Madhabi Puri Buch: సెబీ చీఫ్ మాధవిపై కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు.. 3 చోట్ల జీతం తీసుకుంటున్నారని ఆరోపణ
ABN , Publish Date - Sep 02 , 2024 | 02:45 PM
సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చీఫ్ మాధవి పూరి బుచ్ పై కాంగ్రెస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. మాధవి పూరి బుచ్ ఒకేసారి మూడు చోట్ల జీతం తీసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా సోమవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సెబీ చీఫ్ మాధవి పూరి బుచ్(Madhabi Puri Buch)పై హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపణలు ఇంకా పూర్తిగా క్లియర్ కాకముందే మరో వివాదం మొదలైంది. మాధవి సెబీ(SEBI)తో సంబంధం ఉన్న సమయంలోనే ఐసీఐసీఐ బ్యాంక్ సహా మూడు చోట్ల జీతం తీసుకున్నారని కాంగ్రెస్(congress) పార్టీ మీడియా ఇంచార్జీ పవన్ ఖేరా(Pawan Khera) ఆరోపించారు. సెబీలో పూర్తికాల సభ్యుడిగా ఉన్న సమయంలోనే మధాబి పూరీ బుచ్ ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రెగ్యులర్ ఆదాయాన్ని రూ.16.80 కోట్లు తీసుకున్నారని ఖేరా అన్నారు. ఆ క్రమంలో మాధవి ఐసీఐసీఐ బ్యాంక్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సహా సెబీలో మూడు చోట్ల జీతం తీసుకున్నారని ఆరోపించారు.
ఎలా తీసుకుంటారు
మాధబి బుచ్ మార్కెట్ నియంత్రణాధికారి, సెబీ ఛైర్‌పర్సన్ అయినప్పటికీ ఆమె ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి జీతం ఎలా తీసుకుంటారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. టీడీఎస్‌ను కూడా ఆమెకు ఇదే బ్యాంకు చెల్లిస్తోందని ఖేరా అన్నారు. ఇది సెబీ నిబంధనలను ఉల్లంఘించడమేనని వెల్లడించారు. 2017-2024 మధ్య ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నుంచి మాధవి రూ.22,41,000 ఎందుకు తీసుకున్నారని అడిగారు. అంతేకాదు ఆమె ICICIకి ఎలాంటి సేవలను అందిస్తోందని, వాటి వివరాలను కూడా చెప్పాలని పవన్ ఖేరా అన్నారు. దేశంలో చదరంగం ఆట నడుస్తోందన్నారు. ఈ ఆట నిజమైన ఆటగాడు ఎవరనే దానిపై మేము ఇంకా తుది నిర్ణయం తీసుకోలేకపోయాము. అలాంటి వారిలో మాదాబి పూరి బుచ్ కూడా ఒకరని తెలిపారు.
రాజీనామా చేయాలి
ఈ విషయంలో తనకు కొంచెం కూడా సిగ్గు ఉంటే సెబీ ఛైర్మన్ రాజీనామా చేయాలని పవన్ ఖేరా డిమాండ్ చేశారు. మనమందరం మన డబ్బును పెట్టుబడిగా పెట్టే స్టాక్ మార్కెట్‌ను నియంత్రించడం సెబీ పాత్ర అని పవన్ ఖేరా గుర్తు చేశారు. దీని పాత్ర చాలా కీలకని అన్నారు. అలాంటి సెబీ ఛైర్మన్‌ను ఎవరు నియమిస్తున్నారని ప్రశ్నించారు. సెబీ ఛైర్మన్‌ను నియమించే ఈ కమిటీలో ప్రధానమంత్రి, హోంమంత్రి అమిత్ షా ఇద్దరు సభ్యులుగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
హిండెన్‌బర్గ్ ఆరోపణలు
ఇంతకుముందు అదానీ గ్రూప్, మారిషస్ ఆఫ్‌షోర్ కంపెనీ గ్లోబల్ డైనమిక్ ఆపర్చునిటీ ఫండ్'లో సెబీ ఛైర్‌పర్సన్ మధాబి పూరీ బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్‌లకు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. ఆ క్రమంలో గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ ఈ కంపెనీలో బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టారని హిండెన్‌బర్గ్ పేర్కొంది. ఆ సొమ్మును షేర్ల ధరలను పెంచేందుకు వినియోగించారని ఆరోపించింది.
ఇవి కూడా చదవండి:
Next Week IPOs: ఈ వారం రానున్న ఐపీఓలివే.. షేర్ మార్కెట్‌లో మనీ సంపాదించే ఛాన్స్
ITR Refund: ఐటీఆర్ రీఫండ్ ఇంకా వాపసు రాలేదా.. అయితే ఇలా చేయండి
Telegram: మరికొన్ని రోజుల్లో టెలిగ్రామ్ యాప్ బ్యాన్?.. కారణాలివేనా..
Read More Business News and Latest Telugu News