Rajastan: గుడి పునాది కోసం 40 వేల కిలోల నెయ్యి.. ఈ కోవెల విశిష్టతలు తెలిస్తే అబ్బురపడతారు
ABN , Publish Date - Apr 15 , 2024 | 09:05 AM
రాజస్థాన్‌లోని ఓ గుడి నిర్మాణానికి 40 వేల కిలోల నెయ్యి వాడారు. దానికీ ఓ పెద్ద కారణం ఉంది. బికనీర్ నడిబొడ్డున ఆధ్యాత్మికత, శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది భండాసర్ జైన దేవాలయం(Bhandasar Jain Temple). ఐదవ తీర్థంకరుడైన సుమతినాథకు అంకితం చేసిన ఈ ఆలయం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు.
రాజస్థాన్: రాజస్థాన్‌లోని ఓ గుడి నిర్మాణానికి 40 వేల కిలోల నెయ్యి వాడారు. దానికీ ఓ పెద్ద కారణం ఉంది. బికనీర్ నడిబొడ్డున ఆధ్యాత్మికత, శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది భండాసర్ జైన దేవాలయం(Bhandasar Jain Temple). ఐదవ తీర్థంకరుడైన సుమతినాథకు అంకితం చేసిన ఈ ఆలయం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు. ఆలయ హస్తకళ సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది.
Delhi: భారతీయుల రక్షణ మా మొదటి ప్రాధాన్యత.. ఇరాన్ - ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ మోదీ స్పష్టీకరణ
12వ శతాబ్దంలో సంపన్న జైన వ్యాపారి భండాసా ఓస్వాల్ దీన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణంలాగే దాని చరిత్ర కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఒకానొక సమయంలో రాజస్థాన్‌లో తీవ్రమైన కరువు సంభవించింది.దాంతో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. ఆలయ నిర్మాణాన్ని అప్పటికే ప్రారంభించిన భండాసా ఓస్వాల్ పునాదుల్లో వాడటానికి నీటి కొరత ఉండటంతో అందుకు ప్రత్యామ్నాయంగా నెయ్యిని ఉపయోగించాలని నిర్ణయించారు. ఇందుకోసం 40,000 కిలోల నెయ్యిని పునాదుల్లో వాడారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న రోజుల్లో కొంత నెయ్యి గుడి నేల గుండా వస్తుందని భక్తులు చెబుతుంటారు. మూడు అంతస్థుల్లో ఈ ఆలయం ఉంటుంది.
ఎర్ర ఇసుకరాయిని ఉపయోగించి గోడలు, స్తంభాలు, మండపాన్ని నిర్మించారు. గర్భగుడి పంచరథ రూపంలో, పైభాగంలో కర్ణ అమలకాలతో కూడిన శిఖరంతో కప్పబడి ఉంటుంది. ఆలయ గోడలు అందమైన కుడ్యచిత్రాలు, 24 తీర్థంకరుల జీవితాలను వర్ణించే అలంకారమైన అద్దాల పనితో అలంకరించబడి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా చేస్తున్నాయి.
భండాసర్ జైన దేవాలయం ఒక మతపరమైన ప్రదేశం మాత్రమే కాకుండా సాంస్కృతిక కేంద్రంగా కూడా ఆకట్టుకుంటోంది. దీన్ని భారత పురావస్తు శాఖ సంరక్షిస్తోంది. ఆలయం కళాకృతులు, వాస్తుశిల్పం సందర్శకులను అబ్బురపరుస్తున్నాయి. ఆలయ నిర్మాణంలో నెయ్యి ఉపయోగించడం అనేది అప్పటి ఇంజినీర్ల అంకితభావం, పనితనాన్ని సూచిస్తుంది. రాజస్థాన్‌లో కఠిన వాతావరణ పరిస్థితులను ఆలయం తట్టుకుని నిలబడుతోంది. అక్కడికి వెళ్లిన వారు తప్పకుండా భండాసర్ జైన దేవాలయాన్ని దర్శించుకుని రావాల్సిందేనని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి