Share News

రైతన్నకు కాంగ్రెస్‌ చేయూత

ABN , Publish Date - Aug 03 , 2024 | 01:25 AM

వ్యవసాయానికి, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నది. దేశ చరిత్రలోనే 31 వేల కోట్లు రుణమాఫీకి కేటాయించడం రికార్డు. ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు ఇన్ని వేల కోట్లు కేటాయించలేదు.

రైతన్నకు కాంగ్రెస్‌ చేయూత

వ్యవసాయానికి, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నది. దేశ చరిత్రలోనే 31 వేల కోట్లు రుణమాఫీకి కేటాయించడం రికార్డు. ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు ఇన్ని వేల కోట్లు కేటాయించలేదు. 2022 మే 6న వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఓట్లు వేసి కాంగ్రెస్‌ను గెలిపించినందుకు కృతజ్ఞతగా రైతు రుణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుస్తున్నారు. రాష్ట్ర పరిస్థితి ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారు. రెండో విడత రుణమాఫీ కార్యక్రమానికి జూన్‌ 30వ తేదీ ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. 12 రోజుల్లో 12 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. లక్షన్నర లోపు ఉన్న ఆరు లక్షల 40 వేల మందిని సర్కార్ రుణ విముక్తులను చేసింది. ఇందుకోసం రూ.6190కోట్లను ఆరు లక్షల 40 వేల మంది రైతుల ఖాతాల్లో జమ చేసింది. మొదటి విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా లక్ష వరకు పంట రుణాలు ఉన్న 11,34,412 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో 6,034.96 కోట్లను జమ చేసి రుణమాఫీ చేపట్టింది. ఇలా ఇప్పటివరకు రెండు విడతల్లో కలిపి 17,75,235 మంది రైతుల క్రాప్ లోను ఖాతాల్లో రూ.12,224,98 కోట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం జమ చేసింది. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రం కూడా ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో రైతు రుణమాఫీ చేసిన దాఖలాలు లేవు. ఆగస్టు 15 లోపు రెండు లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. పాత రుణాలను మాఫీ చేస్తూ, మళ్లీ పంటల సాగు కోసం రైతులకు రుణాలు అందించేందుకు కృషి చేస్తున్నారు. రెండు విధాల రైతులకు ప్రయోజనం కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. దీంతోపాటు రైతులు కష్టపడి పండిస్తున్న పంటలకు భీమా కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించనున్నది. పంటలకు నష్టం జరిగితే బీమా కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పంటల బీమాను కూడా అమలు చేయలేకపోయింది. ఇది వారి అసమర్ధతకు నిలువుటద్దంగా నిలుస్తుంది.


బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. అప్పుల కుప్పగా మార్చారు. పదేళ్ల కాలంలో ఏడు లక్షల కోట్ల అప్పులు చేశారు. దీనికి పర్యవసానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలల్లోనే రూ.43వేల కోట్లు వడ్డీలకు చెల్లించింది. రాష్ట్రంలో వస్తున్న ఆదాయంలో అధికంగా వడ్డీలు చెల్లించడానికి సరిపోతున్నది. రెండవసారి రుణమాఫీ హామీతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ రూ.19వేల కోట్లు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి రూ.12వేల కోట్లు మాత్రమే విడుదల చేసింది. రైతులను మోసగించింది. దీంతో ప్రజలు బీఆర్ఎస్‌కు కర్రు కాల్చి వాత పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే 31వేల కోట్లతో రుణమాఫీ చేయడం రైతుల పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం.

– వెలిచాల రాజేందర్ రావు

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి

Updated Date - Aug 03 , 2024 | 01:25 AM