రాగులు తినేవారే భోగులు
ABN , Publish Date - Nov 10 , 2024 | 10:16 AM
‘‘రాగులు చల్లితే. రేగులు మొలిచాయి’’ అని సామెత. రాగులు చిట్టిగింజలే గానీ రేగంత ప్రమాణంలో పనిచేస్తాయి. ‘‘సంకటి కోసం రాగులు గంజికోసం చోళ్లు’’ అని నానుడి. రాగుల్ని తైదలని, చోళ్ళు అని కూడాపిలుస్తారు. రాగులే సంపద ఒకప్పుడు మనకి.
‘‘రాగులు చల్లితే. రేగులు మొలిచాయి’’ అని సామెత. రాగులు చిట్టిగింజలే గానీ రేగంత ప్రమాణంలో పనిచేస్తాయి. ‘‘సంకటి కోసం రాగులు గంజికోసం చోళ్లు’’ అని నానుడి. రాగుల్ని తైదలని, చోళ్ళు అని కూడాపిలుస్తారు. రాగులే సంపద ఒకప్పుడు మనకి. రాగుల్ని తిరగట్లో విసరుతారు కాబట్టి పైన తిరిగే తిరగలి రాయిని రాగురాయి అంటారు.‘‘నట్టింట ఉండాది రాగుల రాసి’’, పైరుకు రాగులు- భాగ్యానికి మేకలు’’ లాంటివి రాగిని సంపదగా భావించిన సామెతలు. రోగాలకు రాగులు, భోగాలకు బియ్యం అనేది కొత్త సామెత.
రాగి అన్నం: రాగుల్ని ఒక రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే కొద్దిసేపు తడి ఆరనిచ్చి దోరగా వేగించి ఎసట్లో పోసి వండిన రాగి అన్నాని వరన్నంలాగా కూర, పప్పు, పులుసులతో తినవచ్చు.
రాగి రొట్టె: రాగిపిండిలో కోడిగుడ్డు సొన, పాలు, వెన్న కలిపిన ముద్దతో చేసిన పుల్కా లేదా చపాతీలు ఎదిగే పిల్లలకు హితకరం.
రాగిపాలు: రాగి పిండిలో పంచదార కలిపి వేడినీళ్లు పోసి, బాగా కలిసేలా చిలికితే పాలమాదిరిగా అవుతాయి. పాలు సరిపడని పిల్లలకు, వృద్ధులకు మేలు చేస్తాయి. యాలకులపొడి లాంటివి కలుపుకోవచ్చు.
రాగి ఇడ్లీ: రాగిరవ్వలో కొబ్బరి తురుము, కొంచెం బెల్లం, కిస్మిస్, జీడిపప్పు చేర్చి, నీళ్ళు పోసి ఇడ్లీ పిండిలా గరిటజారుగా కలిపి పనస ఆకు దొన్నెల్లో పెట్టి ఆవిరిమీద ఉడికిస్తారు. కోనసీమ పనస పొట్టెంకల్లాగా వండిన ఈ రాగి ఇడ్లీలు ఆరోగ్యదాయకం.
రాగి మోదకాలు: రాగిపిండిని వేడి నీటితో చపాతీపిండిలా కలిపి చిన్నచిన్న పూరీలు వత్తుకోవాలి. కొబ్బరి, బెల్లం పాకంపట్టి లౌజు ఉండలు కట్టి, వత్తిన పూరీలో ఉంచి మూసి, ఆవిరిమీద ఉడికిస్తారు.
రాగులతో పులిహోర: రాగులతోనూ, వరి బియ్యంతోనూ వేరువేరుగా అన్నం వండి, రెండు అన్నాల్నీ అరిటాకులో రాశిగా పోసి పసుపు, చింతపండురసమూ, ఉప్పు వగైరా కలిపి తాలింపు పెట్టి పులిహోర చేస్తారు. జీడిపప్పు అదనపు రుచినిస్తుంది.
రాగి ఉండలతో టమాటాసూపు: రాగి పిండిని చపాతీ పిండిలా మృదువుగా చేసి. చిన్నచిన్న ఉండలు కట్టి, ఆవిరిమీద ఉడికించి, టమాటా, ఇతర కూరగాయలతో సూపు తయారు చేసుకుని, ఈ ఉండల్ని ఆ సూపులో వేసి మరి కొద్దిసేపు ఉడికిస్తారు. ఈ ఉండల్ని సూపుతో నంజుకుంటూ తింటే రుచిగా ఉంటాయి.
రాగులతో సూపు: రాగిపిండిలో కొద్దిగా నెయ్యి వేసి దోరగా వేయించి, కూరగాయల ముక్కలు కలిపి కావలసిన సంబారాలతో కాచిన సూపుని కొత్తిమీర, మిరియాల పొడితో అలంకరిస్తే కమ్మని సూపు తయారవుతుంది.
ఇవికాక ఇంకా: రాగి పిండిలో కొద్దిగా గోధుమపిండి, జీలకర్ర కలిపి పలుచని దోసెలు వేసుకోవచ్చు. రుబ్బిన మినప్పిండిలో రాగిపిండి కలిపి గారెలు, ఉల్లి, మిర్చి ముక్కలతోపకోడీలు వండుకోవచ్చు. రాగిరవ్వతో ఉప్మాచేసుకోవచ్చు, పెరుగు ఉల్లి, మిర్చి ముక్కలు కలిపి ఉప్మా వండితే రాగి చల్లపిండి అంటారు. రాగిపిండితో మైసూరు బజ్జీలు కూడా వండుతారు. రాగి పిండి హల్వా, కేసరి, బర్ఫీ కమ్మగా ఉంటాయి. రాగిలడ్లు, చక్రాలు, చేగోడీలు ఇప్పుడు బాగా ప్రసిద్ధిలో ఉన్నాయి. రాగిపిండితో పాల తాలికలూ చేసుకోవచ్చు. మైదాకు బదులుగా రాగిపిండికి ప్రాధాన్యత పెరిగితే మన ఆరోగ్యాలు చక్కబడతాయి.
చిరుధాన్యాల్లో రాగులు చిట్టి గింజలు! కయ్య దేవర నిఘంటువులో నర్తకి, మధూలిక అని వీటిని పిలిచారు. తీపిగా వగరుగా ఉంటాయి. చలవనిస్తాయి. రక్తధాతువృద్ధికి తోడ్పడతాయి. తేలికగా అరుగుతాయి. బలకరం,తృప్తినిస్తాయి. వాతాన్ని, పైత్యాన్ని, కఫాన్ని తగ్గిస్తాయి. బీపీ, గుండె జబ్బులు, షుగరు, కొవ్వుల్ని అదుపు చేస్తాయి. రోజుకి 100 గ్రాముల రాగులు తింటే రక్తంలో షుగరు, చెడ్డకొవ్వు తగ్గి, మంచి కొవ్వు 15ు పెరగటాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. ఎముక పుష్టికోసం రాగులే ముఖ్యం. దీనిలోని ఫైబరు రక్తంలోకి షుగరు, కొవ్వు వెంటనే చేర కుండా ఆలస్యం చేస్తుంది. స్థూలకాయం, షుగరువ్యాధి, గుండె జబ్బుల్లో రాగులు తప్పని సరి ఔషధం అందుకే!
రాగి తరవాణి దండిగా ఉంటుందని, కాయ కష్టం చేసుకునేవారికి అనుకూలంగా ఉంటుం దనీ, కఫదోషాన్ని తగ్గిస్తుందన్నాడు చరకుడు.
- డా. జి వి పూర్ణచందు, 94401 72642