Hyderabad: దొంగలతో జట్టుకట్టి ప్రాణాలు కోల్పోయిన మాజీ పోలీసు
ABN , Publish Date - Nov 10 , 2024 | 01:44 PM
ఈజీ మనీ కోసం దొంగలతో జట్టుకట్టి ఉద్యోగం కోల్పోయిన ఆ పోలీసు, డబ్బు పంపకాల్లో తేడా వచ్చి వారి చేతిలోనే దారుణహత్యకు గురయ్యాడు. సరూర్‌నగర్(Sarurnagar) పరిధిలో ఈ ఘటన జరిగింది.
- ముదిరిన డబ్బు వివాదం.. కారుతో ఢీకొట్టి హత్యాయత్నం
- 9 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
హైదరాబాద్: ఈజీ మనీ కోసం దొంగలతో జట్టుకట్టి ఉద్యోగం కోల్పోయిన ఆ పోలీసు, డబ్బు పంపకాల్లో తేడా వచ్చి వారి చేతిలోనే దారుణహత్యకు గురయ్యాడు. సరూర్‌నగర్(Sarurnagar) పరిధిలో ఈ ఘటన జరిగింది. సీఐ సైదిరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏపీకి చెందిన ఈశ్వర్ (38) ఉమ్మడి రాష్ట్రంలో 2010లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. బేగంపేట, ఎస్సార్‌నగర్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లతో పాటు టాస్క్‌పోర్స్ విభాగంలో విధులు నిర్వర్తించాడు. అంతటా క్రైమ్ విభాగంలో పనిచేయడంతో నేర వ్యవస్థపై పట్టు సాధించాడు.
ఈ వార్తను చదవండి: Hyderabad: నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు..
సెల్‌ఫోన్ దొంగలతో దోస్తీ పెంచుకుని, దొంగ సెల్‌ఫోన్లు ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారో తెలుసుకున్నాడు. వారిచ్చిన సమాచారంతో దొంగ సెల్‌ఫోన్ కొనుగోలుదారులను బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి అలవాటుపడ్డాడు. సెల్‌పోన్ దొంగతనాల ఫిర్యాదులు సేకరించి, వాటిల్లోని ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా సెల్‌ఫోన్‌లను గుర్తించేవాడు. ఆ సెల్‌ఫోన్లు వాడుతున్న వారికి ఫోన్ చేసి బెదిరించి వాటిని రికవరీ చేసి, విక్రయించి సొమ్ముచేసుకునేవాడు. మరింత సొమ్మును కూడబెట్టేందుకు జేబుదొంగలు, స్నాచర్‌లతో ఈశ్వర్ జట్టుకట్టాడు.
ఉమ్మడి రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, మహారాష్ట్ర(Maharashtra)కు చెందిన దొంగలు, స్నాచర్‌లతో ముఠా ఏర్పాటు చేసి ప్రధాన ప్రాంతాల్లో దొంగతనాలు, స్నాచింగ్‌లు చేయించసాగాడు. కాగా ఓ దొంగతనం కేసులో రెండేళ్ల క్రితం నల్లగొండ పోలీసులు ఈశ్వర్‌ను అరెస్ట్ చేశారు. ఈశ్వర్ ముఠా లీలలు వెలుగులోకి రావడంతో సీరియ్‌సగా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు అతడిని సర్వీసు నుంచి తొలగించారు. ఇటీవల ఈశ్వర్‌కు దొంగల ముఠాలతో విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది.
నగరంలో తనకు తెలియకుండా, తనకు కమీషన్ ఇవ్వకుండా ఇతరులెవరూ దొంగతనాలు చేయకుండా ఈశ్వర్ అడ్డుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కొంతమంది దొంగల ముఠాల నాయకులు ఈశ్వర్‌పై కక్ష పెంచుకున్నారు. గత కొన్ని రోజులుగా కొండాపూర్ హఫీజ్‌పేటకు చెందిన శంకర్‌తో, ఈశ్వర్‌కు వివాదం కొనసాగుతోంది. ఈ విషయమై చర్చించుకునేందుకు ఈశ్వర్ బంధువైన బోడుప్పల్‌కు చెందిన విజయ్, సరూర్‌నగర్‌కు చెందిన రంజిత్, రామస్వామిలు గత నెల 31న కర్మన్‌ఘాట్(Karmanghat)లో ఈశ్వర్, శంకర్‌లకు మీటింగ్ ఏర్పాటు చేశారు.
వీరంతా ఆ రోజు మధ్యాహ్నం 1.30కి ఓ బార్ అండ్ రెస్టారెంట్‌కు వచ్చారు. అక్కడ కూర్చుని వివాదంపై చర్చిస్తూ మద్యం తాగారు. చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఈశ్వర్, శంకర్‌తో పాటు విజయ్, రంజిత్, రామస్వామి, మరొక వ్యక్తి కలిసి బార్ నుంచి బయటకొచ్చారు. అక్కడ శంకర్ ఈశ్వర్‌లకు మరొకసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో శంకర్ బెలెనో కారుతో ఈశ్వర్‌ను ఢీ కొట్టాడు. కిందపడిపోయిన ఈశ్వర్ నుంచి మరొకసారి కారు తీసుకవెళ్లి, అక్కడి నుంచి పారిపోయారు. రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న ఈశ్వర్‌ను స్థానికులు వెంటనే ఎదురుగా ఉన్నటువంటి ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 9 రోజుల తర్వాతమృతి చెందాడు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తుల ప్రమేయం ఉందని గుర్తించిన పోలీసులు, నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Minister PonnamPrabhakar: సమగ్ర కుటుంబ సర్వేపై ఆందోళన వద్దు.. మంత్రి పొన్నం ప్రభాకర్
ఈవార్తను కూడా చదవండి: KTR: విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా..: కేటీఆర్
ఈవార్తను కూడా చదవండి: Caste Census: తెలంగాణలో 243 కులాలు
ఈవార్తను కూడా చదవండి: Tummala: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి..
Read Latest Telangana News and National News