థిక అరాచకాలతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన ఇమిడాబత్తిని నాగేశ్వరరావు అనే వ్యక్తి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటారు.

రియల్టర్‌ను అపహరించిన వైసీపీ నేత

  • రూ.రెండు కోట్లు ఇవ్వాలంటూ బెదిరింపు

  • ఇవ్వలేననడంతో కొండపై నుంచి తోసివేత

  • గుంటూరు జిల్లా నల్లపాడులో ఘటన

గుంటూరు, డిసెంబర్‌ 11 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక అరాచకాలతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన ఇమిడాబత్తిని నాగేశ్వరరావు అనే వ్యక్తి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటారు. మిర్చి వ్యాపారం చేసే అదే గ్రామానికి చెందిన వైసీపీ నేత దుగ్గెంపూడి లెనిన్‌రెడ్డి దురలవాట్ల కారణంగాఅప్పుల పాలయ్యాడు. కష్టపడకుండా డబ్బు సంపాదించాలని లెనిన్‌రెడ్డి పథకం రూపొందించాడు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం నాగేశ్వరరావును లెనిన్‌రెడ్డి అపహరించాడు. ‘పని ఉంది.. మెయిన్‌రోడ్డు దాకా వెళదాం’ అంటూ ఆయనను కారు ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత అటూఇటూ తిప్పి చివరకు కైలాసగిరి కొండ వద్దకు లెనిన్‌రెడ్డి తీసుకెళ్లాడు. దీంతో తనను అపహరించారని నాగేశ్వరరావు గ్రహించారు. అక్కడ ఓ న్యాయవాది, మరో వ్యక్తి...లెనిన్‌రెడ్డి వెంట ఉన్నారు.


వారంతా నాగేశ్వరరావును రూ.2కోట్లు ఇవ్వాలని బెదిరించారు. అంత డబ్బు తన వద్ద లేదని చెప్పగా, రెండు కోట్లు ఇవ్వకుంటే ఇదే ఆఖరి రోజు అంటూ లెనిన్‌రెడ్డి బెదిరించాడు. అయినా నాగేశ్వరావు లొంగక పోవడంతో....టవల్‌తో రెండు చేతులు వెనక్కు విరిచికట్టి కొండపై నుంచి కిందకు నెట్టేశాడు. అప్పుడే అటుగా వచ్చిన స్థానిక యువకుడు.. తీవ్ర గాయాలతో పడి ఉన్న నాగేశ్వరరావు వద్దకు వచ్చాడు. ఆ యువకుడి సాయంతో ఆయన అక్కడి నుంచి బయటపడ్డారు. నేరుగా జీజీహెచ్‌కు వెళ్లి అడ్మిట్‌ అయ్యారు. కాగా, లెనిన్‌రెడ్డిపై గతంలో పలు కేసులు ఉన్నట్లు నాగేశ్వరరావు తెలిపారు. లెనిన్‌ రెడ్డి సోదరుడు బాల అంజిరెడ్డి పై కూడా పలు కేసులు ఉన్నాయని పోలీసులకు వెల్లడించారు.

Updated Date - Dec 12 , 2024 | 09:31 AM