Donald Trump: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండించిన డొనాల్డ్ ట్రంప్
ABN , Publish Date - Nov 01 , 2024 | 09:22 AM
షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన అకృత్యాలను డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. మత అజెండాల నుంచి హిందూ అమెరికన్లను కాపాడతానని, వారి స్వేచ్ఛ కోసం పోరాడుతానని ట్రంప్ హామీ ఇచ్చారు. దీపావళి సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, యూఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్-2024లో పోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ నామినీ డొనాల్డ్ ట్రంప్ దీపావళి పండగ సందర్భంగా కీలక సందేశాన్ని ఇచ్చారు. భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన అకృత్యాలను ఖండిస్తున్నానని అన్నారు. మత అజెండాల నుంచి హిందూ అమెరికన్లను కాపాడతానని, వారి స్వేచ్ఛ కోసం పోరాడుతానని ట్రంప్ హామీ ఇచ్చారు.
‘‘బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రైస్తవులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న అనాగరిక హింసను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అక్కడి మైనారిటీలపై సామూహిక దాడులు, దోపిడీలు జరుగుతున్నాయి. పరిస్థితి మొత్తం గందరగోళంగా ఉంది. నా దృష్టిలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ జరగలేదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా పతనం, ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై డొనాల్డ్ ట్రంప్ మాట్లాడడం ఇదే తొలిసారి.
తాను ఎన్నికల్లో గెలిస్తే భారత్, తన మంచి మిత్రుడు ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తానని వాగ్దానం చేశారు. ‘‘అందరికీ దీపావళి శుభాకాంక్షలు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. విజయానికి దారితీస్తుందని నేను ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి కమలా హారిస్‌పై కూడా విరుచుకుపడ్డారు. కమలా హ్యారిస్, అధ్యక్షుడు జో బిడెన్ ఇద్దరూ ప్రపంచవ్యాప్తంగా, అమెరికాలోని హిందువులను విస్మరించారని వ్యాఖ్యానించారు. ‘‘కమలా, జో బైడెన్ ప్రపంచవ్యాప్తంగా, అమెరికాలోని హిందువులను పట్టించుకోలేదు. ఇజ్రాయెల్ నుంచి ఉక్రెయిన్ వరకు, మన దేశ దక్షిణ సరిహద్దు వరకు అన్నింటిలోనూ విఫలమయ్యారు. మేము తిరిగి అమెరికాను దృఢంగా మార్చుతాం. బలపడడం ద్వారా శాంతిని పునరుద్ధరిస్తాం’’ అని అన్నారు.
కాగా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆగస్టు 5న విద్యార్థుల భారీ నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో 15 ఏళ్ల పాలనకు హసీనా ముగింపు పలకాల్సి వచ్చింది. అంతేకాదు భారత్‌కు పారిపోయి వచ్చారు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లోని మైనారిటీ హిందువులు హింసను చవిచూశారు. అంతేకాదు హిందూ దేవాలయాలు, హిందువులకు సంబంధించిన వ్యాపారాలపై దాడులు జరిగాయి. మైనారిటీ కమ్యూనిటీకి వ్యతిరేకంగా 48 జిల్లాల్లో 200 కంటే ఎక్కువ ప్రదేశాలలో దాడులు జరిగాయని బంగ్లాదేశ్ నేషనల్ హిందూ మహా కూటమి పేర్కొంది. ఈ ఏడాది జులై నుంచి ఆగస్టు మధ్యకాలంలో కూడా వందలాది మంది హిందువులు హత్యకు గురయ్యారని పేర్కొంది. కాగా బంగ్లాదేశ్ జనాభాలో మైనారిటీ హిందువులు దాదాపు 8 శాతంగా ఉన్నారు.