Share News

YCP Workers : జగన్‌కు కేడర్‌ ‘షాక్‌’

ABN , Publish Date - Dec 24 , 2024 | 03:59 AM

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డికి పార్టీ ముఖ్యనేతలు, కేడర్‌ ‘షాక్‌’ ఇస్తోంది. రాష్ట్రంలో విద్యుత్తు చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఈ నెల 27వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో ....

YCP Workers : జగన్‌కు కేడర్‌ ‘షాక్‌’

  • ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలకు మేం రాలేం!

  • 7 నెలలకు ‘అమ్మఒడి’ ఇచ్చాం

  • మరి..‘అమ్మకు వందనం’పై యాగీ సబబేనా?

  • అధినేత తీరుపై కార్యకర్తల్లో అసంతృప్తి

అమరావతి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డికి పార్టీ ముఖ్యనేతలు, కేడర్‌ ‘షాక్‌’ ఇస్తోంది. రాష్ట్రంలో విద్యుత్తు చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఈ నెల 27వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు చేయాలంటూ జగన్‌ ఇచ్చిన పిలుపుపై ఆ పార్టీ కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. ‘మేం రాలేం’ అని తెగేసి చెబుతున్నట్టు సమాచారం. అలాగే......వచ్చే నెల మూడో తేదీ లోపు ఫీజు రియంబర్స్‌మెంట్‌, అమ్మకు వందనం పథకాలు అమలు కోరుతూ ధర్నాలు చేయాలన్న అధినేత ఆదేశాన్నీ సీరియ్‌సగా ఎవరూ తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు. ప్రభుత్వం ఏర్పడి కనీసం ఏడాదైనా కాకుండానే వ్యతిరేక ఆందోళనలు ఎలా చేస్తామంటూ కేడర్‌.. అధినాయకత్వాన్ని నిలదీస్తోంది. అసలేం జరిగిందంటే.. చంద్రబాబు హయాం అంతా విద్యుత్‌ చార్జీల బాదుడే బాదుడు అంటూ 2019లో జగన్‌ అధికారంలోకి వచ్చారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ.. బాదుడు కాస్తా బేదుడుగా మారిపోవడంతో జనం బెంబేలెత్తిపోయారు. ఈ క్రమంలో 2022-23లో రూ.8113.60 కోట్లు, 2023-24లో రూ.11,826.42 కోట్ల మేర ఇంధన సర్దుబాటు చార్జీల కింద వసూలు చేసుకునేందుకు ఆమోదం తెలపాలంటూ .. విద్యుత్తు నియంత్రణ మండలికి ఇంధన శాఖ ఆమోదం కోసం పిటిషన్‌ ఇచ్చింది. ఈ పిటిషన్‌ వేసేందుకు ఇంధన శాఖకు జగన్‌ ఆనుమతి ఇచ్చారు. ఈ పిటిషన్లు ఏపీఈఆర్‌సీ చైర్మన్‌గా జస్టిస్‌ నాగార్జున రెడ్డి ఉన్న సమయంలోనే అందజేశారు. ఇంధన సర్దుబాటు చార్జీలపై దాఖలయ్యే పిటిషన్‌ను 90 రోజుల్లో ఈఆర్‌సీ పరిష్కరించాలి. అయితే.. 2022 -23 సర్దుబాటు చార్జీలపై ఈఆర్‌సీ నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేసింది.


అదేవిధంగా .. సార్వత్రిక ఎన్నికలు ముందు ముఖ్యమంత్రిగా జగన్‌ ఆమోదంతోనే .. 2023-24 సంవత్సరానికిగాను రూ.11,826.42 కోట్ల మేర ఇంధన సర్దుబాటు చార్జీలను వసూలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఈఆర్‌సీ ముందు డిస్కమ్‌లు దరఖాస్తు చేసుకున్నాయి. గతంలో ఇచ్చిన రూ.8,113.60 కోట్లు, రూ.11,826.42 కోట్ల మేర డిస్కమ్‌లు వేసిన ఇంధన సర్దుబాటు చార్జీల పిటిషన్లపై ఈఆర్‌సీ చైర్మన్‌ నిర్ణయం తీసుకోలేదు. సార్వత్రిక ఎన్నికల తర్వాత 2022-23కుగాను రూ.6,072 కోట్లు, 2023-24లో రూ.11,826.42 కోట్లకుగాను రూ.9,412 కోట్లకు ఈఆర్‌సీ ఆమోదం తెలిపింది. ఈ మొత్తం (రూ.15,484 కోట్లు) ఇంధన సర్దుబాటు చార్జీల భారమంతా..జగన్‌ జమానాలోదేనని వైసీపీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు. అయితే.. ఎన్నికలకు ముందు కూటమి విద్యుత్తు చార్జీలు తగ్గిస్తామంటూ హామీ ఇచ్చినందున .. వైసీపీ హయాంలో పెరిగిన విద్యుత్తు చార్జీలను తగ్గించాల్సిందేనని పట్టుబట్టాలని జగన్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ డిమాండ్‌తోనే .. జనంలోకి వెళ్లాలని ముఖ్యనేతలకు పిలుపునిచ్చారు.


జనం అడిగితే ఏమి చెప్పాలి?

విద్యుత్తు చార్జీలను తగ్గించాలన్న డిమాండ్‌తో జనం దగ్గరకు వెళితే రాగల పరిణామాలను తలుచుకుని వైసీపీ కార్యకర్తలు, నేతలు ఆందోళనకు గురవుతున్నారు. అవి వైసీపీ ప్రభుత్వపాలనలో ప్రతిపాదించిన విద్యుత్‌ చార్జీలే కదా జనం అడిగితే ఏం సమాధానం చెప్పాలని మల్లగుల్లాలు పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్కూలుకు పిల్లలను పంపే తల్లుల ఖాతాలో ‘అమ్మ ఒడి’ కింద డబ్బులు వేస్తామంటూ ప్రతిపక్ష నేతగా జగన్‌ హామీ ఇచ్చారు. అయితే, 2019మే30న అఽధికారాన్ని చేపట్టిన జగన్‌....2020 జనవరిలోగానీ, అంటే ఏడునెలలకుగానీ ‘అమ్మ ఒడి’ని ప్రారంభించలేదు. తాము అధికారంలోకి వస్తే ‘అమ్మకు వందనం’ అందిస్తామని కూటమి నేతలు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. 2024 జూన్‌లో అధికారంలోకి వచ్చారు. అయితే, ఆరు నెలలు గడిచినా కూటమి ప్రభుత్వం ఇంకా పథకాన్ని ప్రారంభించలేదని జగన్‌ ఆరోపిస్తున్నారు. పనిలో పనిగా..తాను ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే అమ్మఒడిని ఇచ్చానని బుకాయించేందుకు ప్రయత్నించారు. దీంతో తమ అధినేత తీరుపై కేడర్‌ విస్మయం వ్యక్తం చేస్తోంది.

Updated Date - Dec 24 , 2024 | 03:59 AM