Stock Markets: ఇవాళ ఒక్క రోజే రూ.7.37 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు.. కారణాలు ఇవే
ABN , Publish Date - Nov 04 , 2024 | 04:49 PM
దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి భారీగా నష్టపోయాయి. కీలకమైన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ-50 ఒక శాతానికి పైగా పతనమయ్యాయి. దీంతో ఈ ఒక్క రోజే పెద్ద మొత్తంలో నష్టపోయారు. మార్కెట్ల పతనానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఇవాళ (సోమవారం) భారీ పతనాన్ని చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 941.88 పాయింట్లు లేదా 1.18 శాతం మేర క్షీణించింది. ఫలితంగా 79,713 పాయింట్ల వద్ద ఆరంభమైన బీఎస్ఈ సూచీ 78,782.24 వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 309.00 పాయింట్లు లేదా 1.27 శాతం మేర పతనమైంది. దీంతో 24,315.75 పాయింట్ల వద్ద ఆరంభమైన సూచీ 23,995.35 పాయింట్ల వద్ద ముగిసింది.
నిఫ్టీ సూచీపై అత్యధికంగా హీరో మోటోకార్ప్ (4.25 శాతం), గ్రాసిమ్ (3.96 శాతం), బజాజ్ ఆటో (3.46 శాతం), అదానీ పోర్ట్స్ (3.26 శాతం), బీపీసీఎల్ (3.05 శాతం), రిలయన్స్ (3 శాతం) షేర్లు నష్టపోయాయి. ఇక మహింద్ర అండ్ మహింద్రా 2.14 శాతం, టెక్ మహీంద్రా 1.86 శాతం, సిప్లా 1.57 శాతం, ఎస్‌బీఐఎన్ 1.10 శాతం మేర లాభపడ్డాయి. ఇక బీఎస్ఈ 30 సూచీపై 29 స్టాకులు నష్టాల్లో ముగిశాయి. అత్యధికంగా ఆర్‌వీఎన్ఎల్ 5.16 శాతం, సీఈఎస్‌సీ 5.04 శాతం, ఐఆర్‌సీవోఎన్ 4.54 శాతం, ఐఆర్‌బీ 3.93 శాతం, టాటా పవర్ 3.23 శాతం మేర నష్టపోయాయి. సెన్సెక్స్ సూచీపై గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ లిమిటెడ్ మాత్రమే స్వల్పంగా గ్రీన్‌లో ముగిసింది.
ఒకే రోజు రూ.7.37 లక్షల కోట్లు ఆవిరి..
స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా పతనమవడంతో ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో నష్టపోయారు. బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇవాళ ఒక్క రోజే ఏకంగా రూ.7.37 లక్షల కోట్ల మేర ఆవిరైంది. రూ.7,34,744 కోట్ల మేర పతనమై రూ.4,40,72,863.01 స్థాయికి పడిపోయింది. దీంతో ఇన్వెస్టర్లు పెద్ద సంఖ్యలో నష్టపోయినట్టు అయ్యింది.
మార్కెట్ల పతనానికి కారణాలు ఇవే..
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు అప్రమత్తం అయ్యారు. ఈ అంశం గ్లోబల్ మార్కెట్లను అనిశ్చితికి గురిచేస్తోంది. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు కూడా మార్కెట్లలో ఒడిదొడుకులకు అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు త్వరలోనే జరగనున్న ఫెడరల్ రిజర్వ్ మోనిటరీ పాలసీ కూడా ఇన్వెస్టర్ల భయాలకు కారణమైంది. ఫెడరల్ రిజర్వ్ మోనిటరీ భేటీ నవంబర్ 6-7 తేదీల్లో జరగనుంది.
మరోవైపు రెండవ త్రైమాసిక ఫలితాలు అంత ఆశాజనకంగా లేకపోవడం, లాభాలను స్వీకరించేందుకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపడం, విదేశీ సంస్థాగత మదుపర్లు పెట్టుబడుల ఉపసంహరణను కొనసాగించడం కూడా మార్కెట్ల పతనానికి కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషించారు.
ఇవి కూడా చదవండి
IPL Mega Auction: ఐపీఎల్ మెగా వేలం వేదిక, తేదీలు ఇవేనా..
తాజా సర్వే వచ్చేసింది.. డొనాల్డ్ ట్రంప్‌పై కమల హారిస్‌దే విజయం
For more Sports News And Telugu News