Share News

Beer: బీర్ అంటే తెగ లైక్ చేస్తారా.. రోజుకు ఎంత తాగలంటే..

ABN , Publish Date - Nov 30 , 2024 | 05:08 PM

భారతదేశంలో మద్యం తాగే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎక్కువ తాగితే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే, రోజుకు ఎంత తాగితే సురక్షితంగా ఉంటారో ఈ కథనంలో తెలుసుకుందాం..

Beer: బీర్ అంటే తెగ లైక్ చేస్తారా.. రోజుకు ఎంత తాగలంటే..
Beer

భారతదేశంలో మద్యం తాగే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రజలు తాగే ఆల్కహాల్ డ్రింక్స్ లో బీర్ ముందు వరుసలో ఉంది. గోధుమ, బార్లీ వంటి ధాన్యాలను పులియబెట్టడం ద్వారా దీనిని తయారు చేస్తారు. దేశంలో అనేక రకాల బీర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆల్కహాలిక్ డ్రింక్‌లో 4% నుండి 6% ఆల్కహాల్ ఉంటుంది. మితంగా బీర్ తాగితే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కానీ, ఎక్కువైతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. బీర్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, అప్రయోజనాలు, వారంలో ఎన్ని బీర్లు తాగితే సురక్షితం..? అనే విషయాలను తెలుసుకుందాం..

14 యూనిట్లు..

నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) నివేదిక ప్రకారం, పురుషులు, మహిళలు వారానికి 14 యూనిట్ల కంటే ఎక్కువ మద్యం తాగకూడదు. 14 యూనిట్లు 10 మిల్లీలీటర్లు లేదా 8 గ్రాముల ఆల్కహాల్ తీసుకోవడం మంచిది. ఉదాహరణకు 568 మిల్లీలీటర్ల సాధారణ బీరు క్యాన్‌లో 5% ఆల్కహాల్ ఉంటుంది. ఇందులో దాదాపు 3 యూనిట్ల ఆల్కహాల్ ఉంటుంది. అంటే మీరు ఒక వారంలో 6 క్యాన్ల సాధారణ బీర్ తాగితే మీరు 14 యూనిట్ల పరిమితిలో ఉంటారు. అంతకు మించి తాగితే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని నిపుణులు చెబుతున్నారు. అలాగే రెగ్యులర్ డ్రింక్స్ తాగేవారు ప్రతి వారం కనీసం రెండు రోజులు మానేయాలి. ఇలా చేయడం వల్ల ఆల్కహాల్ ప్రభావం నుంచి శరీరం కోలుకోవడానికి సమయం లభిస్తుంది.


గుండె జబ్బులు..

ఈ ఆల్కహాలిక్ డ్రింక్‌లో చిన్న మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి ఎముకలను దృఢపరుస్తాయి. ఫలితంగా ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుంది. జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీలో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో బీర్‌లో పాలీఫెనాల్స్ అనే పదార్థాలు ఉన్నాయని తేలింది. పాలీఫెనాల్స్ గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. రోజుకు ఒక బీరు తాగే మహిళలు, రెండు బీర్లు తాగే పురుషులకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పరిశోధనలో తేలింది.

లిమిట్‌కు మించి..

అధికంగా సేవిస్తే అమృతం విషంగా మారుతుంది అన్న సామెత.. బీరుకు కూడా వర్తిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పరిమితికి మించి బీర్ తాగితే కాలేయం, గుండె సమస్యలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మీ శరీరం డీహైడ్రేట్ గా మారుతుంది. తలనొప్పి, నోరు పొడిబారడం, నీరసం వంటి సమస్యలు వస్తాయి. బీర్ పరిమితికి మించి తాగడం వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అందుకే మద్యం పూర్తిగా మానేయడం మంచిది. మద్యం సేవించే అలవాటు ఉన్నవారు లిమిట్‌కు మించి తాగకండి.. మీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ నిపుణులు చెబుతున్నారు.

(Note: ఈ కథనంలో ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందించాము.. ABN న్యూస్ దీనిని ధృవీకరించలేదు.)

Updated Date - Nov 30 , 2024 | 05:26 PM