Tirumala: తిరుమలలో అదనపు ఈవో ఆకస్మిక తనిఖీ.. అధికారులకు కీలక ఆదేశాలు..
ABN , Publish Date - Aug 24 , 2024 | 11:14 AM
వీకెండ్ కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరి తిరుమలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
తిరుమల: వీకెండ్ కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరి తిరుమలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వారాంతపు సెలవుల నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన క్యూలైన్లంటినీ పరిశీలించారు. నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ల్లో సౌకర్యాలపై భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. క్యూ లైన్లలో వున్న భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు పంపిణీ చెయ్యాలని అధికారులను అదనపు ఈవో ఆదేశించారు.
టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి శనివారం తెల్లవారుజామున తిరుమలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. వీకెండ్ కారణంగా భక్తుల రద్దీ పెరగడంతో ఆయన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసే క్రమంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, కృష్ణతేజ సర్కిల్, నారాయణగిరి ఉద్యనవనాల్లోని షెడ్లు, క్యూ లైన్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై ఆయన భక్తులకు అవగాహన కల్పించారు. అలాగే భక్తులను సైతం అన్నప్రసాదం, ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. కంపార్ట్‌మెంట్లలో వడ్డించిన ఉప్మా చాలా రుచికరంగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందించే విధానాన్ని అదనపు ఈవో పరిశీలించారు. అలాగే అక్కడ ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు. కంపార్ట్‌మెంట్ల వెలుపల ఉన్న బోర్డులపై భక్తులకు అందించే ఆహార పానీయాలు, సమయాలను పేర్కొనాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే భక్తులకు స్వామివారి దర్శనం విషయంలో ఎలాంటి జాప్యమూ లేకుండా చూడాలన్నారు. నిరంతరం కంపార్ట్‌మెంట్లను పర్యవేక్షించి ఎక్కడా జాప్యం లేకుండా భక్తులను దర్శనానికి వదలాలన్నారు. అలాగే భక్తులను దర్శనానికి పంపిన వెంటనే వీక్యూసీ కంపార్ట్‌మెంట్ల వద్ద మరింత మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కృష్ణ తేజ సర్కిల్ వద్ద భక్తులు క్యూ లైన్‌లలోకి ప్రవేశించే మార్గాల వద్ద కొందరు ప్రైవేటు టాక్సీ, జీప్ డ్రైవర్లు అడ్డంగా పార్కింగ్ చేయడాన్ని గమనించి, డ్రైవర్లకు అదనపు ఈవో వెంకయ్య చౌదరి హెచ్చరికలు చేశారు. భవిష్యత్తులో ఐటువంటి అనధికారిక పార్కింగ్ నివారించేందుకు, స్థానిక పోలీసులతో చర్చలు జరపాలని టీటీడీ విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.