Customers: జియో, ఎయిర్ టెల్, వీఐలకు షాకిచ్చిన కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్‌కు లాభం
ABN , Publish Date - Sep 21 , 2024 | 10:19 AM
దేశంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌లకు అనేక మంది యూజర్లు షాకిచ్చారు. జులై నుంచి పెంచిన రేట్లు అమలైన నేపథ్యంలో లక్షలాది మంది వినియోగదారులు ఈ నెట్‌వర్క్‌ల నుంచి బీఎస్ఎన్ఎల్‌కు మారారు.
కొన్ని నెలల క్రితం రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మొబైల్ సర్వీస్ ఛార్జీలను భారీగా పెంచింది. దీంతో అనేక మంది యూజర్లకు ప్రభుత్వ రంగ నెట్‌వర్క్ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ అనేక ప్రాంతాల్లో 4జీ సేవలను ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో BSNL సంస్థకు జులైలో 29.4 లక్షలకు పైగా మొబైల్ వినియోగదారులు కొత్తగా చేరారు. ఇదే సమయంలో Vodafone Idea, Reliance Jio వరుసగా 14.1 లక్షలు, 7.58 లక్షల మొబైల్ సబ్‌స్క్రైబర్లను కోల్పోయాయి. భారతీ ఎయిర్‌టెల్ 16.9 లక్షల మంది మొబైల్ కస్టమర్లను కోల్పోయింది. ఇది ఇతర కంపెనీలతో పోలిస్తే అత్యధికం కావడం విశేషం.
రేట్ల పెంపు తర్వాత
మొత్తంమీద జులైలో దేశంలో టెలికాం సబ్‌స్క్రైబర్ బేస్ స్వల్పంగా క్షీణించి 120 కోట్ల 51.7 లక్షలకు చేరుకుంది. జూన్‌లో ఇది రూ.120 కోట్ల 56.4 లక్షలుగా ఉంది. ప్రైవేటు సంస్థల మొబైల్ సర్వీస్ రేట్ల పెంపు తర్వాత TRAI డేటా ప్రకారం ఈశాన్య రాష్ట్రాలు, మహారాష్ట్ర, రాజస్థాన్, ముంబై, కోల్‌కతా, తమిళనాడు, పంజాబ్, బీహార్, పశ్చిమ బెంగాల్, తూర్పు ఉత్తరప్రదేశ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిళ్లలో మొబైల్ సబ్‌స్క్రైబర్ బేస్‌లో తగ్గుదల నమోదైంది. జులైలో వైర్‌లైన్ లేదా ఫిక్స్‌డ్ లైన్ కనెక్షన్ విభాగంలో సబ్‌స్క్రైబర్ల సంఖ్య దాదాపు ఒక శాతం పెరిగి 3 కోట్ల 55.6 లక్షలకు చేరుకుంది. జూన్‌లో ఇది మూడు కోట్ల 51.1 లక్షలుగా ఉండేది. వివిధ టెలికాం కంపెనీలు మొబైల్ టారిఫ్‌లను పెంచడంతో ప్రభుత్వ సంస్థ BSNL లాభపడుతోంది.
రెండింతల రేట్లు
ప్రైవేటు టెలికాం కంపెనీలు ఇటీవల పెంచిన రేట్లు జులై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆ తర్వాత జులైలో టెలికాం కంపెనీలు అనేక మంది వినియోగదారులను కోల్పోయాయి. ఆ సమయంలో టెలికాం కంపెనీలు మొబైల్ టారిఫ్‌లను 10 నుంచి 27 శాతం వరకు పెంచాయి. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా గత రెండు మూడేళ్లలో తమ ఎంట్రీ లెవల్ మొబైల్ ధరలను రూ.199కి రెండింతలు పెంచాయి. వీటి వాలిడిటీ 28 రోజులు. BSNL మాత్రమే మొబైల్ టారిఫ్‌ను పెంచకుండా ఉండటం విశేషం. ఈ ఏడాది నాటికి BSNL దేశవ్యాప్తంగా 4జీ సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత క్రమంగా 5జీ సేవలు కూడా అందిస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో అనేక మంది యూజర్లు ఈ ప్రభుత్వ నెట్‌వర్క్‌కు మారే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
iPhone 16: ఐఫోన్ 16కి విపరీతమైన క్రేజ్.. డే1 సేల్స్ ఎలా ఉన్నాయంటే..
Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే
Stock Market: నాలుగున్నరేళ్లలో లక్షను రూ.29 లక్షలు చేసిన స్టాక్.. ఏకంగా 2818 శాతం గ్రోత్
Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు
Read MoreBusiness News and Latest Telugu News