Share News

అమెరికాలో బడ్జెట్‌ కోతల విభాగం

ABN , Publish Date - Nov 16 , 2024 | 05:01 AM

అమెరికా అధ్యక్షునిగా ఎన్నికయిన డొనాల్డ్‌ ట్రంప్‌.. ప్రభుత్వ సామర్థ్యం పెంపును తన ప్రథమ కర్తవ్యంగా ఎంచుకున్నారు. వృథా వ్యయాలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని తగ్గించాలని నిర్ణయించుకున్నారు.

అమెరికాలో బడ్జెట్‌ కోతల విభాగం

  • ఉద్యోగాలకు అర్హతలు: సూపర్‌ హై-ఐక్యూ, రోజుకు కనీసం 12 గంటలు పనిచేసే అనురక్తి

  • ఆధ్వర్యం: మస్క్‌, వివేక్‌ జీతం మాత్రం సున్నా

  • రక్షణ మంత్రిగా పీట్‌ హెగ్‌సెట్‌ పేరును ప్రతిపాదించిన ట్రంప్‌

వాషింగ్టన్‌, నవంబరు 15: అమెరికా అధ్యక్షునిగా ఎన్నికయిన డొనాల్డ్‌ ట్రంప్‌.. ప్రభుత్వ సామర్థ్యం పెంపును తన ప్రథమ కర్తవ్యంగా ఎంచుకున్నారు. వృథా వ్యయాలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని తగ్గించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రభుత్వ సామర్థ్య విభాగం (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్న్‌మెంట్‌ ఎఫిఫియన్సీ-డీఓజీఈ)ని ఏర్పాటు చేశారు. ఈ విభాగానికి ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌, భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి ఆధ్వర్యం వహిస్తున్నారు. అమెరికా వార్షిక బడ్జెట్‌ 7 ట్రిలియన్‌ డాలర్లు (సుమారు రూ.600 లక్షల కోట్లు) కాగా, దాంట్లో 2 ట్రిలియన్‌ డాలర్ల (సుమారు రూ.170 లక్షల కోట్లు) మేర కోత విధించడమే ట్రంప్‌ లక్ష్యం. ఇందుకోసం కొత్తగా ఏర్పాటయిన విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు మస్క్‌, వివేక్‌లు ప్రకటించారు.

వారిని నియమిస్తున్నట్టు గురువారం ట్రంప్‌ ప్రకటించగా, వెంటనే రంగంలో పని ప్రారంభించారు. డీఓజీఈలో పనిచేసేందుకు ఆసక్తికలవారు తమ రెజ్యూమేలను ఎక్స్‌ ద్వారా డైరెక్ట్‌ మెసేజ్‌ (డీఎం)ల రూపంలో పంపించాలని సూచించారు. నెలకు కనీసం 8 డాలర్ల చందా చెల్లించే ఎక్స్‌ ఖాతాల ద్వారా మాత్రమే ఈ డీఎంలు పంపించే అవకాశం ఉంది. ‘‘ఐడియాలు ఇచ్చేందుకు మాకు పార్ట్‌ టైం ఉద్యోగులు అవసరం లేదు. ‘స్మాల్‌-గవర్నమెంట్‌’ విప్లవకారులుగా పనిచేసేందుకు సూపర్‌ హై-ఐక్యూ, వారానికి 80గంటలకు పైగా (రోజుకు సుమారుగా 12 గంటలు) పనిచేసేందుకు అనురక్తి ఉండేవారు కావాలి.


‘ఖర్చుల్లో కోత విధించే’ పనులు చేయాలి. ఇది అంత గ్లామర్‌సగా ఉండదు. మొదటి 1ులో ఉండే డైరెక్ట్‌ మెసేజ్‌లను ఎలాన్‌, వివేక్‌లు స్వయంగా పరిశీలిస్తారు’’ అని డీఓజీఈ ఎక్స్‌ సందేశంలో తెలిపింది. ఎలాన్‌ మస్క్‌ మరో సందేశం ఇస్తూ ‘‘డీఓజీఈలో పనిచేసే సిబ్బంది ప్రభుత్వ వ్యయాల తగ్గింపునకు, సామర్థ్యం పెంపునకు జాగురూకతతో పనిచేయాల్సి ఉంది. ఇందుకు ఎలాంటి పరిహారం చెల్లించరు’’ అని స్పష్టం చేశారు. ‘‘నిజానికి ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. ఎంతో మంది శత్రువులను కొని తెచ్చుకుంటారు. పరిహారం మాత్రం సున్నా. చాలా మంచి బేరం కదూ!’’ అంటూ వ్యాఖ్యానించారు.

  • యుద్ధాలను నిలిపివేస్తా

శక్తిమంతమైన సైన్యం సాయంతో ప్రస్తుతం జరుగుతున్న రష్యా-ఉక్రెయన్‌, మధ్యప్రాచ్యం యుద్ధాలను నిలిపివేస్తానని ట్రంప్‌ అన్నారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని పామ్‌బీచ్‌లో ఉన్న తన సొంత రిసార్ట్‌ అయిన మార్‌ ఎ లాగోలో నెలకొల్పిన ‘అమెరికా ఫస్ట్‌’ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌లో గురువారం జరిగిన సన్మాన సభలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ‘అమెరికా ఫస్ట్‌’ పేరుతో విదేశాంగ విధానంపై మాట్లాడుతూ ‘తక్కువ పన్నులు, శక్తిమంతమైన సైన్యం ఉన్న దేశంగా అమెరికాను మళ్లీ అభివృద్ధి చేయాలి’ అని అన్నారు. మరోవైపు ఫాక్స్‌ న్యూస్‌ టీవీ యాంకర్‌, నేషనల్‌ గార్డ్‌ మాజీ ఉద్యోగి పీట్‌ హెగ్‌సెట్‌ను రక్షణ మంత్రిగా నియమించాలని ట్రంప్‌ ప్రతిపాదించారు. దీన్ని సెనేట్‌ ఆమోదించాల్సి ఉంది.

Updated Date - Nov 16 , 2024 | 05:01 AM