Share News

YSRCP: జగన్ సమావేశానికి డుమ్మా.. ఆ ఇద్దరి ఖేల్ ఖతం..!

ABN , Publish Date - Dec 12 , 2024 | 02:24 PM

వైసీపీ అధినేత జగన్ రెడ్డి బుధవారం తన నివాసంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన తమ పార్టీ ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జిలు, ముఖ్య నాయకులతో..

YSRCP: జగన్ సమావేశానికి డుమ్మా.. ఆ ఇద్దరి ఖేల్ ఖతం..!
YSRCP

చీరాల, డిసెంబర్ 12: వైసీపీ అధినేత జగన్ రెడ్డి బుధవారం తన నివాసంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన తమ పార్టీ ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జిలు, ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి దిశానిర్దేశం చేయడమే సమావేశ ముఖ్య ఉద్దేశం. అయితే అందులో ఉమ్మడి ప్రకాశంలో భాగంగా, బాపట్ల జిల్లాకు సంబంధించి అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల ఇన్చార్జిలు డుమ్మా కొట్టారు. పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జీకి ఉద్వాసన తప్పదనే భావనను వ్యక్తపరిచినట్లు సమాచారం. ఆయన స్థానంలో గాదె మధుసూదనరెడ్డిని నియమించే అవకాశం ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, దాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పడమే ప్రధానంగా జగన్ ప్రస్తావించారు.


సమావేశానికి చీరాల నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్ హాజరుకాగా, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాలకు చెందిన పాణెం హనిమిరెడ్డి, యడం బాలాజీ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జగన్ పర్చూరు. నియోజకవర్గ విషయమై మాట్లాడుతూ అతనెక్కడో ఉంటూ, ఇక్కడేం చేస్తాడంటూ యడం బాలాజీ తీరును ప్రస్తావించినట్లు తెలిసింది. అందుకు సంబంధించి పర్చూరు మండలానికి చెందిన ముఖ్య నాయకుడు, బాలాజీకి అనుంగ అనుచరునిగా గత ఎన్నికల్లో కొనసాగిన నేత.. నాలుగు రోజుల్లో బాలాజీ వస్తారని చెప్పినట్లు తెలిసింది. అయితే అక్కడ నాలుగు రోజులు, ఇక్కడ నాలుగు రోజులు అంటే ఎలా? జనాలతో ఉండాలని చెప్పినట్లు తెలిసింది. ఆ క్రమంలో వైసీపీ పర్చూరు నియోజవకర్గ ఇన్చార్జిగా గాదె మధుసూదనరెడ్డి పేరు ఖరారు చేసే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు ఆ పార్టీ శ్రేణుల్లో చర్చించుకుంటున్నారు.


వాస్తవానికి గతంలోనే మధుసూదన రెడ్డిని నియమించాల్సి ఉంది. అయితే సామాజికవర్గాల కూర్పులో అద్దంకి, పర్చూరు ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారవుతారనే కోణంలో ఆలోచించి జగన్ అప్పట్లో వెనకడుగు వేశారు. ఈ క్రమంలో పర్చూరు అంశంపై ప్రస్తావన జరిగే సమయంలో మార్టూరు మండలంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓ ముఖ్యనాయకుడు మాట్లాడుతూ సామాజిక వర్గాల సమతూకంలో నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని, అందుకు పొరుగు నియోజకవర్గ ఇన్‌చార్జి పేరును సూచించినట్లు సమాచారం. మొత్తమ్మీద గైర్హాజరు అయిన ఇన్చార్జిలకు ప్రతినిధులుగా వారి తరపువారు హాజరై మమ అనిపించారని, కొందరు ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు కూడా సమావేశానికి డుమ్మా కొట్టినట్లు సమాచారం.


Also Read:

దివ్యాంగుల పెన్షన్‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

వైసీపీకి మరో భారీ షాక్

వైసీపీ నేత మాస్టర్ ప్లాన్.. తెలిస్తే ప్యాంట్ తడవాల్సిందే..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Dec 12 , 2024 | 02:24 PM