Tulasi: తులసి ఆకులను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే.. ఈ సమస్యలన్నీ దూరం..
ABN , Publish Date - Nov 18 , 2024 | 11:05 AM
తులసి ఆకులను ప్రతిరోజూ పరగడపునే తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని గొప్ప గుణాలు చాలా వరకూ ఆరోగ్యాని కాపాడుతాయని.. చాలా సమస్యల్ని దూరం చేసుకోవచ్చని అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం..
Tulasi: తులసి చెట్టు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. ప్రతి రోజూ పూజలు అందుకుంటుంది. ఇందులోని గొప్ప గుణాలు చాలా వరకూ ఆరోగ్యాని కాపాడుతాయని నిపుణులు చెబుతున్నారు. కఫం, జ్వరం జబ్బులు వంటివి వచ్చినప్పుడు తులసి ఆకు చక్కని పరిష్కారం ఇస్తుందని అంటున్నారు. ప్రతిరోజూ పరగడపునే తులసిని తీసుకోవడం వల్ల చాలా సమస్యల్ని దూరం చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
ఉదయాన్నే తింటే..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో రెండు తులసి ఆకులని తీసుకుంటే గ్యాస్ సమస్యలు, గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణ సమస్యలు కూడా దూరం చేసుకోవచ్చు. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటి దుర్వాసనని దూరం చేసేందుకు ఎంతగానో సాయపడతాయి. కాబట్టి, ప్రతిరోజూ రెండు ఆకులని తీసుకోండి. తులసి ఆకులని కూరగాయలతో కలిపి వంటల్లో కూడా వాడొచ్చు. ఇలా చేయడం వల్ల ఆహారానికి, ఆరోగ్యకరమైన ప్రయోజనాలను జోడిస్తుంది.
తులసి టీ..
ఒక కప్పు వేడి నీటిలో 1, 2 టీ స్పూన్ల తులసి ఆకులని కలపాలి. 5, 10 నిమిషాలు ఉడకబెట్టి చల్లారిన తర్వాత తాగండి.
ఆర్థరైటిస్..
తులసిలోని యూజినాల్ అనే సమ్మేళనం, ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడంతోపాటు వాపుని తగ్గించడంలో సాయపడుతుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని కొవ్వుని కరిగించి బరువుని తగ్గించడంలో సాయపడుతుంది.
అలర్జీ..
తులసి ఆకులు అలర్జీ లక్షణాలను తగ్గించడంలో సాయపడతాయి. దీనిలోని యూజీనాల్ అనే సమ్మేళనం మానసిక స్థితిని మెరుగుపరచడంతోపాటు విశ్వాసాన్ని పెంచడంలో సాయపడుతుంది.
ఆస్తమా..
తులసి ఆకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఊపిరితిత్తులని క్లియర్ చేయడం మాత్రమే కాకుండా ఉబ్బసం ఉన్నవారిలో శ్వాస సమస్యను క్లియర్ చేస్తుంది.
డయాబెటిస్..
తులసిలో ఉండే యూజీనాల్ అనే సమ్మేళనం టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి మేలు చేస్తుంది. రక్తంలో చక్కెరస్థాయిలను తగ్గించడంలో తులసి ఆకులు ఎంతగానో సాయపడుతాయి. కాబట్టి, రెగ్యులర్‌గా తులసిని తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
గుండె సమస్యలకి..
తులసిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్.. ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా శరీరాన్ని కాపాడతాయి. తులసిలోని యూజినాల్ కొలెస్ట్రాల్‌ని తగ్గించి హృదయ స్పందన రేటుని కంట్రోల్ చేసి గుండె సమస్యలను తగ్గించడంలో సాయపడుతుంది.
ఇమ్యూనిటీ..
వర్షాకాలంలో చాలా మంది జలుబు, దగ్గు వంటి ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతారు. తులసి ఆకులను తీసుకోవడం వల్ల ఈ సమస్యలన్నీ తగ్గుతాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడతాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)