Hyderabad: బీభత్సం సృష్టించిన కంటైనర్.. ఏకంగా పోలీసులపైకే..
ABN , Publish Date - Dec 30 , 2024 | 08:47 AM
ముషీరాబాద్ చౌరస్తాలో సోమవారం అర్ధరాత్రి 02:30 గంటలకు స్థానిక ఎస్సై తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఓ రెడీమిక్స్ కంటైనర్ వాహనాన్ని నడుపుకుంటూ మహ్మద్ యూసఫ్ అనే డ్రైవర్ ముషీరాబాద్ చౌరస్తా వైపు వచ్చాడు.
హైదరాబాద్: ముషీరాబాద్ చౌరస్తాలో సోమవారం తెల్లవారుజామున రెడీమిక్స్ కంటైనర్ వాహనం బీభత్సం సృష్టించింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలికాగా, పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. పోలీసులు సైతం తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదంలో పలు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
ముషీరాబాద్ చౌరస్తాలో సోమవారం అర్ధరాత్రి 02:30 గంటలకు స్థానిక ఎస్సై తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఓ రెడీమిక్స్ కంటైనర్ వాహనాన్ని నడుపుకుంటూ మహ్మద్ యూసఫ్ అనే డ్రైవర్ ముషీరాబాద్ చౌరస్తా వైపు వచ్చాడు. అయితే నిద్రమత్తు, అతివేగం కారణంగా చౌరస్తా వద్దకు రాగానే వాహనం ఒక్కసారిగా అదుపు తప్పింది. దీంతో వేగంగా దూసుకొచ్చిన కంటైనర్ రోడ్డు పక్కన నిలిపి ఉంచిన మూడు డీసీఎంలు, ఓ టాటా ఏస్, ద్విచక్రవాహనంపైకి దూసుకెళ్లింది.
అనంతరం పోలీసుల వైపునకు కంటైనర్ దూసుకెళ్లింది. దీంతో ముషిరాబాద్ ఎస్సై, సిబ్బంది పక్కకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. పోలీసుల వాహనాన్ని కంటైనర్ ఢీకొట్టడంతో అది కూడా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో కంటైనర్ బీభత్సానికి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన చిలకలగూడ పోలీసులు కంటైనర్ డ్రైవర్ మహ్మద్ యూసఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు.