Share News

YS Jagan: పోలవరం ఎత్తు తగ్గించినా నోరు మెదపరేంటి: వైఎస్ జగన్

ABN , Publish Date - Oct 31 , 2024 | 06:44 AM

పోలవరం ఎత్తును పరిమితం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు.

YS Jagan: పోలవరం ఎత్తు తగ్గించినా నోరు మెదపరేంటి: వైఎస్ జగన్

అమరావతి: పోలవరం ఎత్తును పరిమితం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం చేసేలా ఉన్న కేంద్రం నిర్ణయంపై ఎందుకు నోరు మెదపడంలేదని అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు.

ఆయన తన కామెంట్స్‌లో..

  • రాష్ట్రానికి ఇంతటి తీరని అన్యాయం చేస్తారా? పోలవరం ప్రాజెక్టు ఎత్తును పరిమితంచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా మీరు ఎందుకు నోరుమెదపడంలేదు? సవరించిన అంచనాలను ఆమేరకే పరిమితం చేయడం రాష్ట్రానికి తీరని అన్యాయం కాదా? దీనివల్ల ప్రాజెక్టు లక్ష్యాలనే దెబ్బతీస్తున్నారు కదా? దేనికి లాలూచీపడి మీరు ఈ పనికి ఒడిగట్టారు? ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, కేంద్ర మంత్రివర్గంలో మీ పార్టీ ఎంపీలు కూడా ఉండి ఎందుకు ఈ అంశంపై అభ్యంతరం చెప్పలేదు? చంద్రబాబుగారూ… ఎప్పుడు ప్రజలు మీకు అధికారాన్ని అప్పగించినా రాష్ట్ర భవిష్యత్తును, ప్రజల భవిష్యత్తును తాకట్టుపెడతారని, మీ స్వార్థరాజకీయాలకు, ఆర్థిక, వ్యక్తిగత ప్రయోజనాలకోసం ప్రజల ప్రయోజనాలను నట్టేటా ముంచేస్తారని మరోసారి నిరూపిస్తున్నారుకదా?


  • పోలవరం గరిష్ట ఎత్తు 45.72 మీటర్లు అయితే, 41.15 మీటర్లకే మీరు ఎందుకు పరిమితంచేస్తున్నారు? తద్వారా 194.6 టీఎంసీలు ఉండాల్సిన నీటినిల్వ 115 టీంఎసీలకే పడిపోతుందని తెలిసికూడా మీరు ఎందుకు అభ్యంతరం చెప్పడంలేదు? ఈ కారణంగా వరద వస్తే తప్ప కుడి, ఎడమ కాల్వలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదలచేయలేని దుస్థితి నెలకొంటుంది. గోదావరి డెల్టా ప్రాంతంలో పంటలకు స్థిరంగా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. సరిగా విద్యుత్‌ను ఉత్పత్తిచేయలేం. శరవేగంగా విస్తరిస్తున్న విశాఖపట్నం మహానగరానికి తాగు నీరు, పారిశ్రామిక అవసరాలను తీర్చలేం. అన్నికంటే సుజలస్రవంతి ప్రాజెక్టుపై ఉన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తరాంధ్రకు అన్యాయమే జరుగుతుంది. మీ మద్దతుమీదే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందన్న వాస్తవ పరిస్థితుల మధ్య రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలమైన పోలవరం ఎత్తు తగ్గింపు విషయంలో మీరు ఎందుకు చేతులెత్తేస్తున్నారు? ఎందుకు బేలతనం చూపుతున్నారు? దీనివెనుక మీ స్వార్థం ఏంటి?

  • పోలవరం ప్రాజెక్టు విషయంలో అప్పుడైనా, ఇప్పుడైనా మీరు చేసిన, చేస్తున్న దుర్మార్గాలకు అంతులేకుండా పోతోంది. మొదటనుంచీ మీరు స్వప్రయోజనాలే చూసుకున్నారు. మీ బంధువులకు, మీ పార్టీ నాయకులకు కాంట్రాక్టులు ఇచ్చి డబ్బులు సంపాదించుకోవడంకోసం కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాజెక్టును మీ చేతిలోకి తీసుకున్నారు. ప్రత్యేక ప్యాకేజీ డ్రామాతో రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. నామినేషన్ల పద్ధతిలో కాంట్రాక్టులు కట్టబెట్టి పెద్దమొత్తంలో ప్రజాధనాన్ని లూటీచేశారు. చంద్రబాబుకు పోలవరం ప్రాజెక్టు ఏటీఎం మాదిరి డబ్బులు గుంజుకునే యంత్రంలా మారిందని సాక్షాత్తూ ఆనాడు ప్రధానమంత్రి ప్రజల సాక్షిగా అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాను. నాడు ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బకొట్టిన మీరు మళ్లీ రాష్ట్రానిఇక జీవనాడి, పోలవరం విషయంలో అంతే నష్టం చేస్తున్నారు.

  • గతంలో మీరు మీ స్వార్థంకోసం ప్రాజెక్టు నిర్మాణాన్ని అస్తవ్యస్తంచేశారు. ఒక పద్ధతి, ఒక వ్యూహం, ఒక ప్రణాళిక లేకుండా డబ్బులు వచ్చే పనులు మాత్రమే చేశారు. స్పిల్‌వేను పూర్తిచేయకుండా కాపర్‌డ్యాంలు మొదలుపెట్టారు. వీటిని పూర్తిచేయకుండానే ఖాళీలు వదిలేసి డయాఫ్రంవాల్‌ కట్టారు. ఆ నిర్మాణాల్లోకూడా లోపాలే. కాఫర్‌డ్యాంలో సీపేజీకి కారకులు మీరు. మీ అసమర్థత కారణంగా కాఫర్‌డ్యాంలు పూర్తిచేయకుండా ఖాళీలు విడిచిపెట్టారు. ఆ ఖాళీలుగుండా వరదనీరు ఉద్ధృతంగా ప్రవహించి డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోవడానికి మీ నిర్వాకాలే కారణమని సాక్షాత్తూ అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇటీవలే తన నివేదికలో కుండబద్దలు కొట్టి చెప్పింది. చివరకు స్పిల్‌వేలో పిల్లర్లుకూడా పూర్తిచేయకుండా గేట్లుపెట్టామంటూ ఫొటోలకు ఫోజులిచ్చిన చరిత్ర మీది. అయినా తప్పులు అంగీకరించడానికి, చేసినవాటిని సరిదిద్దుకోవడానికి మీకు మనసు రాదు. తప్పుడు ప్రచారాలు చేసి ఆ తప్పులనుంచి బయటపడడానికి నిరంతరం ప్రయత్నిస్తారు తప్ప, పోలవరం పట్ల మీలో ఇసుమంతైనా నిజాయతీ లేదు.


  • మీరు చేసిన తప్పులన్నింటినీ సరిదిద్ది, ప్రతి ఏడాదీ వరుసగా వరదలు వచ్చినా, కోవిడ్‌లాంటి సంక్షోభం వచ్చినా కీలకమైన పనులన్నీ వైయస్సార్‌సీపీ హయాంలో చేశాం. స్పిల్‌వే, స్పిల్‌ఛానల్, అప్రోచ్‌ఛానల్‌, ఎగువ కాఫర్‌డ్యాం, దిగువ కాఫర్‌ డ్యాం ఇలా కీలకమైన పనులన్నీ పూర్తిచేశాం. 2022లో గోదావరి మహోగ్రంగా ఉప్పొంగినా ప్రాజెక్టు ఎక్కడా చెక్కుచెదరలేదు. అంతేకాదు వైయస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నాల వల్ల పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి రూ. 12,127 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. కాని మీరు ఎప్పటిలానే దుర్భుద్ధిని చూపించి, ఎన్డీయేతో పొత్తు ఖరారైన తర్వాత, ఎన్నికలకు ముందు రావాల్సిన ఆ డబ్బును రానీయకుండా, అడ్డుకున్నారు. ఇప్పుడు ఆ డబ్బును విడుదలచేస్తున్నట్టు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.

  • ఇక ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా కొట్టుకుపోయిన ఆ డయాఫ్రంవాల్‌ను పూర్తిచేసి, ఎర్త్‌కం రాక్‌ఫిల్‌డ్యాంను కట్టడంతోపాటు, ఈలోగా మిగిలిన నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని ఇవ్వాలి. ఇవన్నీ పూర్తిచేస్తామంటూ మీరు, మీ కూటమి పార్టీలు ప్రజలవద్దకు వెళ్లి ఓట్లు తెచ్చుకుని, అధికారంలోకి వచ్చారు. వచ్చీరాగానే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడానికి సరే అంటున్నారు, ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? వెంటనే ఈ అంశంపై కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి దాన్ని సరిదిద్దండి. పోలవరం ప్రాజెక్టు గరిష్ట ఎత్తు 45.72 మీటర్లకే సవరించిన అంచనాలకు ఒప్పించి, నిర్వాసితులందరికీ న్యాయంచేసి పూర్తిచేయండి. లేకపోతే ప్రజలే మీపై తిరుగుబాటు చేస్తారు.

Chandrababu : స్వర్ణాంధ్ర సాధనకు12 సూత్రాలు

Updated Date - Oct 31 , 2024 | 06:44 AM