Share News

AP Politics: జగన్‌కి ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదా ?

ABN , Publish Date - Oct 27 , 2024 | 04:24 PM

వైఎస్ఆర్ మరణానంతరం చార్జిషీట్‌లో ఆయన పేరు చేర్పించింది మీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కాదా? అని విజయసాయిరెడ్డిని వైఎస్ షర్మిల నిలదీశారు. కేసుల నుంచి బయట పడటానికి పొన్నవోలుతో కలిసి ఈ కుట్ర చేయలేదా? అలా చేయకపోతే జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటగా అడ్వకేట్ జనరల్ పదవి ఎందుకు ఇచ్చారన్నారు. ఇప్పుడు మళ్ళీ తన స్వప్రయోజనం కోసం తల్లిని కోర్టుకు ఈడ్చిన విషపు నాగు జగన్ కాదా? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

AP Politics: జగన్‌కి ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదా ?
YS Sharmila

అమరావతి, అక్టోబర్ 27: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కి ఇంకా చంద్రబాబు పిచ్చి వీడినట్లు లేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. ఇప్పటికీ అద్దంలో చూసుకుంటే.. వైఎస్ జగన్‌కి చంద్రబాబే కనిపిస్తున్నట్లుగా ఉందన్నారు. చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడటానికో.. ఆయన బ్రాండింగ్‌ను ఫాలో అవ్వడానికో.. ఆయన్ని ఇంప్రెస్ చేయడానికో.. పని చేయాల్సిన అవసరం వైఎస్‌ఆర్ బిడ్డనైన తనకు లేదని. ఎన్నటికీ రాదని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.

ఆస్తి వివాదం నేపథ్యంలో సోదరుడు వైఎస్ జగన్‌, వైఎస్ షర్మిల మధ్య లేఖాస్త్రాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మధ్యలో స్పందించిన వైసీపీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయి రెడ్డికి షర్మిల్ ఇవాళ (ఆదివారం) గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘‘మీరు చదివింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా?’’ అంటూ విజయసాయిరెడ్డిని ఆమె ప్రశ్నించారు.


విజయసాయిరెడ్డికి చురకలు

ఆస్తుల గురించి నలుగురు మనవళ్లు, మనవరాళ్లకు సమాన వాటా ఉంటుందన్నది వైఎస్ఆర్ మ్యాండేట్‌ అని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల గుర్తు చేశారు. ‘‘ విషయం అబద్ధమని మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా?. మీరు సైతం జగన్ మోహన్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగిన వాళ్ళే. రాజకీయంగా, ఆర్థికంగా జగన్ వల్ల బలపడిన వాళ్ళే మీరు. ఇలా కాకపోతే ఎలా మాట్లాడుతారులే’’ అంటూ విజయసాయిరెడ్డికి చురకలంటించారు.


కాంగ్రెస్ కారణం కాదు...

ఇక వైఎస్ఆర్ మృ‌తికి కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికీ కారణం కాదని షర్మిల అన్నారు. రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వైఎస్ఆర్ తీసుకొచ్చారని అన్నారు. అలాంటి బంగారు బాతును ఎవరు చంపుకోరన్నారు. సొంత కళ్లను ఎవరజ పొడుచుకోరని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. అయితే వైఎస్ఆర్ మరణానికి చంద్రబాబు కారణం అయితే … మీరు అధికారంలో ఉన్న ఐదేళ్లు గాడిదలు కాశారా? అని ఆమె ప్రశ్నించారు.


వైఎస్ఆర్ మరణం, చంద్రబాబు పాత్రపై ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను నిలదీశారు. దర్యాప్తు చేసి నిజానిజాలు ఎందుకు బయట పెట్టలేదన్నారు. దోషులను ఎందుకు శిక్షించలేదని ప్రశ్నించారు. అనుమానం ఉండి.. ఈ ఐదేళ్లు అధికారంలో ఉండి.. ఎందుకు ఒక్క ఎంక్వైరీ కూడా వెయ్యలేదు? ఇది మీ చేతకానితనానికి నిదర్శనం కాదా? అంటూ సోదరుడు వైఎస్ జగన్‌కు వైఎస్ షర్మిల ప్రశ్నలు సంధించారు.


తల్లిని కోర్టుకు ఈడ్చిన విషపు నాగు

వైఎస్ఆర్ మరణానంతరం చార్జిషీట్‌లో ఆయన పేరు చేర్పించింది మీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కాదా? అని విజయసాయిరెడ్డిని నిలదీశారు. కేసుల నుంచి బయట పడటానికి పొన్నవోలుతో కలిసి ఈ కుట్ర చేయలేదా? అలా చేయకపోతే జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే, మొదటగా అడ్వకేట్ జనరల్ పదవి ఎందుకు ఇచ్చారన్నారు. ఇప్పుడు మళ్ళీ తన స్వప్రయోజనం కోసం తల్లిని కోర్టుకు ఈడ్చిన విషపు నాగు జగన్ కాదా? అని ప్రశ్నించారు.


సభ్యతా సంస్కారం ఉందని ఎలా అనుకోవాలి

అయితే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుతో తనకు ఎటువంటి వ్యక్తిగత సంబంధాలు లేవన్నారు. గతంలో వైఎస్ఆర్ తన బిడ్డ వివాహానికి చంద్రబాబు నాయుడుని పిలిచారన్నారు. అలాగే తాను సైతం చంద్రబాబును తన కుమారుడి వివాహానికి పిలిచానని చెప్పారు. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబును పెళ్లికి ఆహ్వానిస్తే.. తన చీర రంగు గురించి సైతం విపరీత అర్థాలు తీసే మీలాంటి వాళ్ళకు.. సభ్యతా సంస్కారం ఉందని ఎలా అనుకోవాలి? అంటూ సోదరుడు వైఎస్ జగన్‌పై వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Oct 27 , 2024 | 05:17 PM