Credit Card: క్రెడిట్ కార్డ్ తెగ వాడేస్తున్నారా.. షాకింగ్ న్యూస్ మీకోసమే..
ABN , Publish Date - Dec 07 , 2024 | 04:02 PM
Credit Card: ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డ్స్ వినియోగం బాగా పెరిగిపోతుంది. చాలా మంది క్రెడిట్ కార్డ్స్‌ని వాడేస్తున్నారు. అయితే, వీటిని సరిగా వినియోగించుకుంటే మేలు జరుగుతుంది. లేదంటే అనేక రకాలుగా నష్టపోవాల్సి వస్తుంది.
Credit Card Usage Tips: ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగిపోతోంది. ప్రజలు తమ దైనందిన అవసరాలకే కాకుండా.. ప్రత్యేక రాయితీలు, రివార్డులు పొందేందుకు కూడా క్రెడిట్ కార్డ్స్‌ని ఉపయోగిస్తున్నారు. ఈ క్రెడిట్ కార్డులు లావాదేవీలను సులభతరం చేయడమే కాకుండా.. ప్రజల ఆర్థిక ప్రొఫైల్‌ను కూడా బలోపేతం చేస్తాయి. వీటిని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే.. క్రెడిట్ హిస్టరీ స్ట్రాంగ్‌గా ఉంటుంది. తద్వారా క్రెడిట్ స్కోర్ కూడా భారీగా పెరుగుతుంది. అలా కాకుండా.. విచ్చలవిడిగా వినియోగించి, దుర్వినియోగం చేస్తే.. క్రెడిట్ హిస్టరీ దారుణంగా పడిపోవడంతో పాటు.. అధిక మొత్తంలో సమర్పించుకోవాల్సి వస్తుంది.
ఎవరైనా రుణం తీసుకోవాలంటే.. రుణదాతలు ముందుగా సదరు వ్యక్తి సిబిల్ స్కోర్/క్రెడిట్ హిస్టరీని చెక్ చేస్తారు. ఆ స్కోర్ ఆధారంగానే రుణాలు మంజూరు చేస్తారు. సిబిల్ స్కోర్ వ్యక్తి నిర్వహించే ఆర్థిక లావాదేవీలు, క్రెడిట్ కార్డ్స్ నిర్వహణ, చెల్లింపులపై ఆధారపడి ఉంటుంది. లోన్ తీసుకుని సకాలంలో చెల్లించడం, క్రెడిట్ కార్డ్ ద్వారా లావాదేవీలు జరిపి సకాలంలో చెల్లింపులు జరపడం ద్వారా సదరు వ్యక్తి సిబిల్ స్కోర్ పెరుగుతుంది. అలాకాకుండా.. క్రెడిట్ కార్డుల నిర్వహణ సరిగా లేకపోవడం, లోన్ రీపేమెంట్ సరిగా చేయకపోతే.. సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. దీని ఫలితంగా లోన్ రిజెక్ట్ అవడం గానీ, అధిక వడ్డీ రేట్లకు లోన్ మంజూరవడం గానీ జరుగుతుంది. అందుకే... క్రెడిట్ కార్డులను సరిగా మెయింటేన్ చేయడం చాలా ముఖ్యం.
వాస్తవానికి, వ్యక్తులు తమ క్రెడిట్ కార్డును ఉపయోగించినప్పుడు రుణదాత మీ ఖర్చు అలవాట్లు, చెల్లింపు హిస్టరీ, క్రెడిట్ వినియోగానికి సంబంధించిన పూర్తి డేటాను క్రెడిట్ బ్యూరో సిబిల్‌కి పంపుతుంది. దీని ఆధారంగా క్రెడిట్ బ్యూరోలు మీ క్రెడిట్ స్కోర్‌ను ఇస్తారు. సకాలంలో బిల్లులు చెల్లించడం ద్వారా మంచి క్రెడిట్ స్కోర్‌ను పొందవచ్చు. ఇది భవిష్యత్‌లో తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు పొందడంలో సహాయపడుతుంది.
సిబిల్ స్కోర్/క్రెడిట్ స్కోర్ పెరగాలంటే.. బకాయిలను సకాలంలో చెల్లించడం చాలా ముఖ్యం. ఒక్క చెల్లింపు ఆలస్యమైనా.. దాని ప్రభావం మీ సిబిల్ స్కోర్‌పై పడుతుంది. ముఖ్యంగా.. 30 శాతం కంటే తక్కువ క్రెడిట్ వినియోగం మంచి సిబిల్ స్కోర్‌ని ఇస్తుంది. ఎప్పుడైనా మీకు అవసరమైనప్పుడు.. రుణం కోసం అప్లై చేస్తే రుణదాత మీ క్రెడిట్ స్కోర్‌నే ప్రధానంగా చూస్తారు. క్రెడిట్ హిస్టరీ ఆధారంగానే లోన్ మంజూరు చేస్తారు. మంచి క్రెడిట్ వినియోగ నిష్పత్తిని నిర్వహిస్తే.. ఈజీగా లోన్ మంజూరవుతుంది. అలా కాకుండా.. క్రెడిట్ కార్డులను ఇష్టారీతిని వినియోగిస్తే.. సిబిల్ స్కోర్ దారుణంగా పడిపోతుంది. పైగా రుణం పొందే అవకాశాలు కూడా తగ్గుతాయి.
మెరుగైన క్రెడిట్ స్కోర్‌ను కలిగి ఉండటం వల్ల తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే.. తక్కువ వడ్డీ రేట్లకే రుణం లభిస్తుంది. క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తున్న అదే బ్యాంకులో లోన్ కోసం అప్లై చేస్తే.. లోన్ తీసుకోవడం మరింత సులభతరం అవుతుంది. ఇప్పటికే రుణం తీసుకుని.. ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నట్లయితే.. మీ క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది. ఇది భవిష్యత్‌లో పెద్ద మొత్తాన్ని పొందే అవకాశాలను కల్పిస్తుంది.
Also Read:
ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి..
రోజూ కేవలం 5 పుట్టగొడుగులను తింటే కలిగే
For More Business News and Telugu News..