వెంకటరెడ్డిలాంటి తీగలే కాదు..ప్యాలెస్ లోని పెద్ద డొంకలూ కదలాలి
ABN , Publish Date - Sep 29 , 2024 | 05:03 AM
‘వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీలో వెంకటరెడ్డిలాంటి తీగలే కాదు... పెద్ద డొంకలూ కదలాలి. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్ ఉన్నా విచారణ జరపాలి’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
వేల కోట్లు దోచుకున్న ఘనాపాఠి ఎవరో అందరికీ తెలుసు: షర్మిల
అమరావతి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీలో వెంకటరెడ్డిలాంటి తీగలే కాదు... పెద్ద డొంకలూ కదలాలి. ఆ పెద్ద డొంక ఏ ప్యాలె్‌సలో ఉన్నా విచారణ జరపాలి’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. శనివారం ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. ‘గనుల శాఖలో రూ.2,566 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టిన ఘనుడు వెంకటరెడ్డి అయితే... తెర వెనుక ఉండి సర్వం తానై రూ.వేల కోట్లు కాజేసిన ఆ ఘనాపాటి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఐదేళ్లుగా రాష్ట్రంలో అడ్డగోలుగా సహజ సంపదను దోచుకు తిన్నారు. అస్మదీయ కంపెనీలకు మైనింగ్ కాంట్రాక్టులు ఇచ్చారు. టెండర్లు, ఒప్పందాలు, ఏపీఎండీసీ నిబంధనలన్నీ బేఖాతరు చేసి అనుకున్న కంపెనీలకు టెండర్లను కనిపెట్టారు. ఎన్‌జీటీ నిబంధనలనూ తుంగలో తొక్కారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన నిధులను సొంత ఖజానాకు తరలించారు. గత ప్రభుత్వంలో మైనింగ్ కుంభకోణంపై ఏసీబీతో పాటు సమగ్ర విచారణ జరిపించాలి. పెద్ద తిమింగలాన్ని పట్టుకునేలా దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తున్నాం. సహజ వనరుల దోపిడీపై సీబీఐ విచారణ కోరండి’ అని షర్మిల విజ్ఞప్తి చేశారు. తన సందేశాన్ని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ట్యాగ్ చేశారు.