India vs Canada: మారిన కెనడా ప్రధాని స్వరం.. ఇకపై భారత్‌తో కలిసి..
ABN , Publish Date - Jun 16 , 2024 | 12:46 PM
కొన్ని నెలల నుంచి భారత్, కెనడా మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎప్పుడైతే ఆరోపించాడో..
కొన్ని నెలల నుంచి భారత్, కెనడా (India vs Canada) మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) ఎప్పుడైతే ఆరోపించాడో.. అప్పటి నుంచే రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తర్వాత ట్రూడో కొన్నిసార్లు భారత వ్యతిరేక వైఖరిని సైతం కనబర్చాడు. కానీ.. ఇప్పుడు అతని స్వరం మారింది. తన అహంకార ధోరణిని పక్కన పెట్టి.. భారత్‌తో కలిసి పని చేసేందుకు కట్టుబడి ఉన్నామని కీలక ప్రకటన చేశాడు. జీ7 సమావేశాల (G7 Summit) సందర్భంగా ప్రధాని మోదీని (PM Modi) కలిసిన తర్వాత.. ఆయనలో ఈ మార్పు వచ్చింది.
ఇటలీలో జరిగిన జీ7 సమావేశాల్లో మోదీని కలిశాక ట్రూడో మాట్లాడుతూ.. ‘‘తాము అనుసరించాల్సిన సున్నితమైన అంశాల వివరాల జోలికి నేను వెళ్లను. కానీ.. భారత్‌తో కలిసి ముఖ్యమైన పనులు చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం. భవిష్యత్తులో తాము కలిసి కొన్ని అత్యంత ముఖ్యమైన సమస్యలు, పనులు డీల్ చేస్తాం’’ అని అన్నారు. ఇదే సమయంలో.. మరోసారి భారత ప్రధానిగా ఎన్నికైనందుకు మోదీకి ట్రూడో ధన్యవాదాలు తెలిపారని, ఇరువురి మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై సంక్షిప్తంగా చర్చలు సాగాయని కెనడియన్ ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు.. ట్రూడోతో తాను కరచాలనం చేస్తున్న ఫోటోను మోదీ షేర్ చేస్తూ.. ‘‘జీ7 సదస్సులో తాను కెనడా ప్రధాని ట్రూడోని కలిశాను’’ అని క్యాప్షన్ జత చేశారు.
భారత్, కెనడా మధ్య విభేదాలు
గతేడాది సెప్టెంబర్‌లో జీ20 సదస్సు ముగిసిన వారం రోజుల తర్వాత నిజ్జర్ హత్య విషయంలో జస్టిన్ ట్రూడో నేరుగా భారత్‌పై ఆరోపణలు చేశారు. ఆ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని పేర్కొన్నారు. దీంతో.. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు తలెత్తాయి. ట్రూడో చేసిన ఆరోపణలను భారత్ వెంటనే ఖండిస్తూ.. ఆ ఆరోపణల్ని నిజం చేసే ఆధారాలు సమర్పిస్తే తామూ చర్యలు తీసుకుంటామని భారత్ పేర్కొంది. అయితే.. దీనిపై కెనడా నుంచి సరైన స్పందన రావడం లేదు. ఈ వ్యవహారం ఇరు దేశాల మధ్య ఇప్పటికీ కొరకరాని కొయ్యలా కొనసాగుతూనే ఉంది. మరి.. భారత్‌తో కలిసి పని చేస్తామని ట్రూడో చెప్పినట్టు ఇప్పటికైనా ఈ వ్యవహారం కొలిక్కి వస్తుందా? లేదా? అనేది చూడాలి.
Read Latest International News and Telugu News