Share News

TG: పాతకాపుల పోరు.. రెండోసారి గెలుపు కోసం బరిలో మాజీలు.. బలరాం నాయక్‌, కవిత, సీతారాంనాయక్‌..

ABN , Publish Date - May 05 , 2024 | 05:52 AM

ముగ్గురూ ముగ్గురే. నియోజకవర్గ ప్రజలతో ఆత్మీయ అనుబంధం ఉన్నవారే. ఒక్కోసారి ఒక్కొక్కరు ఎంపీగా గెలిచి.. పనితీరులో తమదైన ముద్ర వేసినవారే.

TG: పాతకాపుల  పోరు.. రెండోసారి గెలుపు కోసం బరిలో మాజీలు.. బలరాం నాయక్‌, కవిత, సీతారాంనాయక్‌..

  • మానుకోటలో మరోసారి త్రిముఖ పోటీ

  • రెండోసారి గెలుపు కోసం బరిలో మాజీలు.. బలరాం నాయక్‌, కవిత, సీతారాంనాయక్‌

  • అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఊపులో కాంగ్రెస్‌

  • ప్రతిష్ఠను కాపాడుకునే యత్నంలో బీఆర్‌ఎస్‌

  • సీతారాంను చేర్చుకుని రేసులో నిలిచిన బీజేపీ

ముగ్గురూ ముగ్గురే. నియోజకవర్గ ప్రజలతో ఆత్మీయ అనుబంధం ఉన్నవారే. ఒక్కోసారి ఒక్కొక్కరు ఎంపీగా గెలిచి.. పనితీరులో తమదైన ముద్ర వేసినవారే. రాజకీయ పరిస్థితులు కలిసివస్తే విజయకేతనం ఎగురవేసే సత్తా కలిగినవారే. అలాంటి ముగ్గురు దీటైన అభ్యర్థుల మధ్య మహబూబాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలో ఈసారి ముక్కోణపు పోటీ జరుగుతోంది. ఎవరు గెలిచినా.. రెండోసారి పార్లమెంటులో అడుగు పెట్టనుండడంతో విజయం కోసం ఎవరికి వారు తీవ్రంగా శ్రమిస్తున్నారు.


(ఆంధ్రజ్యోతి, మహబూబాబాద్‌)

2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మహబూబాబాద్‌ ఎస్టీ రిజర్వుడ్‌ పార్లమెంట్‌ స్థానం ఏర్పాటైంది. ఏజెన్సీ బెల్టులోని ములుగు, నర్సంపేట, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఇల్లెందు, భద్రాచలం, పినపాక అసెంబ్లీ సెగ్మెంట్లను కలుపుకొని నూతన లోక్‌సభ నియోజకవర్గంగా ఆవిర్భవించింది. ఈ స్థానానికి తొలిసారి 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోరిక బలరాంనాయక్‌, నాటి మహాకూటమి తరపున సీపీఐ నుంచి కుంజా శ్రీనివాసరావు, చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ నుంచి రిటైర్డ్‌ పోలీస్‌ అధికారి డీటీనాయక్‌ పోటీ చేయగా.. త్రిముఖ పోరు జరిగింది. ఆ పోరులో కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌ గెలుపొంది.. కేంద్రంలోని నాటి యూపీఏ ప్రభుత్వంలో మంత్రి కూడా అయ్యారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన ఎన్నికలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్‌ చేతిలో ఓడిపోయారు. ఇక 2019లో జరిగిన గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌.. సిటింగ్‌ ఎంపీగా ఉన్న సీతారాం నాయక్‌ను కాదని మాజీ ఎమ్మెల్యే మాలోత్‌ కవితను ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించింది. బీజేపీ తరఫున జాటోతు హుస్సేన్‌నాయక్‌ కూడా పోటీ చేసినా.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే హోరాహోరీ పోరు జరిగింది. ఈసారి మాలోత్‌ కవిత చేతిలో బలరాం ఓటమి చవిచూశారు.


అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం..

తెలంగాణ ఆవిర్భావం నుంచి వరుసగా రెండుసార్లు రాష్ట్రంలో అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్‌ ఇటీవల జరిగిన మూడో అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు జరిగిన ఆరు నెలల్లోపే పార్లమెంట్‌ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా.. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌, ఓటమిపాలైన బీఆర్‌ఎస్‌ మానుకోటలో నువ్వా? నేనా? అన్నట్టు తలపడుతున్నాయి. మరోవైపు తెలంగాణలో ఈసారి ఎలాగైనాఅత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ కూడా మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ సీతారాం నాయక్‌ను తమ పార్టీలో చేర్చుకొని మహబూబాబాద్‌ బరిలోకి దింపింది.


అయుతే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్‌ పరిధిలోని ములుగు, నర్సంపేట, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఇల్లెందు, పినపాక శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్‌ క్లీన్‌స్వీ్‌ప చేసింది. ఒక్క భద్రాచలంలో మాత్రం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపొందారు. కానీ, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. మొత్తంగా పార్లమెంట్‌ పరిధిలో ప్రస్తుతం ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్‌ పక్షాన ఉన్నారు.


ఆరు గ్యారెంటీలతో పాటు ప్రజలు మార్పు కోరుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ఇప్పటికే ఐదు గ్యారెంటీలు అమలు చేస్తోందని, పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ విజయం లభిస్తే మరికొన్ని అమలు చేస్తామంటూ సీఎం సహా ఆ పార్టీ నేతలంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక మోసపూరిత హామీలతో కాంగ్రెస్‌ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ప్రజలను మభ్యపెట్టిందంటూ ఓవైపు, కేంద్రంలోని బీజేపీ విభజన హామీలను విస్మరించి తెలంగాణకు అన్యాయం చేసిందని మరోవైపు రెండు అస్త్రాలు సంధిస్తూ బీఆర్‌ఎస్‌ ప్రచారంలోకి దిగింది. బీజేపీ మాత్రం తాము తెలంగాణ అభివృద్ధికి ఎంతో చేశామని, హ్యాట్రిక్‌ సాధిస్తే వచ్చే ఐదేళ్లలో మరింత అభివృద్ధి చేస్తామని చెబుతోంది.


యువ ఓటర్లే కీలకం!

మహబూబాబాద్‌ పార్లమెంటు స్థానం ఫలితాన్ని ఈసారి యువ ఓటర్లే నిర్దేశించే అవకాశాలున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 15,32,366 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో సుమారు 7 లక్షల దాకా యువ ఓటర్లే ఉన్నారు. వీరిలోనూ ఈసారి కొత్తగా నమోదైన ఓటర్ల సంఖ్య 46 వేలకు పైగా ఉంది. ఈ ప్రాంతలో సింగరేణి మినహా.. పరిశ్రమలంటూ లేకపోవడంతో నిరుద్యోగ సమస్య అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువత ఏ పార్టీవైపు మొగ్గు చూపుతారన్నదానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - May 05 , 2024 | 05:52 AM