బరువు పెరగాలంటే...
ABN , Publish Date - Dec 29 , 2024 | 09:11 AM
బరువు పెరగాలంటే మన శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారం తీసుకోవాలి. కానీ ఈ ఆహారం కూడా ఆరోగ్యవంతమైనది కాకపోతే బరువు పెరగడంతో పాటు అనారోగ్యం తోడయ్యే ప్రమాదం ఉంది.
నాకు 61 ఏళ్ళు. ఎత్తు 5.10, బరువు 57 కిలోలు ఉంటాను. షుగరు, బీపీ వంటి ఆరోగ్య సమస్యలేమీ లేవు. నేను బరువు పెరగాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి?
- అజయ్, గుడివాడ
బరువు పెరగాలంటే మన శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారం తీసుకోవాలి. కానీ ఈ ఆహారం కూడా ఆరోగ్యవంతమైనది కాకపోతే బరువు పెరగడంతో పాటు అనారోగ్యం తోడయ్యే ప్రమాదం ఉంది. ఆరోగ్యకరంగా బరువు పెరగాలంటే, రోజుకు అరలీటరు పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవాలి. రెండు గుడ్లు, రెండు వందల గ్రాముల చికెన్ లేదా చేప కూడా ప్రతిరోజూ తీసుకోవచ్చు.
వీటన్నింటితో పాటుగా, కనీసం రెండు మూడు కప్పుల కాయగూరలు లేదా ఆకుకూరలు తీసుకోవాలి. అంతేకాకుండా రోజులో రెండుసార్లు స్నాక్స్‌గా పళ్ళు, బాదం, ఆక్రోట్ వంటి గింజలు కూడా తీసుకోవాలి. రోజు గుప్పెడు వేరుశెనగపప్పు కూడా తీసుకుంటే మంచిది. వయసురీత్యా మీరు బరువు పెరిగేప్పుడు కొవ్వు కంటే కండరాలు ఎక్కువ పెరగాలి. దీనికోసం తగిన వ్యాయామం కూడా తప్పనిసరిగా ఉండాలి.
రోజూ అరగంట వ్యాయామానికి కేటాయిస్తే తీసుకున్న ఆహారం బాగా వంట బట్టి బరువు పెరగడానికి ఉపయోగపడుతుంది. రోజుకు కనీసం ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకుంటే మంచిది. రాత్రి భోజనం వెంటనే కాకుండా కనీసం రెండు గంటల విరామం తరువాత నిద్రకుపక్రమిస్తే మంచిది. నిద్ర పోయేముందు గ్లాసు పాలు తాగడం ద్వారా మరిన్ని క్యాలరీలు ఆహారంలో చేర్చుకోవచ్చు.
నా వయసు 36 ఏళ్ళు. నాకు మూడు నెలల క్రితం హిస్టరెక్టమీ, అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది. అప్పటి నుంచి మలబద్దకం సమస్య వచ్చింది. రోజూ కాయగూరలు ఎక్కువగా తింటున్నా. మూడు నాలుగు లీటర్ల నీళ్లు కూడా తాగుతున్నా. అయినా సమస్య అలాగే ఉంది. పరిష్కారం తెలుపగలరు.
- భవాని, ఉదయగిరి
కొన్నిరకాల ఆపరేషన్ల తరువాత జీర్ణవ్యవస్థ తిరిగి పూర్తి స్థాయిలో సక్రమంగా పని చేయడానికి సమయం తీసుకుంటుంది. ఆపరేషన్ తరువాత శారీరక శ్రమ లేకపోవడం, కదలిక కూడా తక్కువగా ఉండడం వలన కూడా మలబద్దకం సమస్య పెరుగుతుంది. అందుకే ఆహారంలో పీచుపదార్థాలు, నీరు తగినంత తీసుకోవడం ముఖ్యం. కూరగాయలు, ఆకుకూరలతో పాటు అన్నిరకాల పండ్లు, బియ్యం, గోధుమలు వంటి ధాన్యాలు, కందులు, పెసలు, సోయాచిక్కుడు, అలసందలు, సెనగలు వంటి పప్పు ధాన్యాలు ఆహారంలో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా పప్పు ధాన్యాల్లో, పండ్లలో ఉండే సాల్యుబుల్ ఫైబర్ మలవిసర్జన తేలికగా అయ్యేందుకు ఉపయోగపడుతుంది. నీటిని కూడా ఒకేసారి అధిక మోతాదులో కాకుండా మెల్ల మెల్లగా రోజంతా తాగుతూ ఉండడం మంచిది. నడక తప్పనిసరి. శరీరానికి కదలిక ఉంటేనే మెల్లగా సమస్య పరిష్కారమవుతుంది. సమస్య ఆహారంతో పరిష్కారం కానప్పుడు తాత్సారం చేయకుండా వైద్యుల సలహాతో తగిన మందులు వాడాలి.
రేగుపండ్లలో పోషక విలువలేమిటి? వాటి వలన ఏవైనా ఆరోగ్య ప్రయోజనాలున్నాయా?
- పవన్‌కుమార్, వరంగల్
రేగుపండ్లు ఆకుపచ్చ రంగు, లేత ఎరుపు రంగు, ముదురు ఎరుపు రంగులోను .. ఇలా రకరకాలుగా లభిస్తాయి. వీటన్నింటిలోనూ పోషకాలు అధికమే. రేగుపళ్ళు ఏ రంగులో ఉన్నా వివిధ రకాల పండ్లలానే వీటిల్లోనూ పిండి పదార్థాలు ఎక్కువ. పచ్చిగా ఉన్నప్పటికన్నా పండినప్పుడు రేగు పళ్లలో చక్కెర శాతం పెరుగుతుంది. రేగుపళ్లలో సి విటమిన్, పీచు పదార్థం, క్వేర్సెటైన్, కాటెచిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటివలన గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంతో పాటు కొలెస్ట్రాల్, బీపీ సమస్య అదుపులో ఉంటాయి. నిద్రలేమి సమస్య ఎదుర్కోడానికి రేగుపండ్లు ఉపయోగపడతాయి. అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలకు కూడా ఈ పండ్లు చక్కటి పరిష్కారం.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్
(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.com కు పంపవచ్చు