Share News

Stock Market: రూ.5.5 లక్షల కోట్లు గల్లంతు

ABN , Publish Date - Sep 07 , 2024 | 10:52 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వారాంతం (శుక్ర వారం) ట్రేడింగ్‌లో భారీ నష్టాన్ని చవిచూశాయి. ఒక దశలో 1,219 పాయింట్లు క్షీణించి 81,000 దిగువకు పడిపోయిన సెన్సెక్స్‌.. చివరికి 1,017.23 పాయింట్ల (1.24 శాతం) నష్టంతో 81,183.93 వద్ద స్థిరపడింది.

Stock Market: రూ.5.5 లక్షల కోట్లు గల్లంతు

ఇంటర్నెట్ డెస్క్: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వారాంతం (శుక్ర వారం) ట్రేడింగ్‌లో భారీ నష్టాన్ని చవిచూశాయి. ఒక దశలో 1,219 పాయింట్లు క్షీణించి 81,000 దిగువకు పడిపోయిన సెన్సెక్స్‌.. చివరికి 1,017.23 పాయింట్ల (1.24 శాతం) నష్టంతో 81,183.93 వద్ద స్థిరపడింది. గత నెల 23 తర్వాత సూచీకిదే కనిష్ఠ ముగింపు స్థాయి. నిఫ్టీ విషయానికొస్తే, 292.95 పాయింట్లు (1.17 శాతం) పతనమై 24,852.15 వద్ద క్లోజైంది. మార్కెట్లో అమ్మకాలు పోటెత్తడంతో ఈక్విటీ మదుపరుల సందపగా పరిగణించే బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.5.49 లక్షల కోట్లకు పైగా తగ్గి రూ.460.18 లక్షల కోట్లకు (5.48 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది.

అంతర్జాతీయంగా ట్రేడింగ్‌ ట్రెండ్‌ ప్రతికూలంగా ఉండటంతో పాటు విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ఉపసంహరణ ఇందుకు కారణమయ్యాయి. అమెరికా ప్రభుత్వం గత నెల ఉద్యోగాల కల్పన గణాంకాలు విడుదల చేసే నేపథ్యంలో అంతర్జాతీయంగా ఈక్విటీ ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. జాబ్స్‌ డేటా అంచనాల కన్నా మెరుగ్గా ఉంటే, ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ నెలలోనూ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించవచ్చన్న ఆందోళనలతో ఈక్విటీల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దీంతో దేశీయ మార్కెట్లోనూ ఇన్వెస్టర్లు ఐటీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, పీఎస్‌యూ బ్యాంకింగ్‌ సహా అన్ని రంగాల షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. మన మార్కెట్‌ రికార్డు గరిష్ఠాల వద్ద ట్రేడవుతుండటం, చాలా షేర్లు అధిక ధరల వద్ద కదలాడుతుండటం కూడా ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించేందుకు ప్రేరేపించాయి.


ఏథర్ ఎనర్జీ రూ.4,500 కోట్ల ఐపీవో

మరో దేశీయ విద్యుత్‌ వాహనాల (ఈవీ) తయారీ సంస్థ ఏథర్‌ ఎనర్జీ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కి సిద్ధమవుతోంది. ఇందుకోసం వచ్చే వారం మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీకి డ్రాఫ్ట్‌ రెడ్‌ హియరింగ్‌ ప్రాస్పెక్టస్‌ (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించనుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.4,500 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. కొత్త షేర్ల జారీతో పాటు ఇప్పటికే కంపెనీ ఈక్విటీలో మదుపు చేసిన మదుపరుల్లో కొందరు తమ పెట్టుబడిలో కొంత మొత్తాన్ని ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా విక్రయిస్తారని సమాచారం. మరో ఈవీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్‌ ఐపీఓ విజవంతమైన నెల రోజులకే ఏథర్‌ ఎనర్జీ ఐపీఓకు సిద్ధమవడం విశేషం.


బజార్ స్టైల్ రిటైల్ లిస్టింగ్ ఓకే

రేఖా ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులు కలిగిన ఫ్యాషన్‌ రిటైలింగ్‌ కంపెనీ బజార్‌ స్టైల్‌ రిటైల్‌ లిమిటెడ్‌ శుక్రవారం షేర్లను స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల్లో నమోదు చేసింది. బీఎస్‌ఈలో కంపెనీ షేరు ఐపీఓ ధర రూ.389 వద్దే లిస్టయినప్పటికీ, ఇంట్రాడేలో 10.78 శాతం వరకు పెరిగి రూ.430.95 వద్దకు ఎగబాకింది. తొలిరోజు ట్రేడింగ్‌ ముగిసేసరికి షేరు ధర 2.73 శాతం లాభంతో రూ.399.65 వద్ద స్థిరపడింది. దాంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.2,982.08 కోట్లుగా నమోదైంది.

For Latest News click here

Updated Date - Sep 07 , 2024 | 10:52 AM