Health Tips: ఏ పనిపైనా ఏకాగ్రత ఉండట్లేదా? ఈ లోపమే కావొచ్చు..!
ABN , Publish Date - Aug 11 , 2024 | 09:03 PM
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి విటమిన్లు, మినరల్స్ ఎంత అవసరమో.. శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా అంతే అవసరం. ఇలాంటి ఆరోగ్యకరమైన, అవసరమైన కొవ్వులలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఒకటి. శరీరంలో ఒమేగా-3 లోపం ఉంటే.. అనేక సమస్యలు ఎదురవుతుంటాయి.
Health News: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చాలా అవసరం. శరీరంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు తక్కువగా ఉంటే.. అది శారీరక, మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ఒమేగా -3, ఒమేగా -6 మన శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు. దీనిని పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (PUFAs) అని కూడా అంటారు. ఇది హృదయానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో మంటను తగ్గించడానికి కొవ్వు ఆమ్లాలు అవసరం. అవి సాల్మన్, ట్యూనా, సార్డినెస్ వంటి చేపలలో.. అలాగే చియా గింజలు, అవిసె గింజలు, వాల్‌నట్స్‌లో కూడా ఉంటాయి. ఈ కొవ్వు ఆమ్లాలు శరీరంలోని వివిధ రకాల విధులకు ముఖ్యమైనవి. ఆరోగ్యకరమైన మెదడు, గుండె పనితీరును నిర్వహించడం, మంటను తగ్గించడం, హార్మోన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌లో మూడు రకాలు ఉన్నాయి. అయితే, శరీరంలో ఒమేగా 3 లోపం ఉన్నప్పుడు కనిపించే లక్షణాలేంటో ఇవాళ మనం తెలుసుకుందాం..
గుండె ఆరోగ్యానికి..
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అవసరం. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం ద్వారా గుండెను వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఒమేగా-3 వంటి కొవ్వు ఆమ్లాల ద్వారా గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఒమేగా-3 ట్రైగ్లిజరైడ్స్‌ని తగ్గించి బీపీని బ్యాలెన్స్ చేస్తుంది. ఇది రక్తం గడ్డకట్టడం, వాపు వంటి సమస్యలను తగ్గిస్తుంది.
ఒమేగా-3 లోపం వలన శరీరంలో కనిపించే లక్షణాలు..
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో లోపిస్తే రోగనిరోధక శక్తి బలహీనపడటం మొదలవుతుంది.
తరచూ అనారోగ్యానికి గురవుతారు. శరీరం వ్యాధులతో పోరాడలేకపోతుంది.
ఒమేగా -3 లోపం కారణంగా మహిళలు పీరియడ్స్, గర్భధారణ సమయంలో సమస్యలను ఎదుర్కొంటారు. అధిక రక్తస్రావం అవుతుంది.
ఒమేగా-3 తక్కువగా ఉన్నప్పుడు ఏ పనిపైనా ఏకాగ్రత సాధించలేరు. దేనిపై దృష్టి సారించలేదు.
కొన్నిసార్లు చిరాకు, ఆందోళన కూడా కలుగుతుంది. ఒమేగా-3 లోపం వల్ల కొందరికి త్వరగా కోపం వస్తుంది.
ఒమేగా-3 లోపం మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తుంది. దీంతో శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతాయి.
ఒమేగా-3 లోపం వల్ల కళ్లు పొడిబారడం, కంటిశుక్లం వచ్చే ప్రమాదం ఉంది.