Diwali 2024: ఇలా షాపింగ్ చేసి.. ఈ దీపావళికి అప్పుల భారం తగ్గించుకోండి..
ABN , Publish Date - Oct 30 , 2024 | 01:44 PM
దీపావళి పండుగ వచ్చిందంటే చాలు. దేశవ్యాప్తంగా మార్కెట్‌లు, మాల్స్, బంగారు, వెండి షోరూమ్‌లు ఎక్కడ చూసినా జనాలే కనిపిస్తారు. కానీ ఈ కొనుగోళ్ల విషయంలో మాత్రం మధ్యతరగతి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ సూచనలు జారీ చేసింది. ఎందుకనేది ఇక్కడ చుద్దాం.
దేశవ్యాప్తంగా దీపావళి(Diwali) పండుగ వస్తే చాలు అనేక మంది పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేస్తుంటారు. పిల్లలు, పెద్దల షాపింగ్, గోల్డ్, దుస్తులు సహా అనేక రకాల వస్తువులను తీసుకుంటారు. అయితే ఈ కొనుగోళ్ల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ తెలిపింది. ఎందుకంటే పలువురు మధ్యతరగతి ప్రజలు వారి వద్ద డబ్బులు లేకున్నా కూడా క్రెడిట్ కార్డులు లేదా లోన్స్ తీసుకుని కొనుగోళ్లు చేస్తున్నారని గుర్తు చేసింది. ఆ తర్వాత ఎంత వడ్డీ పడుతుంది, ఏ మేరకు కట్టాలనే విషయాలను తెలుసుకోకుండానే లక్షల రూపాయలు తీసుకుని ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నట్లు చెప్పింది.
ముందే లిస్ట్
కాబట్టి ఈ పండుగ కొనుగోళ్ల విషయంలో మాత్రం ముందుగానే తప్పనిసరిగా అవసరమైన అంశాల జాబితాను రూపొందించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మీకు నిజంగా అవసరమైన వాటి గురించి ముందుగానే ఆలోచించి, దానికనుగుణంగా మీ కొనుగోళ్లు చేయాలని అంటున్నారు. క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి కొనుగోళ్లు చేస్తున్నప్పుడు ఇది అరువుగా తీసుకున్న డబ్బు అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే దానిని తిరిగి చెల్లించవలసి ఉంటుంది. మీరు మళ్లీ ఎన్ని నెలలకు చెల్లిస్తారో అంచనా వేసుకుని కొనుగోళ్లు చేయాలి. ప్రతిదానికీ EMI తీసుకోవలసిన అవసరం లేదు. మీ దగ్గర డబ్బు లేకపోతే ఆ వస్తువు కొనలా వద్దా అనేది కూడా ఆలోచించండి. పండుగ ఖర్చుల కోసం బడ్జెట్ పెట్టుకోండి. దానికి మించి అతిగా ఖర్చు చేసి ఇబ్బందులు పడొద్దు.
పండుగ నెలల్లో ఎక్కువ సేల్స్
సాధారణంగా ఆశావాదం, ఉత్సాహభరితమైన మార్కెట్ కారణంగా పండుగ నెలల్లో వృద్ధి ఎక్కువగా ఉంటుంది. కానీ చిన్న ఉద్యోగులు వారి స్థాయికి మించి ఖర్చు చేస్తున్నారని ఆర్బీఐ ఆందోళన చెందుతోంది. గత ఏడాది నుంచి ఇలా పెరుగుతున్న రుణాలపై రిజర్వ్ బ్యాంక్ దృష్టి సారించింది. ఈ విషయంలో ప్రజలు, బ్యాంకులు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేసింది. తక్కువ నెలవారీ వాయిదాలు, వడ్డీ లేని EMIలు కస్టమర్‌లను ఎక్కువ ఖర్చు చేయడానికి ప్రేరేపిస్తాయని గుర్తు చేసింది. ప్రతి క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసే విషయంలో రుణం తీసుకుంటున్నామనే కఠినమైన విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.
పెరుగుతున్న అప్పుల ధోరణి
భారతదేశంలోని చాలా పెద్ద బ్యాంకులు పండుగ సీజన్‌లో భారీగా రుణాలను పెంచుకున్నాయి. ఉదాహరణకు సెప్టెంబర్ త్రైమాసికంలో వ్యక్తిగత రుణ విభాగంలో HDFC బ్యాంక్ 10% వృద్ధిని నమోదు చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ వ్యక్తిగత రుణాలు 17%, క్రెడిట్ కార్డ్ రుణాలు 28% పెరిగాయి. అదేవిధంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యక్తిగత రుణాలలో 17%, క్రెడిట్ కార్డ్ రుణాలలో 15% పెరుగుదల ఉంది. ప్రభుత్వ బ్యాంకుల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా వ్యక్తిగత రుణాలలో 25% వృద్ధిని నమోదు చేయగా, యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రుణాలు 48.6% పెరిగాయి. దీన్ని బట్టి చూస్తే దేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగం ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
Elon Musk: ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం
Penny Stock: లక్ష పెట్టుబడితో 4 నెలల్లోనే రూ. 670 కోట్లు.. దేశంలోనే ఖరీదైన స్టాక్‌గా రికార్డ్
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..
Muhurat Trading 2024: ఈసారి దీపావళి ముహూరత్ ట్రేడింగ్ ఎప్పుడంటే.. అక్టోబర్ 31 లేదా నవంబర్ 1..
Read More Business News and Latest Telugu News