Rice Ganji: అన్నం గంజి.. పాత పద్ధతి అని తీసిపారేయకండి.. అసలు విషయం తెలిస్తే వదిలిపెట్టరు..
ABN , Publish Date - Dec 09 , 2024 | 03:13 PM
అన్నం గంజి.. పాత పద్ధతి అని దీనిని తీసిపారేయకండి.. దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు. చలికాలంలో అన్నం గంజి ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Rice Ganji: చలికాలంలో అన్నం గంజి వినియోగం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. డీహైడ్రేషన్, డయేరియా, కలరా, గ్యాస్ట్రోఎంటెరిటిస్ వంటి సమస్యలతో బాధపడే వారు దీనిని ఎక్కువగా తీసుకుంటారు. చలికాలంలో మనం తక్కువ నీరు తాగడం వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. అంతేకాకుండా కడుపులో వేడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో అన్నం నుండి తయారు చేసిన గంజిని తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు. కడుపు చల్లగా ఉండటానికి అన్నం గంజిని ప్రయోజనకరంగా భావిస్తారు. అయితే, చాలా మందికి దీనిని ఎలా తయారు చేస్తారో తెలియదు. ఈ కథనంలో అన్నం గంజి ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం.
అన్నం గంజి తయారీ విధానం..
అన్నం తయారవ్వాలంటే బియ్యాన్ని ఉడికించాలి.. ఈ విషయం చాలామందికి తెలుసు. అన్నాన్ని వండేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నాయి. పొయ్యిపై కొందరు వండితే.. మరికొందరు కుక్కర్‌లో వండుతుంటారు. ప్రస్తుతం ఎలక్ట్రికల్ కుక్కర్లు అందుబాటులోకి రావడంతో వాటిని ఉపయోగిస్తున్నారు. చాలామంది అన్నాన్ని నీరు ఇంకించే విధానాన్ని ఫాలో అవుతున్నారు. అయితే, పాతరోజుల్లో అన్నం ఉడికిన తర్వాత కొంచెం నీరు ఉండగానే వార్చి.. భోజనం చేసేవారు. అలా అన్నాన్ని వార్చడం ద్వారా గంజి వస్తుంది. ఈ పద్ధతిని పాతకాలంలో బాగా ఫాలో అయ్యేవారు. అన్నం నుండి తయారు చేసిన గంజిని ఎక్కువగా తాగేవారు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందేవారు.
అన్నం గంజి ప్రయోజనాలు..
చలికాలంలో అన్నం గంజి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియకు సహాయపడుతుంది. బియ్యం గంజిలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కాల్షియం, ప్రోటీన్, విటమిన్లు వంటి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఇది శీతాకాలంలో మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది.
(Note:పై సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఇవ్వబడింది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ABN దీనిని ధృవీకరించ లేదు. ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించండి.)