Share News

Rambutan: రాంబుటాన్ పండు ఎప్పుడైనా తిన్నారా? ఈ పండు వల్ల కలిగే ప్రయోజనాలేంటంటే..!

ABN , Publish Date - Mar 26 , 2024 | 03:56 PM

రాంబుటాన్ పండు గురించి చాలామందికి తెలియని నిజాలివీ..

Rambutan: రాంబుటాన్ పండు ఎప్పుడైనా తిన్నారా? ఈ పండు వల్ల కలిగే ప్రయోజనాలేంటంటే..!

విదేశాల నుండి పరిచయమైన చాలారకాల పండ్లు భారతీయుల జీవితంలో భాగమైపోయాయి. కొన్ని పండ్లు కొన్ని ప్రాంతాలలో మాత్రమే లభిస్తాయి. ఇవి చూడటానికి, తినడానికి, రుచిలో కూడా చాలా వెరైటీగా ఉంటాయి. అలాంటి పండ్లలో రాంబుటాన్ పండు ఒకటి. ఇది చూడటానికి ఎర్రగా పండు పైన ముళ్లలాగా ఉంటుంది. లోపల కండ భాగం తెల్లగా ఉంటుంది. రాంబుటాన్ పండును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటిలో ముఖ్యమైన 5 ప్రయోజనాల గురించి తెలుసుకుంటే..

పోషకాలు..

రాంబుటాన్ పండ్లలో పోషకాలు సమృద్దిగా ఉంటాయి. విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. రోజువారి శరీరానికి అవసరమైన చాలా మొత్తం విటమిన్-సి ని ఈ రాంబుటాన్ పండు అందిస్తుంది. ఇక ఇందులో నియాసిన్, రిబోఫ్లావిన్, థయామిన్ తో సహా చాలారకాల బి విటమిన్లు ఉంటాయి.

ఇది కూడా చదవండి: ఆరోగ్యం బిందాస్ గా ఉండటానికి 7 అద్భుత అలవాట్లు..!


యాంటీఆక్సిడెంట్లు..

రాంబుటాన్ పండ్లలో ప్లేవనాయిడ్లు, ఫినాలిక్ సమ్మేళనాలు, విటమిన్-సి వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి హానికరమైన ఫ్రీరాడికల్స్ ను తటస్థీకరించడంలో, ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడతాయి. రెగ్యులర్ గా రాంబుటాన్ పండును తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

రోగనిరోధకశక్తి..

విటమిన్-సి కంటెంట్ అధికంగా ఉన్న కారణంగా రాంబుటాన్ పండు రోగనిరోధకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. తెల్లరక్తకణాల ఉత్పత్తికి విటమిన్-సి చాలా అవసరం. ఇది ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాల నుండి శరీరాన్ని రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. జలుబు, ఫ్లూ వంటి సీజనల్ సమస్యలున్నప్పుడు రాంబుటాన్ పండు తింటే ఉపశమనం ఉంటుంది.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో తప్పక తినాల్సిన స్ట్రీట్ ఫుడ్స్ లిస్ట్ ఇదీ..!


జీర్ణ ఆరోగ్యానికి..

రాంబుటాన్ పండులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి అవసరం. పేగు కదలికలు సాధారణంగా ఉండటానికి ఫైబర్ సహాయపడుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ కు మద్దతు ఇస్తుంది.

చర్మ ఆరోగ్యం..

రాంబుటాన్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అంతర్గత ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి. కాలుష్యం, యువి రేడియేషన్ వంటి పర్యావరణ ప్రతికూలతల నుండి చర్మాన్ని కాపాడటంలో సహాయపడతాయి. ఇక ఇందులో ఉండే విటమిన్-సి కొల్లాజెన్ సంశ్లేషణలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది చర్మ స్థితిస్థాపకతను నిర్వహించి అకాల వృద్జాప్యాన్ని నివారిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 26 , 2024 | 03:56 PM