దోమకాటుకు దూరంగా...
ABN , Publish Date - Dec 22 , 2024 | 10:16 AM
చలికాలం దోమల భయం కాస్త ఎక్కువగానే ఉంటుంది. వాటి నుంచి రక్షణ కోసం సాధారణంగా స్ర్పేలు, కాయిల్స్, క్రీములు వాడుతుంటారు. అయితే అవన్నీ కూడా రసాయనాలతో కూడుకున్నవే. ఇటీవల కాలంలో దోమల బెడద నుంచి కాపాడుకునేందుకు కొన్ని ప్రత్యేక నూనెలు కూడా (ఎషన్షియల్ ఆయిల్స్) వస్తున్నాయి
చలికాలం దోమల భయం కాస్త ఎక్కువగానే ఉంటుంది. వాటి నుంచి రక్షణ కోసం సాధారణంగా స్ర్పేలు, కాయిల్స్, క్రీములు వాడుతుంటారు. అయితే అవన్నీ కూడా రసాయనాలతో కూడుకున్నవే. ఇటీవల కాలంలో దోమల బెడద నుంచి కాపాడుకునేందుకు కొన్ని ప్రత్యేక నూనెలు కూడా (ఎషన్షియల్ ఆయిల్స్) వస్తున్నాయి. అయితే వాటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే...
యూకలిప్టస్, పెప్పర్‌మింట్, టీ ట్రీ, లావెండర్ నుంచి కూడా నూనెలను తయారుచేస్తున్నారు. ఇవి కూడా దోమలు కుట్టకుండా రక్షణ కల్పిస్తాయి. వీటిలో టీ ట్రీ, లావెండర్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబియల్ ఉంటాయి. ఇవి దోమకాటును త్వరగా మాన్పిస్తాయి.
ఈ ప్రత్యేక నూనెలను నేరుగా చర్మంపై రాసుకోకూడదు. కొబ్బరి నూనెతో కలిపి అప్లై చేస్తే చక్కని ఫలితం ఉంటుంది. నీటిలో కలిపి ఇంట్లో, బట్టలపై స్ర్పే చేయొచ్చు.
సింట్రోనెల్లా అనే ప్రత్యేక నూనెను దోమలనాశినిగా చెబుతున్నారు. ఇది ‘లెమన్‌గ్రాస్’ నుంచి తయారవుతుంది. దోమలకు ఈ వాసన అస్సలు పడదు. వీటిని చర్మానికి రాసుకుంటే దోమలు అస్సలు అటువైపు తొంగి చూడవు.
పెప్పర్‌మింట్ ఆయిల్ చల్లగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి దోమకాటు వల్ల పుట్టే దురద నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది.
దూది ఉండలపై కొన్ని చుక్కల ఎషన్షియల్ ఆయిల్‌ను వేసి, వాటిని కిటికీలు, గుమ్మం దగ్గర పెడితే... దోమలు ఇంట్లోకి రావు.
రిపెల్లెంట్ క్రీములు, స్ర్పేలు ఈ ప్రత్యేక నూనెల కన్నా మెరుగ్గా పనిచేస్తాయనడంలో సందేహం లేదు. అయితే ఎకో ఫ్రెండ్లీగా వీటిని కూడా వినియోగిస్తే బాగుంటుందంటున్నారు పరిశోధకులు.
సాధారణ స్నానాలకు, స్పా స్నానాలకు తేడా ఉన్నట్టే... దోమల మందులకు, ప్రత్యేక నూనెలకూ ఉంది. స్ర్పేలు, క్రీముల వాసన చాలామందికి పడదు. అయితే ఈ ఎషన్షియల్ ఆయిల్స్ రసాయన రహితంగా ఉండటమే కాకుండా చక్కని సువాసనతో సుఖనిద్రకు దోహదం చేస్తాయి.
క్రీములు కొందరి చర్మాలకు సరిపడవు. వాటిలో రసాయనాలుంటాయి కాబట్టి ఇబ్బంది పెడతాయి. ఎషన్షియల్ ఆయిల్స్‌తో ఆ బాధ ఉండదు. ఇప్పటికే సౌందర్య పోషణలో ఇవి ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి. ఇటీవల దోమల బెడద నుంచి కూడా తప్పిస్తాయని తేలింది. వీటిని సహజసిద్ధమైన నూనెలుగా, సురక్షితమైనవిగా పేర్కొంటున్నారు స్కిన్‌కేర్ స్పెషలిస్టులు.
దోమల మందులు ఏవి వాడినా వాటిపై ఉండే సూచనలు తప్పకుండా పాటించాల్సిందే. కళ్లు, ముక్కు వంటి సున్నిత అవయవాలకు కాస్త దూరంగా అప్లై చేస్తే ప్రమాదం బారిన పడకుండా ఉండొచ్చు. ఎట్టిపరిస్థితుల్లో వాటిని పిల్లలకు మాత్రం అందుబాటులో ఉంచొద్దు.