AP Election 2024: వైసీపీలో నైరాశ్యం!.. అక్కడ పరిస్థితి చూసి అంతర్మథనం
ABN , Publish Date - Apr 29 , 2024 | 10:13 AM
కుప్పంలో వైసీపీ పైకి ఎన్ని మాటలు చెబుతున్నా పార్టీ పరిస్థితి తీసికట్టుగా మారుతోందన్నది నిజం. ఈనెల 24న భరత్ నామినేషన్ సందర్భంగా ర్యాలీ అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంపై ఆ పార్టీలో అంతర్మథనం జరుగుతోంది. నిజానికి ఫిబ్రవరి 26న సీఎం జగన్ కుప్పం పర్యటనకు ముందే వైసీపీలో లుకలుకలు బయటకు వచ్చాయి.
బుజ్జగింపులు.. ‘పంపిణీలు’ ఫలించక అసహనం
ఐదేళ్ల పాలనలో మీకు ఏమీ చేయలేకపోయాం. నిజమే. ఇప్పుడు ఎన్నికల వేళ మీరు అసంతృప్తితో కూచుంటే పార్టీ కుదేలవుతుంది. మీకు ఏదో ఒక సాయం అందేలా చూస్తా. జనంలోకి వెళ్లి పనిచేయండి. మీలో మీరు విభేదాలతో కొట్టుకుని రచ్చకు ఎక్కొద్దు. - కుప్పం, శాంతిపురంలో ఇటీవల జరిగిన గ్రామ స్థాయి ప్రజాప్రతినిధుల సమావేశంలో కొందరిని విడిగా పిలిపించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన బుజ్జగింపుల సారాంశమిది.
మీలో మీరు ఇంకా కొట్లాడుకుంటూనే ఉంటారా? పార్టీకోసం పనిచేయరా? ఎందుకు నా కడుపు కాలస్తారు? పనిచేస్తే చెయ్యండి. లేకపోతే ఇంట్లో పడుకోండి. నాకుమాత్రం ద్రోహం చేయకండి. - శాంతిపురంలో శనివారం సాయంత్రం ఆ మండల అధికార పార్టీ సర్పంచులు, ఎంపీటీసీల సమావేశంలో అభ్యర్థి భరత్ చేసిన వ్యాఖ్యలివి.
సొంత పార్టీ నేతలకు పది రోజుల కిందట మంత్రి పెద్దిరెడ్డి బుజ్జగింపులు.. ఒక రోజు కిందట అభ్యర్థి భరత్ అసహనం.. వీటిమధ్య ఏం జరిగింది? ఏపీ అసెంబ్లీ ఎన్నికలు (AP Election 2024) వేళ వైసీపీ ఎందుకంత నైరాశ్యంలోకి వెళ్లిపోతోంది? దీని వెనుక పరిణామాలను పరిశీలిస్తే..
కుప్పంలో వైసీపీ పైకి ఎన్ని మాటలు చెబుతున్నా పార్టీ పరిస్థితి తీసికట్టుగా మారుతోందన్నది నిజం. ఈనెల 24న భరత్ నామినేషన్ సందర్భంగా ర్యాలీ అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంపై ఆ పార్టీలో అంతర్మథనం జరుగుతోంది. నిజానికి ఫిబ్రవరి 26న సీఎం జగన్ కుప్పం పర్యటనకు ముందే వైసీపీలో లుకలుకలు బయటకు వచ్చాయి. తమకు గుర్తింపు లేకపోవడం, ఒక్క అభివృద్ధి పనీ జరగకపోవడం, ఎన్ని ఆందోళనలు చేసినా నీటి ట్యాంకర్లకు బిల్లులు ఇవ్వకపోవడంతో అధికార పార్టీ నేతలు తీవ్ర అసహనంతో ఉన్నారు. సీఎం సభను బహిష్కరించాలని అప్పట్లో అంతర్గత సమావేశాలు నిర్వహించారు. అప్పట్లో వారిని మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ భరత్ వారిని బుజ్జగించారు. నీటి బిల్లులు విడుదలయ్యాయి. ఇక, ఆర్థికసాయం కూడా భారీగా చేశాకనే వారంతా చల్లబడినట్లు అప్పట్లో ప్రచారమైంది. సీఎం సభకు వీరంతా హాజరైనా.. అనుకున్నంతగా జన సమీకరణ జరగలేదు. దీనికి గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడమే కారణమని తేల్చారు. తర్వాత దశలో వారిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలయ్యాయి.
ఐదేళ్లలో మాకేం ఒరిగింది?
అధికారంలోకి వచ్చాక తమకు ఏమి ఒరిగిందంటూ నెల క్రితం ఎమ్మెల్సీ భరత్ నిర్వహించిన సమావేశంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నిలదీశారు. ఈ క్రమంలో పది రోజుల కిందట మంత్రి పెద్దిరెడ్డి నిర్వహించిన సమావేశాల్లోనూ తమ అసంతృప్తిని వ్యక్తపరచడంలో వీళ్లు ఏమాత్రం తగ్గలేదు. మరీ తీవ్ర అసంతృప్తిలో ఉన్న గ్రామస్థాయి ప్రజాప్రతినిధులను పిలిపించి పెద్దిరెడ్డి బుజ్జగించాల్సి వచ్చింది. ఆ తర్వాత వీళ్లనూ సంతృప్తిపరిచారు. అయినా, ప్రచారాల్లో వారి ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంటోంది. శనివారం జరిగిన సమావేశంలో వారిపై భరత్ మండిపడటానికి కారణం ఇదేనని తెలిసింది. చేయాల్సిన ‘సాయం’ చేసినా దూరంగా ఉండిపోవడం ఏమిటని నిలదీసినట్లు సమాచారం. ఈ పరిణామాలతో భరత్ పూర్తిగా నైరాశ్యంలోకి జారిపోయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఏం చేశారని వెళ్లాలి?
‘ఈ ఐదేళ్లలో గ్రామాలలో ఒక్క అభివృద్ధి పనీ జరగలేదు. జనమేమో ఇంటి ముందు రోడ్డు ఏమైందని, కాలువ ఎందుకు కట్టలేదని నిలదీస్తున్నారు. పంచాయతీల స్థాయిలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి నేతల భూ కబ్జాలు, అమాయకులపై దాడులు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి. ఇలాంటప్పుడు ఓట్ల కోసం జనం ముందుకు ఏ నాయకులైనా ఏ ముఖం పెట్టుకుని వెళతారు’ అని వైసీపీ కార్యకర్తలే అంటున్నారు.
ఇవి కూడా చదవండి
AP Elections: వైసీపీ చివరి అస్త్రం ఇదే.. పైసలపైనే జగనన్న నమ్మకం..
AP Election 2024: ఓట్ల వేటలో రూ.కోట్లు.. బేరం చేస్తున్న వైసీపీ
Read Latest AP News and Telugu News