Share News

AP Politics: వైసీపీలో లుకలుకలు..నేతల్లో పెరిగిన తీవ్ర అసంతృప్తి..

ABN , Publish Date - Jan 03 , 2024 | 10:45 AM

ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికార వైసీపీ పార్టీ ఆ దిశగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే నిన్న పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలను ప్రకటించగా అనేక మంది నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు వారు పార్టీ మారేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

AP Politics: వైసీపీలో లుకలుకలు..నేతల్లో పెరిగిన తీవ్ర అసంతృప్తి..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హీట్ మొదలైంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ఆ దిశగా కసరత్తు చేస్తు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిల రెండో జాబితాను ప్రకటించింది. కొత్తగా 27 మంది పార్టీ ఇన్‌చార్జిలను నియమిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో కీలక నేతలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు. ఆ క్రమంలో అనేక మందిని పలు ప్రాంతాలకు మార్చగా..వారిలో ఇంకొంత మందికి అసలు అవకాశం దక్కలేదు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న నేతలు పార్టీ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఆయా పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లా రాజాం (ఎస్సీ) ఎమ్మెల్యే కంబాల జోగులును అనకాపల్లి జిల్లా పాయకరావుపేట (ఎస్సీ) నియోజవర్గానికి బదిలీ చేశారు. దీంతోపాటు వైసీపీ స్థాపించిన నాటి నుంచి జగన్‌ వెంటనే ఉంటున్న గొల్ల బాబూరావుకు షాకిచ్చారు. మరోవైపు అనకాపల్లిలో మంత్రి అమర్నాథ్‌ స్థానంలో మలసాల భరత్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే విశాఖకు పాలనా రాజధాని వచ్చేస్తోందని పలు మార్లు ప్రకటనలు చేసిన అమర్నాథ్‌కు జాబితాలో చోటు కల్పించకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ను మార్చి.. వరుపుల సుబ్బారావుకు ఛాన్స్ ఇచ్చారు.


అంతేకాదు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ను రాజమండ్రి సిటీ ఇన్‌చార్జిగా పంపారు. రాజమండ్రి లోక్‌సభకు అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి స్థానంలో బీఎస్‌ మక్బూల్‌ అహ్మద్‌ను నియమించారు. యర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేశ్‌ స్థానంలో తాడిపత్రి చంద్రశేఖర్‌ను ఇన్‌చార్జిగా పెట్టారు. వైసీపీ స్థాపించిన నాటి నుంచి జగన్‌ వెంట నడచిన పోలవరం (ఎస్టీ) ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గ్రాఫ్‌ పడిపోయిందంటూ.. ఆయన భార్య రాజ్యలక్ష్మిని ఇన్‌చార్జిగా నియమించారు. కల్యాణదుర్గం అసెంబ్లీ స్థానం బాధ్యతను అనంతపురం ఎంపీ తలారి రంగయ్యకు అప్పగించారు. విజయవాడ పశ్చిమలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్థానంలో.. రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ షేక్‌ ఆసి్‌ఫను నియమించారు. మల్లాది విష్ణుకు మొండిచేయి చూపి..వెలంపల్లిని విజయవాడ సెంట్రల్‌కు బదలాయించారు. ఈ ఎపిసోడ్‌లో బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన విష్ణును బలిపశువును చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

దీంతోపాటు కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు టికెట్‌ దక్కలేదు. ఆయన స్థానంలో మాజీ మంత్రి తోట నరసింహానికి అవకాశమిచ్చారు. కాకినాడ ఎంపీ వంగా గీతకు పిఠాపురం అసెంబ్లీ సీటు దక్కింది. పెండెం దొరబాబుకు కూడా ఛాన్స్ ఇవ్వలేదు. కాకినాడ ఎంపీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ క్రమంలో చేసిన తాజా మార్పులు వైసీపీలో మరింత అసంతృప్తిని రాజేశాయి. తొలి జాబితాలో 11 మందిని మార్చినప్పుడు.. అందులో ఎంపీ మోపిదేవి వెంకట రమణను రేపల్లె ఇన్‌చార్జిగా తప్పించడంపై ఇప్పటికీ అక్కడ నిరసనలు సాగుతున్నాయి. అలాగే మంత్రి మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేశ్‌, విడదల రజనిని వేరే చోట్లకు బదిలీ చేయడాన్ని స్థానిక వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు.

Updated Date - Jan 03 , 2024 | 10:51 AM