YSRCP: మీ ఫ్యామిలీ మొత్తాన్నీ లేపేస్తాం
ABN , Publish Date - Nov 04 , 2024 | 04:40 AM
కూలి పనులకు వెళ్తేగానీ పూటగడవని నిరుపేద దళిత కుటుంబం... పైగా టీడీపీ అంటే అభిమానం... ఇంకేముంది వైసీపీ మూకలు రెచ్చిపోయాయి.
దళిత కుటుంబంపై వైసీపీ మూకల దాష్టీకం
టీడీపీ కార్యకర్తపై దాడి.. పోలీసులకు ఫిర్యాదు
కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులు
భయంతో ఒంటికి నిప్పంటించుకున్న యువకుడు
80 శాతం కాలిన శరీరం.. పరిస్థితి విషమం
శ్రీసత్యసాయి జిల్లా మారాల గ్రామంలో దారుణం
బుక్కపట్నం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): కూలి పనులకు వెళ్తేగానీ పూటగడవని నిరుపేద దళిత కుటుంబం... పైగా టీడీపీ అంటే అభిమానం... ఇంకేముంది వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. దాడిచేసి విచక్షణారహితంగా చావబాదడమే కాక.. దీపావళి పండక్కి ఇంటికొచ్చిన యువకుడిని ‘కేసు వెనక్కు తీసుకోకుంటే.. మీ ఫ్యామిలీ మొత్తాన్నీ చంపేస్తాం’ అని బెదిరించాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువకుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. శరీరం 80 శాతం కాలిపోవడంతో ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం మారాల గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మారాల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నారాయణస్వామి కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతడికి భార్య ఓబుళమ్మ, కుమారులు గౌతమ్, నందీశ్‌కుమార్ ఉన్నారు. రెండు నెలల క్రితం గ్రామంలో పీర్ల పండుగ సందర్భంగా నారాయణస్వామిపై అదే ఊరికి చెందిన వైసీపీ నాయకుడు, మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ రామమోహన్ దాడిచేసి విచక్షణారహితంగా కొట్టాడు. దీనిపై అప్పట్లో నారాయణస్వామి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదే విషయంపై బుక్కపట్నం పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐ కృష్ణమూర్తితో మాట్లాడేందుకు నారాయణస్వామి ఈ నెల 2న పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఆయన కోసం కుమారుడు గౌతమ్ స్టేషన్‌కు వస్తుండగా.. మార్గమధ్యంలో బుచ్చయ్యగారిపల్లి వద్ద వైసీపీ నాయకులు రామమోహన్, ప్రసాద్, ఓబుళప్ప, గోపి, సన్నరాముడు అతన్ని అడ్డగించారు. ‘నీ తండ్రి ఫిర్యాదు వెనక్కు తీసుకోవాలి. లేదంటే మీ కుటుంబాన్ని మొత్తం హతమారుస్తాం’ అని బెదిరించారు. గౌతమ్‌ను దుర్భాషలాడారు. దీంతో మానసిక వేదన చెందిన గౌతమ్ పుట్టపర్తిలోని తమ తాత్కాలిక నివాసంలో శనివారం అర్ధరాత్రి ఒంటిపై పెట్రోల్ పోసుకుని, నిప్పు అంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని కుటుంబసభ్యులు బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. గౌతమ్ పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ‘మేం టీడీపీ వాళ్లమని.. మా నాన్నపై వాళ్లు దాడి చేశారు. ఫిర్యాదు వెనక్కు తీసుకోకపోతే మా కుటుంబాన్ని మొత్తాన్నీ చంపేస్తామని బెదిరించారు. దీంతో భయమేసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను’ అని గౌతమ్ పోలీసులకు వాగ్మూలమిచ్చాడు. గౌతమ్‌కు ఇంకా వివాహం కాలేదు. ప్రస్తుతంలో బెంగళూరులో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబంతో కలిసి దీపావళి జరుపుకొనేందుకు స్వగ్రామానికి వచ్చాడు. వైసీపీ నేతల దౌర్జన్యంతో ఆత్మహత్యకు ప్రయత్నించాడు.