YSRCP: నాడు అలా.. నేడు ఇలా.. రైతులను ఘోరంగా మోసం చేసిన వైసీపీ..
ABN , Publish Date - Dec 13 , 2024 | 11:42 AM
YSRCP: ఐదేళ్లూ రైతు భరోసాను సాకుగా చూపి పథకాలు, రాయితీలకు మంగళం పాడింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేసింది. ఇప్పుడు అధికారం దూరమయ్యేసరికి మొసలి కన్నీరు కారుస్తోంది.
వ్యవసాయ రంగాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఐదేళ్లూ రైతు భరోసాను సాకుగా చూపి పథకాలు, రాయితీలకు మంగళం పాడింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేసింది. మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల వైపే చూడలేదు. ఇప్పుడు అధికారం దూరమయ్యేసరికి మొసలి కన్నీరు కారుస్తోంది. దగా ప్రభుత్వం అంటూ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఐదేళ్ల అధికారంలో ఏమీ చేయని వైసీపీ, ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని వాదించడాన్ని రైతులు విమర్శిస్తున్నారు.
విజయనగరం, డిసెంబరు 13: జిల్లా వ్యవసాయాధారితం. వరి తరువాత మొక్కజొన్న, పత్తి, వేరుశనగ పంటలను ఎక్కువగా పండిస్తుంటారు. గత ప్రభుత్వం నుంచి రైతుకు ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం దక్కలేదు. తాను అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.15 వేలు చొప్పున సాయం అందిస్తానని 2019 ఎన్నికల్లో జగన్ ప్రకటించారు. అందులో రూ.7500 మాత్రమే. అందించారు. కేంద్రం ఇచ్చిన రూ. 6 వేలు సైతం తన ఖాతాలో వేసుకున్నారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సాగుకు సాయంగా ఏటా రూ.20 వేలు అందిస్తామని హామీ ఇచ్చింది. అమలు చేసేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించింది. సంక్రాంతి నాటికి అమలుకు సన్నాహాలు చేస్తోంది. కాగా జిల్లాలో ప్రధాన సాగునీటి వనరులుగా తోటపల్లి, తారకరామ తీర్థసాగర్, మడ్డువలస, తాటిపూడి, వెంగళరాయసాగర్, ఒట్టిగెడ్డ ప్రాజెక్టులున్నాయి. ఇవి గత ఐదు సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. వాటిని ముందుగా గాడిలో పెడితేనే వ్యవసాయాన్ని ప్రోత్సహించినట్టు అవుతుంది. జిల్లాలో 97,397 హెక్టార్లలో రైతులు వరిసాగు చేస్తున్నారు. మొక్కజొన్న, వేరుశనగ పత్తి, చెరడు, అపరాలు వేలాది ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వీటన్నింటికీ పుష్కలంగా నీరు అందించాల్సిన అవసరం ఉంది.
కళ తప్పిన మార్కెట్ కమిటీలు..
జిల్లాలో మార్కెటింగ్ శాఖ సైతం నిర్వీర్యమైంది. గతంలో ఆర్థిక పరిపుష్టితో మార్కెట్ కమిటీలు కళకళలాడేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాటి గోదాములను వినియోగించే పౌరసరఫరాల శాఖ, గృహనిర్మాణ శాఖలు అద్దెను సక్రమంగా చెల్లించడం లేదు. దీంతో మార్కెట్ శాఖలో ఉద్యోగులు, సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకు కూడా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. గత ఐదు సంవత్సరాల్లో జిల్లాలో మార్కెటింగ్ శాఖకు సెస్ రూపంలో రూ.50 కోట్ల వరకూ ఆదాయం సమకూరింది. గోదాముల అద్దె రూపంలో మరి కొంత ఆదాయం వచ్చింది. కానీ ఆదాయంలో నేరుగా 45 శాతం ప్రభుత్వానికి జమ అయింది. దీంతో మార్కెటింగ్ శాఖ సిబ్బందికి సక్రమంగా జీతాలు కూడా చెల్లించలేదు.
'సహకారం' సున్నా..
జిల్లాలో సహకార సంఘాల పరిస్థితి అలాగే ఉంది. ఉమ్మడి జిల్లాలో 112 పీఏసీఎన్‌లు ఉన్నాయి. సహకార రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నా జిల్లాలో ఆ పరిస్థితి కనిపించలేదు. పైగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు రైతు సేవ కంటే వాణిజ్య ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నాయన్న విమర్శ ఉంది. చాలా వాటికి సొంత భవనాలు కూడా లేవు. రైతులు పండించే పంటలను ధర వచ్చే వరకూ నిల్వ చేయడం వీటి ప్రధాన విధి. అటువంటిదేమీ జిల్లాలో కనిపించలేదు. చాలా చోట్ల గోడౌన్ల నిర్మాణం చేపట్టగా ఎనిమిది చోట్ల మాత్రమే పూర్తయ్యాయి. ఐదేళ్లుగా రైతు భరోసా కేంద్రాల పేరు చెప్పి.. ప్రాథమిక వ్యవసాయ పరపతి సేవా సంఘాల సేవలను పూర్తిగా తొక్కిపెట్టారు. వ్యవసాయ అనుబంధరంగాలను కూడా సర్వనాశనం చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు.
Also Read:
తిరుమలలో అన్నమయ్య ఇంటిని తిరిగి నిర్మించాలి
పేర్ని నాని భార్య జయసుధపై కేసు నమోదు..
For More Andhra Pradesh News and Telugu News..