YS Sharmila : అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు మాకు తెలీదు
ABN , Publish Date - May 07 , 2024 | 04:42 AM
వీళ్లు ఊసరవెల్లులు. అవసరం తీరాక పుట్టుకనే అవమానిస్తారు. నా భర్త అనిల్‌పై అవినాశ్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు.
సీఎం హోదాలో ఉన్న వ్యక్తి హంతకుడిని కాపాడుతుంటే ఇక ప్రజల పరిస్థితి ఏమిటి?
జగన్ వైఎ్‌సకి కాదు.. మోదీకి వారసుడు: షర్మిల
కడప, మే 6(ఆంధ్రజ్యోతి): ‘వీళ్లు ఊసరవెల్లులు. అవసరం తీరాక పుట్టుకనే అవమానిస్తారు. నా భర్త అనిల్‌పై అవినాశ్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. నా భర్త చీకట్లో లాండ్ క్రూజర్‌లో వెళ్లి జమ్మలమడుగులో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డిని కలిశారని అంటున్నారు. అవినాశ్‌రెడ్డి చేసినట్లుగా అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు చేసే అలవాటు లేదు. నా భర్త బీజేపీ నేతలను కలవలేదు. కలవరు’ అని పీసీసీ చీఫ్ షర్మిల స్పష్టం చేశారు. సోమవారం ఇండియా కూటమి నేతలతో కలసి కడపలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘రూ.వెయ్యి కోట్ల పనులు అడిగానని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జగన్ పడేసిన కుక్క బిస్కెట్లు తినేవారే నా మీద నిందలు వేస్తున్నారు’’ అని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు రూ.వెయ్యి కోట్ల పనులు ఇవ్వలేదన్న కారణంతోనే జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ కొండా రాఘవరెడ్డి చేసిన ఆరోపణలపై ఆమె తీవ్రంగా స్పందించారు. డబ్బులు అడిగానని నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతా అని సవాల్ చేశారు. ‘జగన్ వైఎస్ వారసుడు కాదు.. మోదీ వారసుడు. కేంద్రమంత్రి జగన్‌ను మోదీ దత్తపుత్రుడు అన్నారు. జగన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అమిత్‌షా అంటున్నారు. కేంద్రంలో ఉండేది మీరే.. మరి ఐదేళ్లు ఎందుకు చర్యలు తీసుకోలేదు? కాగ్, ఈడీ ఏం చేస్త్తున్నాయి? బీజేపీ అడగకున్నా సరే జగన్ మద్దతిస్తున్నారు. పోర్టులను అప్పగిస్తున్నారు. విశాఖ ఉక్కును మనోడే ప్రశ్నార్థకం చేశాడు. బీజేపీకి జగన్ తొత్తుగా మారారు. చంద్రబాబు బీజేపీతో బహిరంగంగా పొత్తు పెట్టుకుంటే... జగన్ చీకటి పొత్తు పెట్టుకున్నారు’ అని షర్మిల విమర్శించారు.
గొడ్డళ్లతో వైసీపీ ఎమ్మెల్యేలు..
‘సొంత చిన్నాన్న వివేకా హత్యకేసు నిందితుడికే మళ్లీ జగన్ టికెట్ ఇచ్చారు. వైఎస్సార్, వివేకా ప్రజానాయకులు. వివేకాను చంపినవారిని స్వయానా సీఎం జగన్ కాపాడుతున్నారు. వైఎస్ తమ్ముడిని చంపిన వారికే శిక్ష పడలేదు. ఇక రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? యథా రాజా తథా ప్రజా అన్నట్లుగా ఉన్నారు కాబట్టే నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గొడ్డళ్లు పట్టుకుని తిరుగుతున్నారు’ అని షర్మిల ఆరోపించారు. సోమవారం వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. తనకు అడ్డు వస్తే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఎవరినైనా గొడ్డలితో నరుకుతారంట, మళ్లీ మళ్లీ ఇలాంటి నేరస్తులను చట్టసభలకు పంపుదామా? అని ప్రశ్నించారు. గొడ్డలి అవినాశ్ కావాలో, కొంగుచాచి అడుగుతున్న వైఎస్సార్ బిడ్డ కావాలో తేల్చుకోవాలన్నారు. కడప స్టీలు ప్లాంటు కోసం గొడ్డలి అవినాశ్‌రెడ్డి పోరాటం చేశాడా అని ప్రశ్నించారు. ఆయన కోసం తప్ప ప్రజల కోసం ఢిల్లీకి పోలేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఓటు వేస్తే నెత్తిన కుచ్చు టోపీ, చేతిలో చిప్ప పెట్టారని షర్మిల మండిపడ్డారు.
బద్వేలులో షర్మిలపై కేసు నమోదు
బద్వేలు టౌన్, మే 6: ఎన్నికల ప్రచారంలో భాగంగా కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించారంటూ పీసీసీ చీఫ్ షర్మిలపై బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. వివేకా హత్యకేసు కోర్టులో ఉన్నందున ఎన్నికల్లో ఎవరూ ప్రస్తావించకూడదని కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఈ నెల 1న బద్వేలు బహిరంగ సభలో హత్యగురించి షర్మిల పదేపదే వ్యాఖ్యలు చేశారని బద్వేలు నోడల్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ ఎం.కృష్ణ ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 3న షర్మిలపై కేసు నమోదు చేశారు.
భూ మాఫియా బాధితులకేం చెబుతారు?
అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పేట్రేగిపోతున్న భూమాఫియా దౌర్జన్యాల్లో నలిగిపోతున్న సామాన్య ప్రజలకేం సమాధానం చెబుతారని సీఎం జగన్‌ను షర్మిల నిలదీశారు. న్యాయ నవ సందేహాల పేరిట తొమ్మిది ప్రశ్నలు షర్మిల సంధిస్తూ సోమవారం లేఖ రాశారు. ఈ ప్రశ్నలకు తక్షణమే సమాధానం చెప్పాలని జగన్‌ను షర్మిల కోరారు.
రాష్ట్రంలో పౌరుల భూ హక్కులు, వ్యక్తిగత ఆస్తులు, వాటి హక్కులకు భంగం కలిగేలా భూమాఫియా కబ్జాలకు పాల్పడుతున్న విషయం మీ దృష్టికి వచ్చిందా?
ల్యాండ్ టైటిల్ యాక్టు ద్వారా ప్రైవేటు భూముల కబ్జాకు కుట్ర జరుగుతున్నట్లు అభియోగాలున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుందా?
వ్యక్తిగత స్థిరాస్తులకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకంపై మీ ఫొటో ఎందుకన్న ప్రశ్నకు మీవద్ద సమాధానం ఉందా? ఉంటే చెప్పండి.
సుమారు 14 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు కబ్జాలకు గురయ్యే ప్రమాదంలో ఉన్నాయి. సుమారు 4లక్షల ఎకరాలకు పైగా ఉన్న దేవాలయాల భూముల్లో 40 వేల ఎకరాలు కనబడటం లేదని స్వయానా మీ మంత్రి అన్నారు. దీనిపై చర్యలేంటి?
రాష్ట్రంలో 14లక్షల డీకేటీ భూముల అమ్మకాలు, కొనుగోళ్లపై ఉన్న ఆంక్షల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయనుందని తెలుసుకున్న వైసీపీ నాయకులు కారుచౌకగా పేదల నుంచి వాటిని చాలావరకూ కాజేశారు. ఇది ఇన్‌సైడర్ ట్రేడింగ్ కాక మరేమవుతుంది?
జగనన్న కాలనీల కోసం రూ.56,102 కోట్లు వెచ్చించి జరిపిన 71,811 ఎకరాల భూమి కొనుగోలులో వైసీపీ నాయకుల బినామీలే సుమారు రూ.30,000 కోట్లు దోచినట్లు ఆరోపణలున్నాయి. విచారణకు సిద్ధమా?
ఇసుక మాఫియా దాష్టీకాల వల్ల అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి, 42మంది చనిపోతే, తగు విచారణ జరిపి ఎవరినైనా బాధ్యుల్ని చేశారా?
దసపల్లా భూములు, సింహాచలం దేవస్థానం భూముల దోపిడీ బాగోతం ఎప్పటికి తేలుస్తారు?
విశాఖ తీర ప్రాంత భూములు ఇప్పటికే కబ్జాలపాలయ్యాయి. రుషికొండను బోడిగుండు చేశారు. ఎన్జీటీ, కోర్టుల ఆక్షేపణలకు మీ సమాధానం ఏంటి?