Share News

YSRCP : ‘డిజిటల్‌’తో దోపిడీ..!

ABN , Publish Date - Dec 03 , 2024 | 03:34 AM

సొంత బాకా ఊదించుకోవడానికి ప్రకటనల రూపంలో రూ.వందల కోట్ల ప్రభుత్వ ధనాన్ని తన రోత మీడియాకు సమర్పించారు. వలంటీర్లకు తన రోత పత్రికను అంటగట్టి కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి స్వాహా చేశారు.

YSRCP : ‘డిజిటల్‌’తో దోపిడీ..!

  • ఇప్పటికి తేలింది రూ.50 కోట్లు

  • ‘సోషల్‌’ సైకోలకు గత ఐదేళ్లూ రాజపోషణే

  • డిజిటల్‌ కార్పొరేషన్‌ను కొల్లగొట్టి జీతాలు

  • రోత మీడియా, ఐ-ప్యాక్‌ల సిబ్బందికీ, ఐడ్రీమ్‌ ఓనర్‌ ఇంటి పనోళ్లకూ...

  • రాంగోపాల్‌ వర్మ, సజ్జల భార్గవ్‌, దేవేందర్‌రెడ్డిలకూ భారీగా చెల్లింపులు

  • బాకా సైట్లు, యూట్యూబ్‌ చానళ్లకు రూ.కోట్లలో యాడ్లు

  • కార్పొరేషన్‌లో ఫోరెన్సిక్‌ ఆడిట్‌

  • త్వరలో ప్రభుత్వానికి విజిలెన్స్‌ నివేదిక

  • విజిలెన్స్‌ పరిశీలనలో అక్రమాలు వెలుగులోకి..

  • అసభ్యకరమైన భాషతో చంద్రబాబు, పవన్‌, లోకేశ్‌, అనితతోపాటు, వారి కుటుంబ సభ్యులపై సైకోయిజం ప్రదర్శించిన వైసీసీ సోషల్‌ మీడియా బాధ్యులు సజ్జల భార్గవ రెడ్డి, గుర్రంపాటి దేవేందర్‌ రెడ్డి లాంటి వారికి భారీగానే చెల్లింపులు జరిగాయి.

  • ఐ డ్రీమ్‌ చానల్‌ యజమాని ఇంటికొచ్చి పిల్లలకు ట్యూషన్‌ చెప్పిన టీచర్లకు కూడా ఇక్కడినుంచే చెల్లింపులు జరిగాయి.

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

సొంత బాకా ఊదించుకోవడానికి ప్రకటనల రూపంలో రూ.వందల కోట్ల ప్రభుత్వ ధనాన్ని తన రోత మీడియాకు సమర్పించారు. వలంటీర్లకు తన రోత పత్రికను అంటగట్టి కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి స్వాహా చేశారు. చివరికి తన రాజకీయ ప్రత్యర్థులపై బురద జల్లేందుకు తన పత్రిక, చానల్‌ ఉద్యోగులు, వైసీపీ సోషల్‌ మీడియా సైకోలకు వందల కోట్ల రూపాయలు పంచేశారు. ఇదీ వైసీపీ హయాంలో... నాటి సీఎం జగన్మోహన్‌ రెడ్డి చేసిన ఆర్థిక అరాచకం! అయితే, ఈ చెల్లింపులకు డిజిటల్‌ కార్పొరేషన్‌ నిధులను అడ్డగోలుగా వాడుకున్నట్లు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. డిజిటల్‌ కార్పొరేషన్‌లో ఆనాడు పాల్పడిన అక్రమాలు, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కొన్ని రోజులుగా చేస్తున్న ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో సోషల్‌ సైకోలు కొందరు విధులకు హాజరు కాకుండానే జీతాలు తీసుకున్నట్లు బయటపడింది. ఒక యూ ట్యూబ్‌ చానెల్‌ యజమాని ఇంట్లో పనోళ్ల నుంచి, నాటి విపక్ష నేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై బురద జల్లిన ప్రతి యూ ట్యూబ్‌ చానెల్‌కు కూడా ఇక్కడి నుంచే చెల్లింపులు జరిగాయి.


జగన్‌ ఎన్నికల ప్రచారంలో డ్రామా సీన్లు రక్తికట్టించేందుకు ప్రయత్నించి అట్టర్‌ ఫ్లాప్‌ అయిన ఐ-ప్యాక్‌, ఐడ్రీమ్స్‌తోపాటు బూతులతో ప్రతిపక్షాలపై విరుచుకుపడే సజ్జల భార్గవ రెడ్డి, మార్ఫింగ్‌ ఫొటోలతో టీడీపీ, జనసేన నేతల పరువు తీసేందుకు ప్రయత్నించే సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కూడా ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ నుంచి లబ్ధి పొందినట్లు తెలుస్తోంది. మొత్తం ఆరు విభాగాలుగా చేసిన చెల్లింపుల్లో ఇప్పటి వరకూ నాలుగు విభాగాలకు సంబంధించిన ఫోరెన్సిక్‌ ఆడిట్‌ పూర్తి చేయించిన విజిలెన్స్‌ అధికారులు యాభై కోట్ల రూపాయలకుపైగా అక్రమ చెల్లింపులను గుర్తించారు. మరో రెండు పూర్తి అయితే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని విజిలెన్స్‌ వర్గాల సమాచారం.

  • సైకోలకు రాజపోషణ..

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అంటూ....2020 సెప్టెంబరు 23న వైసీపీ ప్రభుత్వం ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్‌ తరగతులు, లైబ్రరీలు ఏర్పాటు చేస్తామని అప్పట్లో బయటికి ప్రకటించింది. అంతర్గతంగా మాత్రం.. జగన్‌కు బాకా ఊదాలి.. ప్రతిపక్షాలపై బురద జల్లాలి.. అనే లక్ష్యంతో వైసీపీ కార్యకర్తలు, సోషల్‌ సైకోలు ఇందులో ఉద్యోగులుగా ఆనాడు చేరి జీతాలు తీసుకున్నారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, నారా లోకేశ్‌, వంగలపూడి అనిత.. వారి కుటుంబ సభ్యులను మాత్రమే కాకుండా ఏకంగా హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు సీజేఐ కుమార్తెలను సైతం వదిలిపెట్టలేదు. ఇటువంటి వారికి వేల రూపాయల నుంచి లక్షల రూపాయల్లో వేతనాల కింద ప్రతి నెలా రెండు కోట్ల చొప్పున జగన్‌ ప్రభుత్వం చెల్లించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉంటూ వైసీపీ సోషల్‌ మీడియా విభాగం ఇచ్చిన కంటెంట్‌ పోస్టు చేస్తూ అసలు ఉద్యోగానికే రాని వారంతా జగన్‌ హయాంలో జీతాలు తీసుకున్నారు. అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని దారుణంగా ఓడించి ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టడంతో దర్యాప్తు సంస్థలు గత ఐదేళ్ల అక్రమాలను వెలికి తీస్తున్నాయి.


తనకు సొంత మీడియా లేదంటూ పదే పదే అబద్ధాలు చెప్పే జగన్‌ తన రోత పత్రిక, టీవీకి వందల కోట్ల రూపాయల ప్రకటనలు జారీ చేయించుకున్నారు. ఇందుకు సహకరించిన నాటి సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌ రెడ్డిపై పాత్రికేయ సంఘాలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. పత్రికల సర్క్యులేషన్‌ పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా, అడ్డగోలుగా ఆనాడు ముఖ్యమంత్రి జగన్‌ సొంత మీడియాకు వందల కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును ఆయన దోచిపెట్టారని ఆక్షేపించాయి. చంద్రబాబు ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించడంతో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ప్రాథమిక సమాచారాన్ని సేకరించింది. అందులో రోత పత్రిక ఉద్యోగులకు అడ్డగోలుగా జీతాలు.. జగన్‌ మీడియాకు వందల కోట్ల ప్రకటనలు ఇచ్చినట్లు తేలింది.

  • కార్పొరేషన్‌ను దోచేశారు..

ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌లో అక్రమాలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం పలు అవకతవకలను గుర్తించింది. అందులో కొన్ని...

  • ఐ డ్రీమ్స్‌ యూ ట్యూబ్‌ చానల్‌ యజమాని చైర్మన్‌గా, మధుసూధన్‌ రెడ్డి ఎండీగా గత ప్రభుత్వం డిజిటల్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసింది.

  • అర్హత, అవసరంతో పనిలేకుండా 129 మంది ఉద్యోగుల్ని(ఎక్కువగా ఎంపీ అవినాశ్‌ రెడ్డి సిఫారసు) నియమించుకుని కార్పొరేషన్‌ నుంచి ఇష్టారాజ్యంగా జీతాలు చెల్లించింది. అంటే ఒకే పనిచేసే ఉద్యోగుల్లో ఒకరికి పాతిక వేలు, మరొకరికి 40వేలు, ఇంకొకరికి 70వేలు, లక్ష రూపాయలు కూడా చెల్లించింది.

  • జగన్‌ మీడియాతోపాటు వైసీపీ సోషల్‌ మీడియాలో 49మంది పనిచేశారు. వారికి నాడు కార్పొరేషన్‌ సొమ్ము జీతాల రూపంలో చేరింది.

  • ప్రతిపక్ష నేతలతోపాటు హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు సీజేఐ కుటుంబ సభ్యులపై అనుచిత పోస్టులు సోషల్‌ మీడియాలో పెట్టిన వాళ్లు సైతం డిజిటల్‌ కార్పొరేషన్‌ నుంచే జీతాలు తీసుకున్నారు.


  • జగన్‌కు ఆనాడు బాకా ఊదుతూ.. టీడీపీ, జనసేన నేతలపై బురద జల్లే.. యూ ట్యూబ్‌ చానెళ్లు, వెబ్‌ సైట్లకు కూడా డిజిటల్‌ కార్పొరేషన్‌ నుంచే ఆర్థిక సహకారం అందింది.

  • వైసీపీని ఎన్నికల్లో గెలిపించేందుకు శక్తివంచన లేకుండా పనిచేసినా...దారుణంగా విఫలమైన ఐ-ప్యాక్‌లో సిబ్బంది కొందరికి కార్పొరేషన్‌ నుంచే డబ్బులు ఇచ్చారు.

  • జగన్‌కు భజన చేసే యాడ్స్‌ కోసం గూగుల్‌కు.. జగన్‌పై సినిమా తీసి చంద్రబాబు, పవన్‌పై సెటైర్లు వేసే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు కూడా ప్రకటనల రూపంలో చెల్లింపులు ఇక్కడినుంచే జరిగాయి.

  • డిజిటల్‌ కార్పొరేషన్‌లో కీలక స్థానంలో పనిచేసిన రాయలసీమకు చెందిన వ్యక్తి... జాతీయ స్థాయిలో పేరుగాంచిన హోటల్‌ ఫ్రాంచైజీ తీసుకుని తిరుపతిలో నిర్మాణం చేస్తున్నట్లు గుర్తించిన విజిలెన్స్‌ అధికారులు, ఆ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించనున్నారు.

Updated Date - Dec 03 , 2024 | 03:34 AM