Share News

Donald Trump : డాలర్‌తో పెట్టుకుంటే.. టాటా చెప్పాల్సిందే!

ABN , Publish Date - Dec 02 , 2024 | 04:11 AM

అమెరికా డాలర్‌ ప్రాభవాన్ని తగ్గించే ప్రయత్నాలు కొనసాగిస్తే బ్రిక్స్‌ కూటమి దేశాలపైన 100 శాతం సుంకాలు విధిస్తానని ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు.

Donald Trump : డాలర్‌తో పెట్టుకుంటే.. టాటా చెప్పాల్సిందే!

100% సుంకాలు విధిస్తాం..

అమెరికా మార్కెట్లోకి అనుమతివ్వం

ప్రత్యేక కరెన్సీ సృష్టించబోమని హామీ ఇస్తేనే కఠిన చర్యలు ఉండవు

బ్రిక్స్‌ కూటమికి ట్రంప్‌ హెచ్చరిక

ఫ్లోరిడా, డిసెంబరు 1: అమెరికా డాలర్‌ ప్రాభవాన్ని తగ్గించే ప్రయత్నాలు కొనసాగిస్తే బ్రిక్స్‌ కూటమి దేశాలపైన 100 శాతం సుంకాలు విధిస్తానని ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. అంతేగాక, ఆయా దేశాలకు అమెరికా మార్కెట్లోకి ప్రవేశం లేకుండా తలుపులు మూస్తానన్నారు. ఈ మేరకు శనివారం ‘ట్రూత్‌ సోషల్‌’ అనే సోషల్‌ మీడియా వేదికలో ఆయన ఒక పోస్ట్‌ పెట్టారు. ‘కొత్తగా ఎటువంటి బ్రిక్స్‌ కరెన్సీని సృష్టించబోమని, బలమైన అమెరికా డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మరే ఇతర కరెన్సీకి మద్దతు ఇవ్వబోమని బ్రిక్స్‌ దేశాలు మాకు హామీ ఇవ్వాలి. లేకపోతే వారు 100 శాతం సుంకాలు చెల్లించటానికి సిద్ధపడాలి. అంతేకాదు, అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి అమ్మకాలు జరపకూడదు’ అని పేర్కొన్నారు. అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్‌ స్థానాన్ని బ్రిక్స్‌ భర్తీ చేయటం సాధ్యం కాదన్నారు. ఏ దేశం ఈ దిశగా ప్రయత్నించినా..


అమెరికాకు టాటా చెప్పాల్సిందేనని ట్రంప్‌ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ట్రంప్‌ సుంకాల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అమెరికాలోకి పెద్ద ఎత్తున అక్రమ వలసలకు, డ్రగ్స్‌ సరఫరాకు మెక్సికో, కెనడా కారణమవుతున్నాయని.. ధోరణి మార్చుకోకపోతే వాటి ఎగుమతులపైన 25 శాతం సుంకం విధిస్తానని, ఇదే కారణాలతో చైనా మీద 10 శాతం సుంకం విధిస్తానని ట్రంప్‌ ఇటీవలే ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబరులో రష్యాలో జరిగిన బ్రిక్స్‌ కూటమి సమావేశంలో.. సభ్యదేశాల మధ్య జరిగే వాణిజ్య లావాదేవీల్లో డాలర్లకు బదులు స్థానిక కరెన్సీలను ఉపయోగించాలన్న ప్రతిపాదన వచ్చింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ తాజా ప్రకటన చేశారు. ప్రస్తుతం బ్రిక్స్‌ కూటమిలో బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్‌, యూఏఈ సభ్యదేశాలుగా ఉన్నాయి. ప్రస్తుత ప్రపంచ వాణిజ్యంలో డాలర్‌ ప్రాభవం బలంగా ఉంది. చమురు వంటి కీలకమైన సరుకుల అమ్మకాలు, కొనుగోళ్లు డాలర్లలోనే జరుగుతున్నాయి. ప్రపంచ విదేశీ మారక నిల్వల్లో డాలర్ల వాటా దాదాపు 58 శాతం ఉంది.


అక్రమ వలసదారుల కోసం పాక్‌ హోటల్‌కు 1860కోట్లా!

జో బైడెన్‌ ప్రభుత్వంపై రిపబ్లికన్‌ పార్టీ నేత వివేక్‌ రామస్వామి తీవ్ర విమర్శలు చేశారు. అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించేందుకు న్యూయార్క్‌లోని ఓ పాకిస్థాన్‌ హోటల్‌కు రూ.1,860 కోట్లు చెల్లించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లో రూజ్‌వెల్ట్‌ హోటల్‌ ప్రస్తుతం పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌(పీఐఏ) యాజమాన్యంలో ఉంది. అమెరికాకు చెందిన రచయిత జాన్‌ లెఫెవ్రే ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా ‘‘రూజ్‌వెల్ట్‌ హోటల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించేందుకు న్యూయార్క్‌ నగరం పాకిస్థాన్‌కు రూ.1,860 కోట్లు చెల్లిస్తోంది. సరైన పత్రాలు లేని వలసదారులంతా ప్రస్తుతం దీనిలో తక్కువ ధరకే ఉంటున్నారు. ఈ స్వీట్‌ డీల్‌ ద్వారా పాకిస్థాన్‌కు మంచి ఆదాయం సమకూరుతోంది’’ అన్నారు. దీనిపై వివేక్‌ స్పందిస్తూ.. ‘‘అమెరికాలోని పన్ను చెల్లింపుదారుల డబ్బుతో అక్రమ వలసదారులకు హోటల్‌లో విడిది ఏర్పాటు చేశారు. ఇది చాలా విడ్డూరంగా ఉంది’’ అని అన్నారు.

Updated Date - Dec 02 , 2024 | 04:11 AM