Interim Budget 2024: ‘వీక్షిత్ భారత్’పై మధ్యంతర బడ్జెట్ ఫోకస్.. కీలక ప్రకటనలు?
ABN , Publish Date - Jan 29 , 2024 | 05:25 PM
పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న మధ్యంతర బడ్జెట్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ధరలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితుల్లో మధ్యతరగతి జీవులు బడ్జెట్‌పై గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే రెండు దశాబ్దాల్లో ‘వీక్షిత్ (అభివృద్ధి) భారత్’ అవతరించడమే లక్ష్యంగా ధరల నియంత్రణ, వ్యవసాయానికి సబ్సిడీలు కొనసాగింపు, తయారీ రంగానికి ప్రోత్సాహకాలు, సంక్షేమ పథకాలు, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణం దిశగా ప్రకటనలు ఉండొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్ కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ధరలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితుల్లో మధ్యతరగతి జీవులు బడ్జెట్‌పై గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే రెండు దశాబ్దాల్లో ‘వీక్షిత్ (అభివృద్ధి) భారత్’ అవతరించడమే లక్ష్యంగా ధరల నియంత్రణ, వ్యవసాయానికి సబ్సిడీలు కొనసాగింపు, తయారీ రంగానికి ప్రోత్సాహకాలు, సంక్షేమ పథకాలు, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణం దిశగా ప్రకటనలు ఉండొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మహిళలు, యువత, రైతులు, పేదల ఆర్థికాభివృద్ధికి బాటలు వేసేందుకు మధ్యంతర బడ్జెట్ ప్రభుత్వానికి ఒక చక్కటి అవకాశమని విశ్లేషిస్తున్నారు. పెద్దగా కొత్త పథకాలు ఆశించలేం. కానీ ప్రత్యక్ష పన్నులు, కస్టమ్స్ సుంకాల విషయంలో మార్పులు, చేర్పులకు అవకాశం లేకపోలేదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల దేశ ఆర్థికాభివృద్ధికి సంబంధించిన దీర్ఘకాల విజన్ గురించి మాట్లాడుతూ.. దేశ నారీ శక్తి, యువశక్తి, రైతులు, దేశంలోని పేద కుటుంబాలే ‘వీక్షిత్ భారత్’కు మూలస్థంభాలని వ్యాఖ్యానించారు. నవంబర్ 30న సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సంభాషణలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ‘ఓట్ ఆన్ అకౌంట్’ కావడంతో అత్యవసర వ్యయాలు, సున్నితమైన పన్ను ప్రతిపాదనలను మాత్రమే చేయవచ్చునని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యక్ష పన్నులకు సంబంధించి ఉపశమన ప్రకటనలు ఉండొచ్చని చెబుతున్నారు. ప్రత్యక్ష పన్నులపై తీసుకునే నిర్ణయం మధ్యతరగతి జీవులకు ఉపశమనం కలిగించనుండడమే ఇందుకు కారణమంటున్నారు. ‘మేకిన్ ఇండియా’ పురోగతికి అవసరమైన వస్తువుల ధరలను నియంత్రించడానికి కస్టమ్స్ సుంకాలు కూడా కూడా తగ్గించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇక నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడానికి ఆర్బీఐతో కలిసి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ బడ్జెట్ రూపంలో మరిన్ని ముందస్తు చర్యలు తీసుకోవడానికి సంసిద్ధంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు, నౌకలపై డ్రోన్, క్షిపణి దాడుల నేపథ్యంలో ఎర్ర సముద్రం ద్వారా వాణిజ్య నౌకల రవాణా ఆందోళకరంగా మారిన పరిస్థితుల్లో టారిఫ్, నాన్-టారిఫ్‌కు సంబంధించి ప్రకటనలు కూడా ఉండొచ్చనే అంచనాలున్నాయి. వాణిజ్య నౌకల రవాణా అంతరాయాలు దేశీయంగా రిటైల్ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతున్నాయి. ఎన్నికల ముందు ధరల పెరుగుదలను జనాలు హర్షించరు కాబట్టి ధరల తగ్గుదలకు చర్యలు ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నవంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.55 శాతం ఉండగా డిసెంబర్‌లో 4 నెలల గరిష్ట స్థాయి 5.69 శాతానికి పెరిగిన విషయం తెలిసిందే.
ఇక వ్యవసాయానికి సంబంధించిన సబ్సిడీలు, వ్యవసాయానికి సంబంధించిన కీలక విభాగాల్లో పరిశోధనకు సంబంధించిన ప్రకటనలు ఉండొచ్చనే అంచనాలున్నాయి. గతంలో విత్తన పరిశ్రమల పరిశోధనల కోసం ఆదాయంపై ఆదాయపు పన్నును మినహాయించగా క్రమంగా ఉపసంహరించే దిశగా అడుగులు పడొచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మధ్యంతర బడ్జెట్ కావడంతో పెద్దగా ప్రకటనలు ఉండకపోవచ్చు కానీ ఆర్థిక విధానాల కొనసాగింపు ఉంటుందని నిపుణులు సూచిస్తున్నాయి. పలువురు పారిశ్రామిక వేత్తలు, కంపెనీల ప్రతినిధులు ఇవే అభిప్రాయాలు, అంచనాలను వ్యక్తం చేశారు. కాగా తాత్కాలికంగా ప్రభుత్వ ఎమర్జెన్సీ నిర్వహణ కోసం ఓట్ ఆన్ అకౌంట్‌ను పార్లమెంటుకు సమర్పిస్తారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను సమర్పించనున్నారు.