Share News

Hyderabad: మేడిపల్లిలో అర్యన్‌రెడ్డి అంతక్రియలు..

ABN , Publish Date - Nov 23 , 2024 | 09:44 AM

తమ కుటుంబంలో జరిగిన దారుణం మరో కుటుంబంలో జరగకూడదని, అమెరికా వెళ్లిన తమ పిల్లలు ఏం చేస్తున్నారో నిరంతరం తెలుసుకోవాలని, ఈ సంఘటన ప్రతి ఒక్కరికీ కనువిప్పు కావాలని అమెరికా జార్జియా(America)లో మృతి చెందిన ఆర్యన్‌రెడ్డి(Aryan Reddy) తండ్రి పాల్వాయి సుదర్శన్‌రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు.

Hyderabad: మేడిపల్లిలో అర్యన్‌రెడ్డి అంతక్రియలు..

హైదరాబాద్: తమ కుటుంబంలో జరిగిన దారుణం మరో కుటుంబంలో జరగకూడదని, అమెరికా వెళ్లిన తమ పిల్లలు ఏం చేస్తున్నారో నిరంతరం తెలుసుకోవాలని, ఈ సంఘటన ప్రతి ఒక్కరికీ కనువిప్పు కావాలని అమెరికా జార్జియా(America)లో మృతి చెందిన ఆర్యన్‌రెడ్డి(Aryan Reddy) తండ్రి పాల్వాయి సుదర్శన్‌రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమారున్ని ఉన్నత చదువుల కోసం అమెరికా పంపిస్తే.. అక్కడి గన్‌ కల్చర్‌ తన కొడుకు ప్రాణాలు తీసిందని, ఎంతో సంతోషంగా పుట్టిన రోజు జరుపుకున్న రోజే ఆ మాయదారి గన్‌ తన కొడుకును పొట్టన పెట్టుకుందని ఆయన ఆవేదన చెందారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కులగణన పత్రాలు రోడ్డుపాలు..


గన్‌ ప్రమాదంలో అమెరికా జార్జియాలో మృతి చెందిన పాల్వాయి ఆర్యన్‌రెడ్డి మృతదేహం గురువారం రాత్రి ఇండియాకు చేరుకుంది. ఉప్పల్‌ ధర్మపురికాలనీలోని తన స్వగృహంలో బంధువులు, స్నేహితుల కడసారి చూపు అనంతరం మేడిపల్లిలోని వైకుంఠధామంలో అంత్యక్రియలు నిర్వహించారు. గత ఏడాది డిసెంబరులో ఎంఎస్‌ చదివేందుకు వెళ్లిన తమ ఒక్కగానొక్క కుమారుడు ఏడాది తిరగక ముందే శవమై ఇంటికి తిరిగి రావడంతో ఆ తల్లిదండ్రుల దుఃఖానికి అవధులు లేకుండా పోయాయి. అసలు తనకే ఎందుకు ఇలా జరిగిందంటూ ఆర్యన్‌రెడ్డి తండ్రి రోదించారు.


ఆర్యన్‌కు మిలటరీ అన్నా, పోలీసు విధులు అన్నా ఎంతో ఇష్టమని, అయితే, ఆ మోజును తీర్చుకునేందుకు హంటింగ్‌ గన్‌కోసం 3 నెలలు శిక్షణ తీసుకొని లైసెన్సు కూడా తీసుకున్నాడని, దానితో పాటు మరో రైఫిల్‌ కోసం కూడా లైసెన్సు తీసుకున్న విషయం అతడు చనిపోయిన తర్వాత గాని తమకు తెలియకపోవడం దురదృష్టమని ఆవేదన చెందారు. అతని వద్ద ఉన్నది లైసెన్స్‌డ్‌ గన్‌ అని, అక్కడకు వచ్చిన అమెరికా పోలీసులు చెప్పేంత వరకు తమకు తెలియదని ఆయన అన్నారు.


ఈనెల 13న ఆర్యన్‌రెడ్డి పుట్టినరోజు కావడంతో కాల్‌ చేసి మాట్లాడామని, అదే రోజు రాత్రి స్నేహితులందరు కలిసి మాట్లాడుకున్న తర్వాత పడుకునేందుకు గదిలోకి వెళ్లిన కొద్ది సేపటికే పెద్ద శబ్ధం రావడంతో తలుపులు బద్దలు కొట్టి చూడడంతో.. అప్పటికే రక్తపు మడుగులో పడి చనిపోయినట్లు మరుసటి రోజు ఉదయం అతని స్నేహితులు చెప్పారని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని, ఎలాంటి సమస్యలు కూడా లేవని ఆయన వాపోయారు.


కేవలం గన్‌లపై ఉన్న వాడి సరదానే వాడి ప్రాణం తీసిందని, ప్రమాదవశాత్తు గన్‌ పేలి చనిపోయి ఉంటాడని అన్నారు. ఆమెరికాలో ఉన్న తమ పిల్లల పట్ల తండ్రిదండ్రులు ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ వారిని గమనించాలని సుదర్శన్‌రెడ్డి కోరారు. ఆర్యన్‌రెడ్డిని కడసారిగా చూసేందుకు మాజీ మేయర్‌ బండా కార్తీకరెడ్డితో పాటు బంధువులు, స్నేహితులు తరలివచ్చారు.


ఈవార్తను కూడా చదవండి: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ఈవార్తను కూడా చదవండి: Sarpanch: కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్‌ ఆత్మహత్య

ఈవార్తను కూడా చదవండి: AV Ranganath: కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తుంది!

ఈవార్తను కూడా చదవండి: వామ్మో...చలి

Read Latest Telangana News and National News

Updated Date - Nov 23 , 2024 | 09:44 AM