Sitting Problems: ఎక్కువ సేపు కూర్చుంటున్నారా.. ఈ ప్రమాదాలు తప్పవు..
ABN , Publish Date - Nov 17 , 2024 | 11:34 AM
ఆఫీసు వర్కు పేరుతో మీరు గంటలు గంటలు అలానే కూర్చుంటున్నారా..? ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎక్కువసేపు కూర్చోడం వల్ల హైబీపీ, కొలెస్ట్రాల్ స్థాయులు పెరుగుతాయి. వీటి కారణంగా..
Sitting Problems: ఆఫీసు వర్కు పేరుతో మీరు గంటలు గంటలు అలానే కూర్చుంటున్నారా?అలా ఎప్పుడూ కూర్చుని ఉండటం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కదలికలు లేక ఎముక పటుత్వము తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా నడక, పరుగు వంటి బరువు మోసే పనులు చేస్తే తుంటి ఎముక, కాళ్లల్లోని ఎముకలు బలిష్టంగా తయారవుతాయని, వాటి సాంద్రత కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
శరీరక శ్రమ తగ్గిపోయింది..
రోజు రోజుకూ మనిషి శరీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. ప్రతి పనికి యంత్ర పరికరాలు ఉండడం, మరోవైపు సెల్ ఫోన్‌లు, కంప్యూటర్లతో ఏ.సి గదుల్లో ఉద్యోగాల కారణంగా గంటలు గంటలు అలానే కూర్చోని ఉండడం, శరీరాలు అటు ఇటు కదిలించేందుకు ఎక్కడా అవకాశం లేకుండా పోతుంది. ఒకే చోట గంటల తరబడి కూర్చుని పని చేస్తూ కాలం వెళ్ళదీస్తున్నారు. ఇలా ఉన్న వారు ఇప్పటికే చాలా మందిని అనేక రకాల జబ్బులతో అనారోగ్యం పాలయ్యారు. గంటల తరబడి కూర్చుని ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గుండె సమస్యలు..
కదలకుండా అలానే కూర్చునే వారికి గుండె జబ్బుల ముప్పు రెండింతలు ఎక్కువగా ఉంటోదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువసేపు కూర్చుంటే మన శరీరంలోని కండరాలు కొవ్వును ఎక్కువగా కరిగించలేవు. రక్తప్రసరణ కూడా మందగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుండెలోని రక్తనాళాల్లో కొవ్వు పూడుకోవటం మొదలుపెడుతుందని.. ఇదే గుండె జబ్బుకు, గుండె పోటుకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువసేపు కూర్చోడం వల్ల హైబీపీ, కొలెస్ట్రాల్ స్థాయులూ పెరుగుతాయి. వీటి కారణంగా గుండె సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.
వెన్నెముక సమస్యలు..
ఒకే చోట కూర్చుని ఉండటం వల్ల వెన్నముక సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. కుర్చీలో ఎక్కవసేపు అలానే కూర్చుని ఉండటం వల్ల కడుపు కండరాలు సడలిపోవటం, వీపు కండరాలు బిగుతు కావటం.. వెన్నెముక బాగా ముందుకు వంగిపోవడంతోపాటు సమస్యలకు దారితీస్తుంది. రోజంతా కూర్చుని ఉండే వారిలో తుంటి ఎముక బాగం బిగుతుతనం కోల్పోయి నడిచే సమయంలో పటుత్వం కోల్పోయే ప్రమాదం కూడా ఏర్పడుతుంది.
క్యాన్సర్..
కూర్చోవడం వల్ల చాలా తక్కువ శక్తి ఖర్చవుతుంది. దీనివల్ల ఊబకాయం రావటం, రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోవడం, నడుము చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోవడం, కొలెస్ట్రాల్ స్థాయిల్లో అసమతుల్యత ఏర్పడటం వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. సుదీర్ఘకాలం కూర్చోవడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా అధికంగా ఉంటుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)