RK Kothapaluku : చైర్ కాదు ఫైర్
ABN , Publish Date - Dec 22 , 2024 | 06:06 AM
తెలంగాణ రాజకీయాలలో వేడి పుట్టింది. ఏడాది క్రితం వరకు తెలంగాణలో తిరుగులేని అధికార కేంద్రంగా వెలుగొందిన మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును ఏ–1గా పేర్కొంటూ అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. అందరిలాగే తండ్రి కేసీఆర్
తెలంగాణ రాజకీయాలలో వేడి పుట్టింది. ఏడాది క్రితం వరకు తెలంగాణలో తిరుగులేని అధికార కేంద్రంగా వెలుగొందిన మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును ఏ–1గా పేర్కొంటూ అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. అందరిలాగే తండ్రి కేసీఆర్ మాటలు నమ్మి రేపో మాపో ముఖ్యమంత్రి కూడా అవుతానని కొంతకాలం పాటు ఊహల పల్లకిలో విహరించిన కేటీఆర్‌కు, రేపో మాపో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఫార్ములా–ఈ రేసు కేసులో ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపడానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పకడ్బందీగా పావులు కదిపింది. ఫార్ములా–ఈ రేసు వ్యవహారం కేటీఆర్ మెడకు చుట్టుకోబోతున్నదని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నందున తెలంగాణ సమాజం కూడా దీన్నో సంచలనంగా పరిగణించడం లేదు. అయితే భారత రాష్ట్ర సమితి నాయకులు, శ్రేణులు మాత్రం తమ అధినేతలను జైలుకు పంపితే తమ నెత్తిన పాలు పోసినట్టేనని ఆంతరంగిక సంభాషణల్లో సంబరపడిపోతున్నారు. అందుకే జైలుకు వెళ్లి వచ్చిన వాళ్లు ముఖ్యమంత్రి అవుతారని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని దృష్టిలో పెట్టుకొని బీఆర్‌ఎస్ నాయకులు చెప్పుకొంటున్నారు. అలా అయితే ముందుగా కవిత ముఖ్యమంత్రి అవుతారని కాంగ్రెస్ నాయకులు కౌంటర్‌గా ఎగతాళి చేస్తున్నారు. నిజానికి జైలుకు వెళ్లి వచ్చినంత మాత్రాన ఎవరూ అమాంతం ముఖ్యమంత్రి అయిపోరు. అలా అయితే అవినీతి కేసులలో అరెస్టయ్యి జైలుకు వెళ్లడానికి చాలా మంది క్యూ కడతారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లి రావడం వెనుక అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహం ఉంది. తన ఒక్కగానొక్క బిడ్డ పెళ్లిని కూడా దగ్గరుండి సంతోషంగా జరిపించుకొనే అవకాశం లేకుండా కేసీఆర్ అండ్ కో చేసినందున రేవంత్‌రెడ్డిలో కసి పెరిగింది. ఈ కారణంగానే ఆయన తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి చాలా వేగంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారు. ఆనాటి నుంచి ఎన్నికల వరకు కేసీఆర్‌పై అలుపెరుగని పోరాటం చేసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయ తీరానికి చేర్చారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను తొలగించడం కూడా రేవంత్‌రెడ్డికి కలసివచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు కాగా, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తన నియంతృత్వ పోకడలతో ప్రజలకు దూరం అవడం రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణం అయింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన బీఆర్‌ఎస్.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై అధికార మార్పిడి జరిగిన నాటి నుంచే పోరాటాన్ని ఉధృతం చేసింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి తగిన సమయం ఇవ్వకుండా ఆందోళనలు చేయడాన్ని ప్రజలు కూడా హర్షించడం లేదు. అయితే ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా కల్వకుంట్ల కుటుంబానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మధ్య ఏర్పడిన వ్యక్తిగత వైషమ్యాలు తార స్థాయికి చేరాయి. ఈ ఏడాది కాలంలో ఒకటి రెండు సందర్భాలలో దుందుడుకుగా వ్యవహరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తనను నిత్యం దుర్భాషలాడుతున్న కేటీఆర్ విషయంలో మాత్రం పకడ్బందీగా పావులు కదిపారు. ఫార్ములా–ఈ రేసు వ్యవహారాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వివరించి ఆయన నుంచి ముందస్తు అనుమతి పొందారు. సాంకేతిక కారణాలపై కేటీఆర్‌కు వెంటనే బెయిల్ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పుష్ప–2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఒక దురదృష్టకర సంఘటనలో ఓ మహిళ మృతి చెందిన కేసులో ఆ సినిమా హీరో అల్లు అర్జున్‌ను అనూహ్యంగా అరెస్టు చేయించడం, ఇప్పుడు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ అగ్రనేత కేటీఆర్‌పై కేసు పెట్టించడం ద్వారా తాను ఏమిటో చెప్పకనే చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఈ రెండు చర్యల వల్ల రాజకీయంగా లాభమా? నష్టమా? అన్నది ఇప్పటికిప్పుడు తేలే అంశం కాదు గానీ ‘సీఎం అంటే కేవలం కుర్చీ కాదు.. ఫైర్’ అని రేవంత్‌రెడ్డి రుజువు చేస్తున్నారు. అంతే కాదు, పార్టీపైన, ప్రభుత్వంపైన తనకు పట్టు ఉందని కూడా రుజువు చేసుకున్నారు. అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం చిత్ర పరిశ్రమలోనే కాదు ఎలీట్ సొసైటీలో ప్రకంపనలు సృష్టించింది. మహిళ మృతికి అల్లు అర్జున్ ప్రత్యక్ష కారణం కాకపోయినప్పటికీ, అంటే కుట్రపూరిత ఉద్దేశంతో వ్యవహరించనప్పటికీ కేసులో చిక్కుకున్నారు. దీంతో అల్లు అర్జున్ అరెస్టుకు మహిళ మృతి మాత్రమే కారణమా? లేక మరేదన్నా కారణం ఉందా? అని ప్రజలు ఆరా తీయడం మొదలుపెట్టారు. పుష్ప–2 ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరు మర్చిపోయారు. ఏడాదిగా ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి పేరును హైదరాబాద్‌లో నివసిస్తున్న అల్లు అర్జున్ మర్చిపోవడాన్ని నెటిజన్లు సైతం హర్షించలేదు. అంతే, సినిమా హీరో అయితే ఏమిటి గొప్ప? ప్రజల్లో నేనే నిజమైన స్టార్‌ని! అని రేవంత్‌రెడ్డి ప్రకటించుకున్నారు. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్లు సినిమావాళ్ల జోలికి వెళ్లేవారు కాదు. ముఖ్యంగా హీరోలకు ఎంతో గౌరవం ఇచ్చేవారు. జగన్మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా హీరోలతో ఆడుకున్నారు. బడా బడా స్టార్లు తన వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి దేబిరించేలా చేశారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి జగన్‌లా క్రూరంగా కాకుండా చట్టాన్ని ఉపయోగించి తానేమిటో చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగిందని చెప్పి అక్కినేని నాగార్జునకు చెందిన ‘ఎన్ కన్వెన్షన్’ను ఉన్నపళంగా కూల్చివేయించారు. ఇప్పుడు అల్లు అర్జున్‌ను అరెస్టు చేసి ఒక రాత్రి జైల్లో గడపాల్సిన పరిస్థితి కల్పించారు. దీంతో చిత్ర పరిశ్రమ వెన్నులో వణుకు పుట్టింది. చంద్రబాబు, రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రులు అయినప్పుడు సినీ ప్రముఖులు స్వయంగా వెళ్లి వారిని అభినందించేవారు. జగన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి విషయంలో ఇది వెంటనే జరగలేదు. హైదరాబాద్‌లో నివసిస్తున్నా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి పేరును సినిమా వాళ్లు గుర్తుంచుకోకపోవడాన్ని రేవంత్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయి ఉండవచ్చు. ఎన్నికల ముందు వరకు సినీ ప్రముఖులు పలువురు అప్పటి మంత్రి కేటీఆర్‌తో రాసుకు పూసుకు తిరిగేవారు. అల్లు అర్జున్ ఎపిసోడ్‌తో సినిమా వాళ్లకు గట్టి సందేశం పంపిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు కేటీఆర్ పని పట్టాలని నిశ్చయించుకున్నట్టుగా ఉంది.
రోజులు మారాయ్!
రాజకీయాలలో ఉన్నవారు పార్టీలు వేరైనా వ్యక్తిగత సంబంధాలను వదులుకొనేవారు కారు. ఇప్పుడు ఆ పరిస్థితులు కనుమరుగవుతున్నాయి. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆ కుటుంబం మొత్తం రేవంత్‌రెడ్డిని ఈసడించుకొనేవారు. రేవంత్‌రెడ్డి కూడా ఎక్కడా తగ్గకుండా తన నోటికి పని చెప్పేవారు. దీంతో ఇరు పక్షాల మధ్య వ్యక్తిగత వైషమ్యాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫార్ములా–ఈ కేసు వ్యవహారం రేవంత్‌రెడ్డి చేతికి చిక్కింది. ఈ వ్యవహారంలో ముడుపులు చేతులు మారాయా? లేదా? అన్నది తేలాల్సి ఉన్నప్పటికీ నిబంధనల ఉల్లంఘన మాత్రం జరిగింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా మంత్రివర్గం ఆమోదం కూడా లేకుండా 55 కోట్ల రూపాయలు చెల్లించడం తప్పిదమే అవుతుంది. మంత్రి హోదాలో కేటీఆర్ నోటి మాటగా ఇచ్చిన ఆదేశాలతో నాటి పురపాలక శాఖ కార్యదర్శి అర్వింద్ కుమార్ అనే అధికారి డబ్బు చెల్లించేశారు. కారణం ఏమైనా గానీ గత ప్రభుత్వాల హయాంలో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారు. దాని పర్యవసానాలను ఇప్పుడు అనుభవిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో జగన్ రెడ్డి సుదీర్ఘ కాలం పాటు అధికారంలో కొనసాగుతారని అంత చదువుకున్న అధికారులు కూడా ఎలా విశ్వసించారో అంతుపట్టదు. సామాన్య ప్రజలకు ఉన్న ఇంగితం కూడా అఖిల భారత సర్వీసు అధికారులకు లేకపోవడం విషాదమే. ఫార్ములా–ఈ రేసు వ్యవహారంలో తాను తప్పు చేయలేదని, రాష్ర్టాభివృద్ధితో పాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడంలో భాగంగానే సదరు కంపెనీకి నిధులు విడుదల చేశామని కేటీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరగాలని ఆయన కోరారు. కేసు అవినీతి నిరోధక శాఖ చేతుల్లోకి వెళ్లాక అసెంబ్లీలో చర్చ జరగదు. ఈ వ్యవహారంలో నిబంధనల అతిక్రమణ జరిగిందా? ముడుపులు చేతులు మారాయా? అన్నది నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఏసీబీపైనే ఉంటుంది. కేటీఆర్, అర్వింద్ కుమార్‌లను విచారణకు పిలిచిన తర్వాత మాత్రమే ఏసీబీ వైఖరి ఏమిటో స్పష్టం అవుతుంది. జగన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కనీసం విచారణకు కూడా పిలవకుండా అరెస్టు చేయించారు. ఆ కేసులో చంద్రబాబు యాభై రోజులకు పైగా జైల్లో గడపాల్సి వచ్చింది. ఇక ఫార్ములా–ఈ రేసు కేసులో ఏమి జరగబోతున్నది? కేటీఆర్ ఎంత కాలం జైల్లో ఉండాల్సి వస్తుంది? అన్నది ఇప్పుడే చెప్పలేం. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కేటీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ప్రస్తుతానికి ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ను అరెస్టు చేయడం వల్ల ప్రజల్లో సానుభూతి ఏర్పడి అది భారత రాష్ట్ర సమితి బలపడటానికి ఉపయోగపడుతుందా? లేదా? కేటీఆర్ అరెస్టు వల్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లాభం జరుగుతుందా? నష్టం జరుగుతుందా? అన్నవి ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి.
రేవంత్ మార్క్..!
తెలంగాణ సమాజం ఇప్పటిదాకా చూసిన రేవంత్‌రెడ్డి వేరు.. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి వేరుగా ఉంటారని నేను గతంలోనే చెప్పాను. రేవంత్‌రెడ్డి బయటకు కనిపించినంత ఆషామాషీగా ఉండరు. ఆయన చాలా లోతైన మనిషి. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని మురిపెంగా చెప్పుకొనే కాంగ్రెస్ నాయకులు బాహాటంగా అసంతృప్తి స్వరాలను వినిపిస్తుంటారు. విచిత్రంగా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పార్టీ నాయకులు ఒక్క తాటిపై ఉంటున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ తీసుకొనే నిర్ణయాలను బాహాటంగా ఎవరూ తప్పుపట్టడం లేదు. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు అధికారానికి దూరంగా ఉండాల్సి రావడం కూడా కాంగ్రెస్ నాయకుల్లో ఈ మార్పునకు కారణం కావచ్చు. రేవంత్‌రెడ్డి కూడా అందరినీ కలుపుకొని వెళ్లడానికే ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ మంత్రులు మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు భిన్న స్వరాలను వినిపించడం లేదు. రాజకీయ ప్రత్యర్థుల కట్టడికి ఏమి చేయబోతున్నదీ బయటకు పొక్కకుండా రేవంత్‌రెడ్డి గుంబనంగా వ్యవహరిస్తున్నారు. ఔటర్ రింగు రోడ్డు వ్యవహారంపై సిట్ దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్టు శుక్రవారంనాడు ఆయన ఉన్నపళంగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు ఇంత గోప్యంగా తీసుకోవడం అసాధారణం. కేసీఆర్ కుటుంబ సభ్యులను కేసులలో ఇరికించుకుంటూ పోతే భారత రాష్ట్ర సమితి క్రమేపీ బలహీనపడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయం కావచ్చు. ఫార్ములా–ఈ రేసు వ్యవహారంలో ప్రాథమిక ఆధారాలను గుర్తించని పక్షంలో కేటీఆర్‌పై కేసు నమోదుకు గవర్నర్ అనుమతించి ఉండేవారు కారు. అంతేకాదు, ఈ వ్యవహారాన్ని కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లి వారి అనుమతితోనే కేటీఆర్‌పై కేసు నమోదుకు గవర్నర్ జిష్ణుదేవ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి ఉంటారన్న అభిప్రాయం కూడా ఉంది. బొగ్గు నిక్షేపాలకు దూరంగా నల్లగొండ జిల్లాలో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని ఈ అంశంపై విచారణ జరిపిన కమిషన్ నిర్ధారించింది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మెడపైనా కత్తి వేలాడుతోంది. తమ అధినాయకులపై వరుస కేసులు పెట్టి వేధిస్తూ పోతే తమకే మేలు జరుగుతుందని బీఆర్‌ఎస్ నాయకులు, శ్రేణులు భావిస్తున్నారు. అందుకే కేటీఆర్‌ను తొందరగా అరెస్టు చేయాలని వారు కోరుకుంటున్నారు. అయితే కేసీఆర్‌ను జైలుకు పంపితేనే ప్రజల్లో సానుభూతి ఏర్పడుతుందని క్షేత్ర స్థాయి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేసి అన్ని నెలలు జైల్లో పెట్టినా తెలంగాణ సమాజం పట్టించుకోలేదు. ఇప్పుడు కేటీఆర్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టినా పెద్దగా సానుభూతి లభించకపోవచ్చు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్, కవిత విపరీతమైన అధికార దర్పాన్ని ప్రదర్శించేవారు. ఈ ధోరణిని తెలంగాణ సమాజంతో పాటు పార్టీ శ్రేణులు కూడా జీర్ణించుకోలేకపోయారు. కేసీఆర్ కూడా అహంభావం ప్రదర్శించినప్పటికీ తెలంగాణ రాష్ట్రం సాధించిన వాడిగా ప్రజల్లో ఆయన పట్ల ఇప్పటికీ సానుకూలత ఉంది. ఈ కారణంగా కేసీఆర్‌ను టచ్ చేస్తే మాత్రం ప్రజల్లో సానుభూతి ఏర్పడుతుంది.
కేసీఆర్‌కు బ్యాడ్ టైం!
ఏదిఏమైనా కేసీఆర్ కుటుంబానికి బ్యాడ్ టైం నడుస్తున్నట్టుగా ఉంది. కవిత జైల్లో ఉన్నప్పుడు బీజేపీతో పొత్తుకు సిద్ధపడినా ఆ పార్టీ ఢిల్లీ పెద్దలు కనికరించలేదు. కేసీఆర్ నిస్సహాయంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కేటీఆర్‌పై కేసు నమోదుకు గవర్నర్ సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారంటే బీజేపీ పెద్దలకు తెలియకుండా ఇది జరగదని కేసీఆర్‌కు కూడా తెలుసు. పరిస్థితులు అనుకూలించనప్పుడు ఎంతటి రాజకీయ గండరగండడు అయినా గుడ్లు అప్పగించి చూడటం మినహా ఏమీ చేయలేరు. అందుకే కేసీఆర్ చాలా రోజులుగా ఫాంహౌస్‌లోనే ఉంటూ మౌనాన్ని ఆశ్రయించారు. ఇప్పుడు కేటీఆర్ విషయంలో కూడా ఆయన స్పందించలేదు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన నాటి నుంచే కేసీఆర్‌కు దరిద్రం పట్టుకున్నట్టుగా ఉంది. అధికారం కోల్పోయారు. కన్నబిడ్డలు జైలు పాలవుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. తాను కక్ష కట్టి జైల్లో పెట్టించిన రేవంత్‌రెడ్డి చేతిలో వరుస పరాభవాలను ఎదుర్కోవలసి రావడాన్ని మించిన విషాదం కేసీఆర్ జీవితంలో మరేమి ఉంటుంది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కక్ష రాజకీయాలకు బలై జైలు జీవితం గడిపి వచ్చిన రేవంత్‌రెడ్డికి భవిష్యత్తులో కొత్తగా జరిగే నష్టం ఏమీ ఉండదు. అధికారం శాశ్వతం అనుకొని ఎవరు విర్రవీగినా వారికి ఇటువంటి కష్టాలు కాచుకొని ఉంటాయి. ప్రజల సానుభూతి కూడా లభించదు. అధికారంలో ఉన్నప్పుడు వినయంగా మెలిగిన వారికే ప్రజల సానుభూతి లభిస్తుంది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్ అండ్ కో, ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌రెడ్డి అండ్ కో ఆక్రోశిస్తున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థను ఏ స్థాయిలో దుర్వినియోగం చేసిందీ మరచిపోతే ఎలా? సామాన్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నా ఎమ్మెల్యేల అనుమతి పొందాల్సి ఉండేది. ప్రభుత్వం అంటే ప్రైవేటు లిమిటెడ్ కాదని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించక తప్పదని ఎందుకు గుర్తించరో తెలియదు.
గతం మరిస్తే ఎలా?
అధికారంలో ఉన్నప్పుడు రాజధర్మాన్ని పాటించని వాళ్లకు అధికారం కోల్పోయాక అన్యాయం జరుగుతోందని ఆక్రోశించే అర్హత కూడా ఉండదు. అందుకే ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు నిన్న ఏం జరిగిందో గుర్తుచేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగినన్ని అరాచకాలు మరెక్కడా జరిగి ఉండకపోవచ్చు. ఉదాహరణకు వైసీపీకి చెందిన మాజీ మంత్రి పేర్ని నాని తన భార్య పేరిట నిర్మించిన గిడ్డంగిలో ఉంచిన పౌర సరఫరాల శాఖకు చెందిన బియ్యాన్ని అమ్ముకున్నారు. ఇప్పుడు అది నిరూపితం కావడంతో అమ్ముకున్న బియ్యం విలువను తిరిగి చెల్లిస్తానని చెబుతున్నారు. ప్రభుత్వంలో ఇది సాధ్యమా? అయిందేదో అయిపోయింది.. తూచ్ అనుకోవడానికి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలలో కుదరదు. రూల్ ఆఫ్ లా మాత్రమే పాటించాల్సిన అధికారులు అధికారంలో ఉన్న వారి మాటలకు గుడ్డిగా తలలాడిస్తే మూల్యం చెల్లించక తప్పదు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలా తలలాడించిన వాళ్లు జైలుకు వెళ్లాల్సి రావడంతో పాటు ఇప్పటికీ కేసుల నుంచి బయటపడలేదు. ఈ ఉదంతాలు తెలిసి కూడా ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్‌లో అఖిల భారత సర్వీసు అధికారులు రూల్ ఆఫ్ లా పాటించకుండా కష్టాలు కొని తెచ్చుకున్నారు. అధికారులు తప్పు చేయడానికి సిద్ధపడకపోతే రాజకీయ నాయకులకు కూడా ఇబ్బందులు రావు. ఫార్ములా–ఈ రేసు వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. నిబంధనలకు విరుద్ధంగా తాను నిధులు విడుదల చేయలేనని హెచ్‌ఎండీఏ ప్రత్యేక కమిషనర్ హోదాలో అర్వింద్ కుమార్ స్పష్టంచేసి ఉంటే ప్రస్తుతం విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడేది కాదు కదా. ఆయన నిబంధనలు పాటించి ఉంటే 55 కోట్ల రూపాయలు విడుదలయ్యేవి కావు. కేటీఆర్ మెడకు ఈ కేసు చుట్టుకునేదీ కాదు. అధికారులు విచక్షణతో వ్యవహరిస్తూ చట్టాలు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించబోమని స్పష్టంచేసినప్పుడు రాజకీయ నాయకులు కూడా తప్పు చేయలేరు. ఏది ఏమైనా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్టు బిగించారు. తనను ఇబ్బందులు పెట్టిన వారిపై ప్రతీకారం తీర్చుకొనే అవకాశం ఇప్పుడు ఆయనకు లభించింది. అంతిమంగా ఈ పోకడలు ఆయనకు లాభం కలిగిస్తాయా? నష్టం చేస్తాయా? అన్నది కాలమే నిర్ణయించాలి. ఏడాదిగా అమలుకు నోచుకోని పాత పథకాలను వచ్చే జనవరి నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నందున ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి తగ్గుముఖం పట్టవచ్చు. అదే సమయంలో కేటీఆర్‌ను అరెస్టు చేసి జైలుకు పంపితే ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ధి పొందే ఆలోచనలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రయత్నాలు ఫలిస్తాయా? లేవా? అన్నది కూడా వేచి చూడాలి. ‘ధర్మో రక్షతి రక్షితః’ అంటారు. ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు ఈ కఠోర సత్యాన్ని అనుక్షణం గుర్తుంచుకునే వారిని కష్టాలు చుట్టుముట్టవు. తెలంగాణలో తన అధికారానికి తిరుగులేదని విర్రవీగిన కేసీఆర్ ప్రతిష్ఠ మసకబారుతోంది. ప్రస్తుతం ఆయనను కష్టాలు కమ్ముకుంటున్నాయి. ఈ పరిస్థితుల నుంచి తన కుటుంబాన్ని కాపాడుకుంటూ పార్టీని ఎలా బతికించుకుంటారు? అన్నది కేసీఆర్ అనుసరించబోయే వ్యూహాలపై ఆధారపడి ఉంటుంది. రేవంత్‌రెడ్డిని తక్కువగా అంచనా వేసి కష్టాలను కొని తెచ్చుకున్నారు. కేటీఆర్‌ను జైలుకు పంపడంతో లెక్క సరిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతృప్తి చెందుతారా? తాను జైలుకు వెళ్లాల్సి రావడానికి ప్రధాన కారకుడైన కేసీఆర్‌ను కూడా అరెస్టు చేయించే వరకు వెనకడుగు వేయరా? అన్నదీ వేచి చూడాలి. ఔటర్ రింగ్ రోడ్, భూముల వ్యవహారంలో ఎవరెవరు చిక్కుకుంటారో తెలియదు. బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు అందరూ కేసులలో చిక్కుకుంటే ఆ పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. అన్ని రోజులూ మనవి కావు అని కేసీఆర్ అండ్ కో ఇప్పటికైనా గుర్తుపెట్టుకుంటుందా?
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్టు బిగించారు. తనను ఇబ్బందులు పెట్టిన వారిపై ప్రతీకారం తీర్చుకొనే అవకాశం ఇప్పుడు ఆయనకు లభించింది. అంతిమంగా ఈ పోకడలు ఆయనకు లాభం కలిగిస్తాయా? నష్టం చేస్తాయా? అన్నది కాలమే నిర్ణయించాలి. ఏడాదిగా అమలుకు నోచుకోని పాత పథకాలను వచ్చే జనవరి నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నందున ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి తగ్గుముఖం పట్టవచ్చు. అదే సమయంలో కేటీఆర్‌ను అరెస్టు చేసి జైలుకు పంపితే ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ధి పొందే ఆలోచనలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రయత్నాలు ఫలిస్తాయా, లేవా? అన్నది కూడా వేచి చూడాలి. ప్రస్తుతం కేసీఆర్‌ను కష్టాలు కమ్ముకుంటున్నాయి. ఈ పరిస్థితుల నుంచి తన కుటుంబాన్ని కాపాడుకుంటూ పార్టీని ఎలా బతికించుకుంటారు? అన్నది కేసీఆర్ అనుసరించబోయే వ్యూహాలపై ఆధారపడి ఉంటుంది.
ఫార్ములా–ఈ రేసు వ్యవహారంలో ముడుపులు చేతులు మారాయా? లేదా? అన్నది తేలాల్సి ఉన్నప్పటికీ నిబంధనల ఉల్లంఘన మాత్రం జరిగింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా మంత్రివర్గం ఆమోదం కూడా లేకుండా 55 కోట్ల రూపాయలు చెల్లించడం తప్పిదమే అవుతుంది.
గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్లు సినిమావాళ్ల జోలికి వెళ్లేవారు కాదు. ముఖ్యంగా హీరోలకు ఎంతో గౌరవం ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా హీరోలతో ఆడుకున్నారు. బడా బడా స్టార్లు తన వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి దేబిరించేలా చేశారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి జగన్‌లా క్రూరంగా కాకుండా చట్టాన్ని ఉపయోగించి తానేమిటో చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగిందని చెప్పి అక్కినేని నాగార్జునకు చెందిన ‘ఎన్ కన్వెన్షన్’ను ఉన్నపళంగా కూల్చివేయించారు. ఇప్పుడు అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారు. చంద్రబాబు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రులు అయినప్పుడు సినీ ప్రముఖులు స్వయంగా వెళ్లి వారిని అభినందించే వారు. జగన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి విషయంలో ఇది వెంటనే జరగలేదు. హైదరాబాద్‌లో నివసిస్తున్నా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి పేరును సినిమా వాళ్లు గుర్తుంచుకోకపోవడాన్ని రేవంత్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయి ఉండవచ్చు.
రూల్ ఆఫ్ లా మాత్రమే పాటించాల్సిన అధికారులు అధికారంలో ఉన్న వారి మాటలకు గుడ్డిగా తలలాడిస్తే మూల్యం చెల్లించక తప్పదు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలా తలలాడించిన వాళ్లు జైలుకు వెళ్లాల్సి రావడంతో పాటు ఇప్పటికీ కేసుల నుంచి బయటపడలేదు. ఈ ఉదంతాలు తెలిసి కూడా ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్‌లో అఖిల భారత సర్వీసు అధికారులు రూల్ ఆఫ్ లా పాటించకుండా కష్టాలు కొని తెచ్చుకున్నారు. అధికారులు తప్పు చేయడానికి సిద్ధపడకపోతే రాజకీయ నాయకులకు కూడా ఇబ్బందులు రావు. ఫార్ములా–ఈ రేసు వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. నిబంధనలకు విరుద్ధంగా తాను నిధులు విడుదల చేయలేనని హెచ్‌ఎండీఏ ప్రత్యేక కమిషనర్ హోదాలో అర్వింద్ కుమార్ స్పష్టంచేసి ఉంటే ప్రస్తుతం విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడేది కాదు కదా. ఆయన నిబంధనలు పాటించి ఉంటే 55 కోట్ల రూపాయలు విడుదలయ్యేవి కావు. కేటీఆర్ మెడకు ఈ కేసు చుట్టుకునేదీ కాదు. అధికారులు విచక్షణతో వ్యవహరిస్తూ చట్టాలు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించబోమని స్పష్టంచేసినప్పుడు రాజకీయ నాయకులు కూడా తప్పు చేయలేరు.
యూట్యూబ్‌లో ‘కొత్త పలుకు’ కోసం
QR Code scan చేయండి