Share News

Ration Rice Scam : బుగ్గన బంధువుల గోడౌన్లలో బియ్యం మాయం

ABN , Publish Date - Dec 27 , 2024 | 03:32 AM

పేదలకు అందించాల్సిన రేషన్‌ బియ్యాన్ని జగన్‌ ప్రభుత్వంలో వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. అధికారులతో కుమ్మక్తై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తమ జేబుల్లో వేసుకున్నారు.

 Ration Rice Scam : బుగ్గన బంధువుల గోడౌన్లలో బియ్యం మాయం

  • బేతంచర్ల బఫర్‌ గోదాముల్లో మాయమైన 1300 బస్తాలు

  • సివిల్‌ సప్లైస్‌ అధికారుల తనిఖీలు

  • ఓ గోదాములో 398 బస్తాలు మాయం

  • పత్తా లేకుండా పోయిన మరో గోదాం యజమానులు

  • ఆ గోదాంలో 920 బస్తాలు మాయమైనట్లు అనుమానం

నంద్యాల, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పేదలకు అందించాల్సిన రేషన్‌ బియ్యాన్ని జగన్‌ ప్రభుత్వంలో వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. అధికారులతో కుమ్మక్తై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తమ జేబుల్లో వేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దోపిడీదారులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. ఇటీవల మాజీ మంత్రి పేర్ని నానికి సంబంధించిన గోదాముల్లో బియ్యం మాయమైన ఘటన బయటపడింది. అదే కోవలో బేతంచర్లలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బంధువులకు చెందిన గోడౌన్లలో 1300 బస్తాలకు పైగా మాయమయ్యాయని తెలుస్తోంది. ఈ లెక్క తేల్చేందుకు సివిల్‌ సప్లైస్‌ డైరెక్టర్‌ మహేశ్‌ నాయుడు, నంద్యాల డీఎం రాజు నాయక్‌ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మాయమైన బస్తాలు ఈ మధ్య కాలానివేనని, గత ప్రభుత్వ హయాంలో మాయమైన వాటి గురించి పూర్తిగా ఆరా తీస్తే అవినీతి రూ. కోట్లలో బయటపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

బుగ్గన మంత్రి అయ్యాకే రెండు గోడౌన్లు..

వాస్తవానికి 2019కి ముందు బేతంచర్లలో సివిల్‌ సప్లై్‌సకి సంబంధించిన గోడౌన్లు ఏమీ లేవు. బుగ్గన సొంత నియోజకవర్గం డోన్‌కు కర్నూలు, గుంతకల్లు, నంద్యాల నుంచి పీడీఎస్‌ బియ్యం సరఫరా అయ్యేది. వైసీపీ ప్రభుత్వంలో బుగ్గన మంత్రి కాగానే ప్యాపిలి, డోన్‌, బనగానపల్లెలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు బియ్యం సరఫరా చేయడానికి బేతంచర్లలోనే రెండు బఫర్‌ గోడౌన్లను ఏర్పాటు చేయించారు. ఈ రెండు గోడౌన్లలో ఒక దానిని ఎస్‌డబ్లూసీ (స్టేట్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌)కి లీజుకు ఇప్పించగా, మరో దానిని తన బంధువు, సన్నిహితుడు కలిసి ప్రైవేటుగా నడుపుకొనేలా చక్రం తిప్పారు. ప్రస్తుతం ఎస్‌డబ్లూసీకి సంబంధించిన గోదాములో అధికారులు తనిఖీ చేయగా 398 బియ్యం బస్తాలు మాయమైనట్లు గుర్తించారు.


ఇక ప్రైవేటు గోడౌన్‌ను తనిఖీ చేసేందుకు ప్రయత్నించగా దాని యజమానులు అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. అధికారులు నుంచి ముందస్తు సమాచారం ఉండటంతోనే వారు ఉడాయించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రైవేటు గోడౌన్‌లో దాదాపు 920 బస్తాలు మాయం అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని బయటకు రాకుండా ఉంచేందుకు సంబంధిత శాఖ అధికారులు వేరే చోటు నుంచి బియ్యం బస్తాలు తెప్పించి అంతా సక్రమంగా ఉందని చూపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

మాయమైన బియ్యం విలువ రూ. 50 లక్షలు

ప్రస్తుతం మాయమైన 1300 బస్తాల్లోని బియ్యం దాదాపు 650 క్వింటాళ్ల మేర ఉంటుంది. కిలో బియ్యాన్ని రూ. 43 చొప్పున ప్రభుత్వం సేకరిస్తున్న లెక్కన ఈ గోదాముల్లో మాయమైన బియ్యం విలువ దాదాపు రూ. 50 లక్షలు ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గట్టిగా నిఘా పెడుతున్నా ఈ స్థాయిలో బియ్యం మాయమవుతున్నాయంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఇంకే స్థాయిలో జరిగిందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఎవర్నీ వదిలే ప్రసక్తిలేదు: సివిల్‌ సప్లైస్‌ డైరెక్టర్‌

ఇక బేతంచర్ల గోడౌన్లకు సంబంధించిన వివరాలను నంద్యాల సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ డీఎం రాజు నాయక్‌ గోప్యంగా ఉంచుతున్నారు. బఫర్‌ గోడౌన్‌లోని పీడీఎస్‌ బియ్యానికి సంబంధించిన మూవ్‌మెంట్‌ రిజిస్టర్లు, ప్రతినెలా చేసే ఫిజికల్‌ వెరిఫికేషన్‌ బోర్డు, క్లోజింగ్‌ బ్యాలెన్స్‌ వివరాలు ఏవీ కూడా చూపించకుండా జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. బేతంచర్ల గోడౌన్ల రికార్డులన్నీ పరిశీలిస్తే కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న విషయం బయటకు వస్తుందని, బియ్యాన్ని మాయం చేసిన వారిపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేయిస్తామని, అలాగే వారికి సహకరించిన అధికారులను కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని సివిల్‌ సప్లైస్‌ డైరెక్టర్‌ మహేశ్‌ నాయుడు చెప్పారు.

Updated Date - Dec 27 , 2024 | 05:20 AM