YS Jagan: దిమ్మ తిరిగి అమ్మ ఒడికి!.. అమ్మా నువ్వే దిక్కంటూ సీఎం జగన్ వేడుకోలు
ABN , Publish Date - Jan 28 , 2024 | 03:25 AM
చెల్లి షర్మిల కొట్టిన దెబ్బకు జగన్‌కు దిమ్మ తిరిగి అమ్మ గుర్తొచ్చింది. అన్యధా శరణం నాస్తి.. నువ్వే దిక్కంటూ శరణుజొచ్చేలా చేసింది. జనం ఈసడించుకుంటున్నా,
షర్మిల ఎఫెక్ట్...
షర్మిల దెబ్బతో జగన్ మైండ్ బ్లాంక్
శరణు వేడుతూ విజయమ్మకు ఫోన్!
‘‘పరిస్థితి ఏమీ బాలేదు. ప్రజా వ్యతిరేకత అనే అగ్నికి చెల్లి షర్మిల ఆజ్యం పోస్తోంది. నేను ఓడిపోతే జైలుకెళ్లాల్సి వస్తుంది. కేసుల్లో కచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంది. అదే జరిగితే మళ్లీ ఎప్పటికి బయటికొస్తానో తెలియదు. నా జీవితం జైలుకే అంకితమైపోతుంది. నువ్వు రావాల్సిందే.. నన్ను ఆదుకోవాల్సిందే’’
-తల్లితో జగన్ దీనాలాపన!
తనకు అండగా ప్రచారానికి రావాలని విన్నపం
కాదంటే ఓటమి, జైలు జీవితం తప్పవని గగ్గోలు
దీన వచనాలతో కరిగిన కన్నతల్లి మనసు
జగన్ తరఫున ప్రచారానికి వచ్చేందుకు ఓకే!
షర్మిల అభ్యంతరం.. అయినా విజయమ్మ ముందుకే
(అమరావతి- ఆంధ్రజ్యోతి)
చెల్లి షర్మిల కొట్టిన దెబ్బకు జగన్‌కు దిమ్మ తిరిగి అమ్మ గుర్తొచ్చింది. అన్యధా శరణం నాస్తి.. నువ్వే దిక్కంటూ శరణుజొచ్చేలా చేసింది. జనం ఈసడించుకుంటున్నా, ఓటమి ఖాయమని స్పష్టంగా తెలుస్తూనే ఉన్నా ఇన్నాళ్లూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వచ్చిన జగన్‌కు చెల్లి షర్మిల కోలుకోలేని షాక్ ఇస్తున్నారు. పీసీసీ పగ్గాలు చేపట్టిన దగ్గరి నుంచి ఆమె రోజు రోజుకూ డోస్ పెంచుకుంటూ పోతున్నారు. జగన్ అవినీతిని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు దారుణమైన ఆయన నైజాన్ని ఆమె సూటిగా బయటపెడుతుండటంతో జగన్ కాళ్ల కింద భూమి కదులుతోంది. జగన్ నుంచి తాను ఏమీ ఆశించలేదని, ఆయనను ఏదీ కోరలేదని, అది నిజం కాకుంటే ఆ మాట అమ్మ విజయలక్ష్మితో చెప్పించాలంటూ శుక్రవారం సవాల్ విసిరిన షర్మిల.. శనివారం మరింత డోస్ పెంచారు. వైఎస్సార్ పార్టీలో అసలు వైఎస్సారే లేరని ఆమె తేల్చిపారేశారు. వై అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి (సజ్జల) అంటూ సరికొత్త అన్వయం చెప్పారు. దోచుకోవడం, దాచుకోవడమే జగన్ పనిగా మారిందని మొదలెట్టి, వైఎస్ పాలనకు, జగన్ పాలనకు అసలు పోలికే లేదంటూ షర్మిల సూటిగా సుత్తి లేకుండా చేస్తున్న వ్యాఖ్యలు జనంలోకి విస్తృతంగా వెళుతున్నాయి. ప్రజల గుండెలకు సూటిగా తాకుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ అభిమానులు ఆమె మాటలను పూర్తిగా విశ్వసిస్తున్నారు. నాలుగేళ్లలో విపక్షాలు అన్నీ కలిపి చేసిన విమర్శలు ఒక ఎత్తైతే.. గత కొద్ది రోజుల్లో షర్మిల చేస్తున్న అటాక్ అంతకు ఎన్నో రెట్లు అధికంగా ప్రభావం చూపుతోంది. దీంతో జగన్‌కు కూసాలు కదిలినట్లై మైండ్ బ్లాక్ అవుతున్న పరిస్థితి. షర్మిలను కట్టడి చేయడానికి, తన సోషల్ మీడియాను, పార్టీ నేతలను ఆయన మొదట ఉసిగొల్పారు. ఇది ఆమెను మరింత రెచ్చగొట్టినట్టయి.. ఇంకా డోస్ పెంచేలా చేసింది. ఇప్పుడిక ఆమె ఇంకెన్ని అంతఃపుర రహస్యాలను బయటపెడతారోనన్న భయం జగన్‌కు అరికాళ్లలోంచి వణుకు పుట్టేలా చేసింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు జగన్‌కు తన భవిష్యత్తు ఏంటో కళ్ల ముందు సాక్షాత్కరించేలా చేశాయి. ఇక తల్లి విజయలక్ష్మి విషయానికొస్తే..
ఒక దశలో తనను జగన్ ఈసడించుకొని, ఇంటి నుంచి తరిమేసినంత పనిచేయడంతో ఆమె కూతురు షర్మిల వద్దే ఉండిపోయారు. పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి ఆమెతోనే రాజీనామా చేయించిన ఘన చరిత్ర జగన్‌ది. చివరికి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేని స్థాయిలో జగన్ ద్వేషం పెంచుకున్నారు. అవసరార్థం పొడిపొడిగా మాట్లాడటం మినహా ఆమెను ఈ మధ్య కాలంలో తల్లిగానే చూడలేదని చెప్పవచ్చు. అలాంటి జగన్‌కు షర్మిల దెబ్బతో తల్లి గుర్తొచ్చింది. ఇన్నాళ్లూ ‘రాక్షసులు, మారీచులతో పోరాడుతున్న మీ బిడ్డను ఆశీర్వదించండంటూ’ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ వచ్చిన జగన్‌కు.. షర్మిల దెబ్బతో తాను మళ్లీ విజయమ్మ బిడ్డను అన్న విషయం గుర్తొచ్చింది. అమ్మా.. నువ్వే శరణం అంటూ విజయలక్ష్మికి ఫోన్ చేసి ప్రాథేయపడినట్టు విశ్వసనీయ సమాచారం. ‘‘పరిస్థితి ఏమీ బాలేదు. ప్రజా వ్యతిరేకత అనే అగ్నికి చెల్లి షర్మిల ఆజ్యం పోస్తోంది. నేను ఓడిపోతే జైలుకెళ్లాల్సి వస్తుంది. కేసుల్లో కచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంది. అదే జరిగితే మళ్లీ ఎప్పటికి బయటికొస్తానో తెలియదు. నా జీవితం జైలుకే అంకితమైపోతుంది. నువ్వు రావాల్సిందే.. నన్ను ఆదుకోవాల్సిందే’’ అని ఆమెను బతిమలాడుకున్నట్లు తెలిసింది. ఎప్పుడూ పెడసరంగా మాట్లాడే జగన్.. ఇలా దీన వచనాలు వల్లించడం, ఆయన స్వరంలో వినిపించిన ఆందోళనతో ఆమెకు పరిస్థితి అర్థమైంది. మరీ ముఖ్యంగా జైలు జీవితం గురిం చి చెప్పిన మాటలతో ఆమె మనసు కరిగింది. ఇన్నా ళ్లూ ఎన్ని వేధింపులకు గురిచేసినా కొడుకుని వదులుకోలేం గదా అన్న ఉద్దేశంతో జగన్‌కు సాయం చేసేందుకు ఆమె ముందుకొచ్చినట్టు సమాచారం. జగన్ కోరిన విధంగా ఆయనకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించేందుకు ఆమె అంగీకరించినట్లు తెలిసింది.
షర్మిల వారించినా..
జగన్‌తో విభేదాల నేపథ్యంలో ఇన్నాళ్లూ విజయలక్ష్మి.. తన బిడ్డ షర్మిల వైపే ఉన్నారు. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు ఆమె వెన్నంటే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో షర్మిలకు మద్దతుగా రోడ్డెక్కారు కూడా. కానీ ఇప్పుడు కొడుకు శోకాలు చూసి ఆమె కరిగిపోవడాన్ని షర్మిల తీవ్రంగా వ్యతిరేకించినట్టు సమాచారం. తనకు పూర్తిగా అన్యాయం చేసి, ఎన్నో అవమానాల పాల్జేసిన జగన్ నైజాన్ని తాను ప్రజల ముందుంచుతుంటే.. తల్లి జగన్‌కు మద్దతుగా రాష్ట్రంలో పర్యటించి, ప్రచారం చేయడం సరికాదని ఆమె అభ్యంతరం చెప్పినట్లు తెలిసింది. షర్మిల కాదంటున్నా.. కొడుకు దీన స్థితి దృష్ట్యా తాను అండగా నిలువక తప్పదని భావిస్తున్నానని విజయలక్ష్మి తన సన్నిహితుల వద్ద పేర్కొన్నట్టు సమాచారం. మొత్తంమీద రానున్న రోజుల్లో జగన్‌కు వ్యతిరేకంగా చెల్లి, అనుకూలంగా తల్లి రాష్ట్రంలో పర్యటించబోతున్నారన్న మాట! తన కుమారుడికి మరో అవకాశం ఇవ్వాలని, పదవీ భిక్ష పెట్టాలంటూ గతంలో మాదిరి బైబిల్ చేతబట్టుకొని విజయలక్ష్మి మరోసారి ప్రజల్లోకి రాబోతున్నారని స్పష్టమవుతోంది!