Share News

India Alert: బంగ్లాదేశ్ అల్లర్లు.. అప్రమత్తమైన భారత్.. ప్రజలకు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Aug 04 , 2024 | 08:24 PM

ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న హింస ఆదివారం మరో మలుపు తిరిగింది. పోలీసుల దాడుల్లో ఒక్క రోజులో 72 మంది నిరసనకారులు చనిపోయారు.

India Alert: బంగ్లాదేశ్ అల్లర్లు.. అప్రమత్తమైన భారత్.. ప్రజలకు కీలక ఆదేశాలు

ఢాకా: ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న హింస ఆదివారం మరో మలుపు తిరిగింది. పోలీసుల దాడుల్లో ఒక్క రోజులో 72 మంది నిరసనకారులు చనిపోయారు. 100 మందికిపైగా గాయపడ్డారు.

తాజా పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో సరిహద్దు పంచుకుంటున్న భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్కడ భారత పౌరులను మన దేశ రాయబార కార్యాలయం అప్రమత్తం చేసింది. దేశంలో ఉన్న విద్యార్థులు సహా భారతీయ పౌరులు తమతో నిరంతరం సంప్రదింపులో ఉండాలని సిల్హట్‌లోని అసిస్టెంట్‌ హైకమిషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. ఇందుకు సంబంధించి స్థానిక కార్యాలయంలో ఫోన్‌ నంబర్లను అందుబాటులో ఉంచింది. అత్యవసర పరిస్థితుల్లో +88-01313076402లో సంప్రదించాలని సూచించింది.


సోషల్ మీడియాపై ఆంక్షలు..

దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతుండటంతో సోషల్ మీడియాపై ఆంక్షలు విధించారు. ఇప్పటికే ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. దీంతోపాటు ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలను సైతం నిలిపివేశారు. ఈ క్రమంలో షేక్ హసీనా తన వ్యక్తిగత నివాసం గణభబన్‌లో భద్రతా వ్యవహారాలపై జాతీయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరసనల పేరుతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వారు విద్యార్థులు కాదని ఉగ్రవాదులని.. వారందరికీ ప్రజలు గట్టి సమాధానం ఇవ్వాలని విన్నవించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్, భద్రతకు సంబంధించిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

చర్చలకు 'నో'

కాగా షేక్ హసీనా.. ఆందోళన చేస్తున్న విద్యార్థులను చర్చల కోసం తన నివాసానికి పిలిచారు. అయితే ప్రధానితో ఎలాంటి చర్చలు జరిపేది లేదని నిరసనకారులు తేల్చిచెప్పారు. షేక్ హసీనా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే పోరాటాలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అయితే నిర్బంధంలో ఉన్న విద్యార్థులందరినీ విడుదల చేయాలని ప్రధాని కోరినట్లు అవామీ లీగ్ ప్రకటించింది. తీవ్రమైన నేరాలకు పాల్పడిన నిర్దోషులను విడుదల చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు అధికార పార్టీ పేర్కొంది.


నిరసనలు ఎందుకు..

బంగ్లాదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగాల్లో 1971 స్వాతంత్ర్య పోరాట కుటుంబాలకు 30 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంపై ఆ దేశంలో ఎప్పటి నుంచో నిరసనలు జరుగుతున్నాయి. అయితే సుప్రీంకోర్టు వారి రిజర్వేషన్ల శాతాన్ని 5 కి తగ్గించడంతో అల్లర్లు తగ్గాయి.

అయితే ఇప్పుడు ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలనే కొత్త నినాదంలో మళ్లీ నిరసనలు ప్రారంభయ్యాయి. బంగ్లాదేశ్‌ని 15 ఏళ్లకు పైగా పాలిస్తూ ఈ ఏడాది జనవరిలో వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చిన హసీనాకు ఈ నిరసనలు పెను సవాలుగా మారాయి. నిరసనకారులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తుండటంతో హసీనా ప్రభుత్వం పతనం అంచున ఉన్నట్లు కనిపిస్తోంది.

Bangladesh: నెత్తురోడుతున్న బంగ్లాదేశ్.. ఒకే రోజు 72 మంది మృతి! హసీనా రాజీనామా?

Updated Date - Aug 04 , 2024 | 08:25 PM