Mukesh Ambani: రిలయన్స్ ఏజీఎం సమావేశంలో ముఖేష్ అంబానీ కీలక ప్రకటనలు
ABN , Publish Date - Aug 29 , 2024 | 03:32 PM
రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ ఏజీఎం సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కీలక ప్రకటనలు చేశారు. ప్రభుత్వానికి ఒక్క ఏడాదిలోని రూ. 1,86,440 కోట్లను అందించినట్లు తెలిపారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ ఏజీఎం సమావేశంలో కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను ఇస్తున్నట్టు ప్రకటించారు. ప్రతి షేరుపై 1 షేరును బోనస్‌గా అందించనున్నట్టు తెలిపారు. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో షేర్ హోల్డర్లకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయాలని తీర్మానం చేయనున్నట్టు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. ఈ ప్రకటనతో 35 లక్షల మంది షేర్‌హోల్డర్లు లాభం పొందనున్నారు.
స్టోరేజ్ ఉచితం
జియో ఏఐ క్లౌడ్ ఆఫర్‌ను ప్రారంభించినట్లు మఖేష్ అంబానీ ప్రకటించారు. ప్రతి జియో వినియోగదారుకు 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఉచితంగా ఇస్తామని ముకేశ్ అంబానీ వెల్లడించారు. ఏఐ క్లౌడ్ దీపావళికి ప్రారంభమవుతుందని, వినియోగదారులు 100 జీబీ డేటాను ఉచితంగా పొందవచ్చునని స్పష్టం చేశారు.
ఇక రిలయన్స్(Reliance) జియో(jio) ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ డేటా కంపెనీగా అవతరించిందని రిలయన్స్ ఏజీఎం సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ(Mukesh Ambani) తెలిపారు. ప్రపంచ మొబైల్ డేటా ట్రాఫిక్‌లో 8 శాతం మంది జియో నెట్‌వర్క్‌పైనే ఆధారపడినట్లు చెప్పారు. అభివృద్ధి చెందిన మార్కెట్‌లతో సహా అన్ని ప్రధాన గ్లోబల్ ఆపరేటర్‌ల కంటే ఈ సంఖ్య పెద్దదని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో జియో ఒక సంవత్సరంలో అనేక రికార్డులు సృష్టించిందన్నారు. అత్యుత్తమ నాణ్యతలో మొదటి స్థానంలో నిలువడంతోపాటు దేశంలోని ప్రతి మూలకు 5G నెట్‌వర్క్‌ను తీసుకువెళ్లామని వెల్లడించారు.
ప్రభుత్వ ఖజానాకు
అంతేకాదు పన్నుల చెల్లింపులో కూడా రిలయన్స్ నంబర్ 1గా ఉందని ముకేశ్ అంబానీ అన్నారు. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో వివిధ రకాల పన్నుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 1,86,440 కోట్లను అందించినట్లు తెలిపారు. ఇది ఇతర కార్పొరేట్ గ్రూపులతో పోలిస్తే అత్యధికమని తెలిపారు. దీంతోపాటు ఉపాధి కల్పించడంలో రిలయన్స్ ముందుందని ముకేశ్ అంబానీ చెప్పారు. గత ఏడాది కాలంలో కంపెనీ 1.7 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించిందని, ఇందుకోసం 2024 ఆర్థిక సంవత్సరంలో పరిశోధన, అభివృద్ధి కోసం కంపెనీ రూ.36.65 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు.
10 లక్షల కోట్ల ఆదాయం
2023-24లో రిలయన్స్ రూ. 10 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. దేశంలోనే ఇలా సాధించిన మొదటి కంపెనీ ఇదే కావడం విశేషం. 2023-24లో భారత ప్రభుత్వ ఖజానాలో రిలయన్స్ రూ.1.86 లక్షల కోట్లు డిపాజిట్ చేసింది. గత మూడేళ్లలో ఈ మొత్తం రూ.5.5 లక్షల కోట్లు. రిలయన్స్ 2023-24లో CSR కోసం రూ. 1592 కోట్లు ఖర్చు చేసింది. CSRలో 25 శాతం వృద్ధి. గత 3 సంవత్సరాలలో ఈ మొత్తం రూ. 4,000 కోట్లు. ఇది దేశంలోని ఏ కార్పొరేట్ సంస్థ అయినా CSR కోసం ఖర్చు చేసిన అత్యధిక మొత్తమని ప్రకటించారు.
రిటైల్ స్టోర్స్
ఈ ఏడాది దేశంలో 1840 కొత్త రిలయన్స్ రిటైల్ స్టోర్లను ప్రారంభించినట్లు ఇషా అంబానీ తెలిపారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ జియో మార్ట్ వేగంగా సేవలను అందిస్తుందని, దీని సేవలు 300 నగరాలకు చేరుకున్నాయని తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే మా లక్ష్యమని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
Business Idea: రూ. 15 వేల పెట్టుబడితో వ్యాపారం .. నెలకు రూ.50 వేలకుపైగా ఆదాయం
Bank Holidays: సెప్టెంబర్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్నంటే.. గణేష్ చతుర్థి సహా..
Lowest Interest Car Loans: తక్కువ రేటుకే లక్షల రూపాయల కార్ లోన్స్.. ఈ వివరాలు తెలుసా మీకు..
Read More Business News and Latest Telugu News