Share News

Gautam Adani: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు.. కారణమిదే..

ABN , Publish Date - Nov 21 , 2024 | 09:27 AM

అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. సోలార్ కాంట్రాక్టుల కోసం బిలియన్ల డాలర్ల లంచాలు చెల్లించి అంతర్జాతీయ పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించిన ఆరోపణలపై న్యూయార్క్ ఫెడరల్ కోర్టు గౌతమ్ అదానీపై కేసు నమోదు చేసింది. ఈ ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో గ్రూప్‌తో సంబంధం ఉన్న మరో ఏడుగురు కూడా ఉన్నారు.

Gautam Adani: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు.. కారణమిదే..
Gautam Adani

ప్రముఖ భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై(Gautam Adani) తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అమెరికా న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో అదానీతో సహా 7 మందిపై మోసం, లంచం ఆరోపణలపై కేసు నమోదైంది. యునైటెడ్ స్టేట్స్ అటార్నీ కార్యాలయం ప్రకారం అదానీ భారతదేశంలో సౌరశక్తి ప్రాజెక్టును పొందేందుకు భారతీయ అధికారులకు 250 మిలియన్ డాలర్లు (రూ. 21 బిలియన్లకు పైగా) లంచం ఇస్తానని వాగ్దానం చేశారని తెలుస్తోంది. ఈ డబ్బును సేకరించేందుకు అమెరికా సహా ఇతర దేశాల ఇన్వెస్టర్లు, బ్యాంకులకు మాయమాటలు చెప్పారని ఆరోపించారు.


అరెస్ట్ వారెంట్లు

ఈ ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అధికారులు, వ్యాపారవేత్తకు సన్నిహితులైన సాగర్, వినీత్ జైన్ ఉన్నారు. ఈ నేపథ్యంలో గౌతమ్, సాగర్ అదానీలపై అరెస్ట్ వారెంట్లు కూడా జారీ చేసినట్లు మీడియా నివేదికలో పేర్కొన్నారు. ఈ క్రమంలో గౌతమ్ అదానీ, సాగర్ ఆర్. అదానీ, వినీత్ ఎస్. జైన్, రంజిత్ గుప్తా, రూపేష్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా, సౌరభ్ అగర్వాల్, సిరిల్ కాబనేజ్‌లపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ అంశంపై అదానీ గ్రూప్ కంపెనీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.


అసలేం జరిగిందంటే

2020 నుంచి 2024 మధ్య ఈ నిందితులు సోలార్ పవర్ కాంట్రాక్ట్ పొందడానికి తప్పుడు మార్గాలను అనుసరించారని వాదించారు. ఆ క్రమంలో భారతీయ అధికారులకు 250 మిలియన్ డాలర్లు లంచం ఇవ్వాలని కుట్ర పన్నారని తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా 20 సంవత్సరాలలో రెండు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ లాభాలు అంచనా వేయబడ్డాయన్నారు. అందుకోసం తప్పుడు క్లెయిమ్‌లు, పథకాల ఆధారంగా రుణాలు, బాండ్లను పెంచారని పేర్కొన్నారు.

డబ్బు వసూలు

ఇందులో కొంత భాగాన్ని అమెరికా సంస్థల నుంచి కూడా సేకరించారని తెలిపారు. న్యూయార్క్‌లో నమోదైన ఈ కేసుకు సంబంధించి.. లంచం వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, తప్పుదోవ పట్టించే ప్రకటనల ద్వారా డబ్బు వసూలు చేసినట్లు కోర్టులో పేర్కొంది. నిందితులు FBI, US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) దర్యాప్తును అడ్డుకోవడానికి కూడా కుట్ర పన్నారని కోర్టు తెలుపడం విశేషం.


US అటార్నీ ప్రకటన

బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చేందుకు నిందితులు రహస్య పథకం పన్నారని అమెరికా అటార్నీ బ్రియాన్ పీస్ అభియోగాల్లో పేర్కొన్నారు. దీని గురించి అనేక మందిని చీకటిలో ఉంచారని ప్రస్తావించారు. అమెరికన్లతోపాటు ప్రపంచ పెట్టుబడిదారుల నుంచి నిధులను సేకరించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్ నుంచి అవినీతిని రూపుమాపేందుకు కట్టుబడి ఉండాలని హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి:

Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..

Aadit Palicha: చదువు, జాబ్ వదిలేసి స్టార్టప్ పెట్టాడు.. ఇప్పుడు రూ.4300 కోట్ల సంపదకు..

PAN Aadhaar: పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా.. ఇప్పుడే చేసుకోండి, గడవు సమీపిస్తోంది..

Read More Business News and Latest Telugu News

Updated Date - Nov 21 , 2024 | 10:39 AM