Share News

YS Sunitha Reddy: మేం మాట్లాడుతుంటే వైసీపీకి దడదడ

ABN , Publish Date - Apr 20 , 2024 | 07:13 AM

‘హత్య విషయంపై మేం అక్కాచెల్లెళ్లం మాట్లాడుతుంటే వైసీపీ నేతలకు ఓడిపోతామనే భయం పట్టుకుంది. అందుకే కోర్టుకు వెళ్లారు. అయినా వీరు వేసిన పిటిషన్‌లో కోరింది ఒకటి.. కోర్టు ఇచ్చిన ఆర్డర్‌ మరొకటి. దీనిపై సుప్రీంకోర్టుకైనా వెళ్తాం’ అని...

YS Sunitha Reddy: మేం మాట్లాడుతుంటే వైసీపీకి దడదడ

ఓటమి భయంతోనే కోర్టుకెళ్లారు

కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకైనా వెళ్తాం

చార్జిషీటు అందరికీ అందుబాటులోనే

అవినాశ్‌ అఫిడవిట్‌లోనూ ఈ కేసు!

ఇవేమీ మాట్లాడొద్దంటే ఎలా?

వివేకా కుమార్తె సునీత ప్రశ్న

పులివెందుల, ఏప్రిల్‌ 19: ‘హత్య విషయంపై మేం అక్కాచెల్లెళ్లం మాట్లాడుతుంటే వైసీపీ నేతలకు ఓడిపోతామనే భయం పట్టుకుంది. అందుకే కోర్టుకు వెళ్లారు. అయినా వీరు వేసిన పిటిషన్‌లో కోరింది ఒకటి.. కోర్టు ఇచ్చిన ఆర్డర్‌ మరొకటి. దీనిపై సుప్రీంకోర్టుకైనా వెళ్తాం’ అని హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత వెల్లడించారు. ఆమె శుక్రవారం పులివెందులలో తన ఇంట్లో విలేకరులతో మాట్లాడారు. వివేకా హత్య కేసుపై తెలంగాణలోని నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ నడుస్తోందని.. అయితే దానిపై బయట మాట్లాడకూడదని ఇక్కడి కడప కోర్టు ఆర్డర్‌ ఇచ్చిందని అన్నారు. ‘జగన్‌, అవినాశ్‌లపై ఫలానావారు మాట్లాడొద్దు.. ఇప్పటికే సోషల్‌ మీడియాలో ఉంటే వాటిని తొలగించేలా ఆదేశాలివ్వాలని వైసీపీ వారు పిటిషన్‌ వేశారు. వారు అడిగింది ఒకటి, కోర్టు ఆర్డర్‌ ఇచ్చింది మరొకటి. దీనిపై లాయర్లతో చర్చించి హైకోర్టుకు వెళ్లాలో, సుప్రీంకోర్టుకు వెళ్లాలో నిర్ణయించుకుంటాం. పై కోర్టులో ఈ ఆర్డర్‌ తప్పకుండా వీగిపోతుందని, మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది’ అని తెలిపారు.


హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఆ తప్పు కారణంగా..

వివేకా హత్య కేసు ఐదేళ్లుగా ప్రజల్లో ఉందని.. ఇప్పుడా విషయం మాట్లాడకూడదని అనడం ఎలా సమంజసం అవుతుందో చెప్పాలని అన్నారు. ఇటువంటి ఉత్తర్వులు తీసుకొచ్చి తనను బెదిరించాలని చూస్తున్నారని.. భయపడేది లేదని స్పష్టం చేశారు. పులివెందుల ప్రజలు, కడప ప్రజలు, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల అండతో పోరాడతామన్నారు. ‘రాష్ట్రంలో మళ్లీ తమదే ప్రభుత్వమని వైసీపీ భావిస్తోంది. ఈ తరుణంలో అక్కాచెల్లెళ్లు రంగంలోకి దిగి సీన్‌ మార్చేస్తున్నారని ఆ పార్టీ నేతల గుండెల్లో దడ పుడుతోంది. మేం మాట్లాడుతున్న మాటలకు, ప్రజలకు వివరిస్తున్న విషయాలకు వారి గుండె దడదడా కొట్టుకుంటోంది. వివేకా హత్య కేసును సీబీఐ విచారణ చేసింది. చార్జిషీటు కూడా ఫైల్‌ చేసింది. ఇది పబ్లిక్‌ డొమైన్‌లో ఉంది. గత ఐదేళ్లలో దీని గురించి చాలా మంది మాట్లాడారు. ఎవరైతే కేసు పెట్టారో వారు, వారి మద్దతుదారులు కూడా చాలా రకాలుగా మాట్లాడారు. నిందలు వేశారు. ఐదేళ్లుగా ఎక్కువ మాట్లాడకూడదని నేను చాలా ప్రయత్నించాను. గత కొద్దికాలంగానే మాట్లాడుతూ వస్తున్నా. నేను మాట్లాడడం మొదలుపెట్టగానే వాళ్లు భయపడ్డారు. మేం ఇలాగే మాట్లాడుతూ పోతే ఎలక్షన్‌లో కచ్చితంగా ఓడిపోతామని భయపడి కోర్టుకు వెళ్లినట్లుగా అనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 20 , 2024 | 07:13 AM