Share News

Trump's Obsession : ట్రంప్‌ విస్తరణ వాదం

ABN , Publish Date - Dec 28 , 2024 | 12:22 AM

వచ్చే నెలలో అమెరికా అధ్యక్షపదవిని చేపట్టబోతున్న డోనాల్డ్‌ ట్రంప్‌, ఇటీవల ఓ విచిత్ర ప్రకటన చేశారు. పనామా కాలువ తిరిగి అమెరికా అధీనంలోకి వచ్చేయాలన్నది ఆయన వ్యాఖ్యల సారాంశం.

Trump's Obsession : ట్రంప్‌ విస్తరణ వాదం

వచ్చే నెలలో అమెరికా అధ్యక్షపదవిని చేపట్టబోతున్న డోనాల్డ్‌ ట్రంప్‌, ఇటీవల ఓ విచిత్ర ప్రకటన చేశారు. పనామా కాలువ తిరిగి అమెరికా అధీనంలోకి వచ్చేయాలన్నది ఆయన వ్యాఖ్యల సారాంశం. అట్లాంటిక్‌, పసిఫిక్‌ సముద్రాలను కలిపే పనామా కాలువ అమెరికా వాణిజ్యానికి అతిముఖ్యం. నలభైశాతం వాణిజ్యం ఈ కాలువగుండా సాగుతున్నందువల్ల, అమెరికా తన ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకోవాలంటే అది పూర్తిగా తమ నియంత్రణలోనే ఉండాలంటున్నారు ఆయన. ఇంకా గద్దెనెక్కకముందే వరుస వివాదాస్పద వ్యాఖ్యలతో ట్రంప్‌ దుమారం రేపుతున్నారు. కెనడాని అమెరికా ౫1వ రాష్ట్రంగా అభివర్ణించారు, గ్రీన్‌లాండ్‌ను ఏకంగా కొనేస్తామన్నారు. పనామా కాలువ చైనా అధీనంలో ఉన్నదనీ, నౌకల మీద విధించే రాకపోకల రుసుములు చెల్లించలేక అమెరికా బక్కచిక్కిపోతోందనీ, అందువల్ల కాలువ తిరిగి తన చేతికివచ్చేయాలనీ అంటున్నారు. ఆయన ఏ నిముషానికి ఏమంటాడో, ఏమి చేస్తాడోనని మిత్రదేశాలు, శత్రుదేశాలు ఏకరీతిన వొణికిపోయే కాలం ఇప్పటికే మొదలైపోయింది.

ట్రంప్‌ వ్యాఖ్యల్లో ఔచిత్యం లేకపోవచ్చును గానీ, వ్యూహం ఉందట. అర్థంపర్థంలేని ఈ తరహా ప్రతిపాదనలు చేసినప్పుడు, ఎదుటివారు తమకు తెలియకుండానే కాస్తంత అర్థవంతంగా స్పందిస్తారు కనుక, వారు అలా వలలో పడగానే, అందులో నుంచి ట్రంప్‌ తన ప్రయోజనాన్ని ఏరుకోగలరట. కెనడాను గ్రేట్‌ స్టేట్‌ ఆఫ్‌ అమెరికాగా అభివర్ణిస్తూ, దాని ప్రధానిని తమ గవర్నర్‌గా వ్యాఖ్యానించడమనే దుస్సాహసం వెనుక ఆర్థిక, వాణిజ్య యుద్ధాలున్నాయి. ట్రంప్‌–ట్రూడో సుంకాల సంగ్రామం మధ్య గిలగిలలాడి కెనడా ఆర్థికమంత్రి చివరకు తట్టాబుట్టాసర్దుకున్న విషయం తెలిసిందే. జస్టిన్‌ ట్రూడో వంటి స్థితప్రజ్ఞతలేని నాయకుడికి ట్రంప్‌ సరిస్థాయిలో తూగుతారు.


గత పాలకుల నిర్ణయాన్ని తప్పుబట్టడంలో ట్రంప్‌ను మించినవారెవ్వరూ లేరు. ట్రంప్‌ కన్ను ఎప్పటినుంచో గ్రీన్‌లాండ్‌మీద ఉంది. డెన్మార్క్‌ నుంచి దీనిని కొనేస్తానని ఆయన తొలివిడత పాలనలోనే ఊగిపోయారు. ఇప్పుడు డెన్మార్క్‌కు కొత్త రాయబారిని ప్రకటిస్తున్న సందర్భంలో తిరిగి ఆ వాదన ముందుకు తెచ్చారు. అమెరికా భద్రతకీ, ఇంకా చెప్పాలంటే యావత్‌ ప్రపంచ స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకీ గ్రీన్‌లాండ్‌ తన గుప్పిట్లో ఉండటం అవసరమని విశ్లేషిస్తున్నారు. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా డెన్మార్క్‌ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. గ్రీన్‌లాండ్‌ అమ్మకానికి సిద్ధంగా లేదని ఆ స్వయంపాలిత ప్రాంతం అధినేత ఘాటుగా స్పందించారు. అట్లాంటిక్‌, ఆర్కిటిక్‌ సముద్రాల మధ్యన ఉన్న ఈ మంచుప్రాంతం అమెరికా సైనికస్థావరంగా, మరీ ముఖ్యంగా ప్రచ్ఛన్నయుద్ధకాలంలో పలురకాల రక్షణపరిశోధనలకు ఉపకరించిన విషయం తెలిసిందే. మంచు ఫలకం కిందన వందమీటర్ల లోతులో అర్ధంతరంగా వదిలేసిన ఒక సైనికస్థావరం నిక్షిప్తమైన విషయాన్ని నాసా ఇటీవల వెలుగులోకి తెచ్చింది. అనేకానేక మారణాయుధాలను దాచేందుకు, సన్నద్ధంగా ఉంచేందుకు ఈ క్యాంప్‌ సెంచురీని ఉపయోగించాలనుకున్నారు. అరవైఐదేళ్ళనాటి ఈ రహస్యనగరంలో ఆయుధాల అవశేషాలు, అణువ్యర్థాలు నిక్షిప్తమై ఉన్నాయన్నది వార్త. రక్షణపరంగా ఎంతో కీలకమైన గ్రీన్‌లాండ్‌ గురించి ట్రంప్‌ అదేపనిగా మాట్లాడటం, గతంలో తన మాట కాదన్నందుకు అలిగి డెన్మార్క్‌ పర్యటనను రద్దుచేసుకోవడం వంటి పరిణామాలు గమనిస్తే ఈ మారు అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన చర్యలు మరింత గట్టిగా ఉండవచ్చునేమో.


నూటపాతికేళ్ళక్రితం పనామా కాలువను నిర్మించింది అమెరికాయే గానీ, 1977లో జిమ్మీకార్టర్‌ హయాంలో కుదిరిన ఒప్పందం ప్రకారం అది 1999 డిసెంబరు 31న పనామా దేశం అధీనంలోకి వెళ్ళిపోయింది. అలనాటి పరిణామాన్ని ఇప్పుడు ట్రంప్‌ చారిత్రక తప్పిదంగా అభివర్ణిస్తున్నారు. మిత్ర దేశానికి తమ దేశం ఎంతో విలువైన ఈ కాలువను మూర్ఖంగా ఇచ్చేసిందనీ, దీనిని తీసుకున్నవారు బాధ్యతతో, నిబద్ధతతో వ్యవహరించనిపక్షంలో తన కొత్త యంత్రాంగం వెనక్కుతీసుకొనే పని మొదలుపెడుతుందని అంటున్నారు ఆయన. ఆ కాలువ వాడకానికి చెల్లించాల్సిన రుసుమును ఒక పద్ధతి ప్రకారం నిర్ణయిస్తామనీ, కాలువను తిరిగి ఇచ్చేయడం జరగనిపని అంటూ పనామా అధ్యక్షుడు ఘాటుగానే స్పందించారు. చైనా అధీనంలో ఈ కాలువ ఉన్నదన్న రీతిలో ట్రంప్‌ నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు అర్థంలేనివి. ఎంతోకాలంగా ఈ కాలువ సింగపూర్‌ సంస్థ నిర్వహణలో ఉండటంతో, అమెరికా వాణిజ్యనౌకలకు మాత్రమే అధిక రుసుముల కష్టాలు వచ్చినట్టుగా ఆయన చిత్రీకరిస్తున్నారు. కెనడానుంచి, నార్వేనుంచి ఆర్థిక, వాణిజ్య ప్రయోజనాలు, రాయితీలూ పొందడానికి ట్రంప్‌ ఈ తరహా ఒత్తిడి వ్యాఖ్యలు చేస్తున్నారని అర్థమవుతూనే ఉంది. దేశభద్రత పేరిట చివరకు మంచుద్వీపాన్ని కూడా ఆయన రాజకీయం చేస్తున్నారు.

Updated Date - Dec 28 , 2024 | 12:30 AM