ట్రంప్ గెలిచారు.. అమెరికాలో ఉండలేను!
ABN , Publish Date - Nov 09 , 2024 | 05:40 AM
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఖుషీ ఖుషీగా ఉండగా.. ఆయన కూతురు వివియన్ జెన్నా విల్సన్ మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఎలాన్ మస్క్ కూతురి ఆవేదన..
వాషింగ్టన్, నవంబరు 8: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఖుషీ ఖుషీగా ఉండగా.. ఆయన కూతురు వివియన్ జెన్నా విల్సన్ మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తనకు అమెరికాలో భవిష్యత్తు కనిపించట్లేదని.. దేశాన్ని వీడాలనుకుంటున్నట్లు సామాజిక మాధ్యమం థ్రెడ్స్ వేదికగా వెల్లడించారు. ఎలాన్ మస్క్‌కు మొదటి భార్య ద్వారా కలిగిన ఆరుగురి సంతానంలో వివియన్ విల్సన్ ఒకరు.. అయితే అబ్బాయిగా పుట్టిన వివియన్.. 18 ఏళ్ల వయసు (2022)లో తండ్రిని ఎదిరించి లింగ మార్పిడి చేయించుకొని అమ్మాయిగా మారారు.
తాజాగా ట్రంప్ గెలుపుతో అమెరికాలో తన లాంటి ట్రాన్స్‌జెండర్ల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆమె వాపోయారు. ‘కొన్నాళ్లుగా దేని గురించైతే బాధపడుతున్నానో అదే జరిగింది. అమెరికాలో నాకు భవిష్యత్తు కనిపించట్లేదు. ఆయన (ట్రంప్) పదవిలో నాలుగేళ్లే ఉండనున్నప్పటికీ.. లింగమార్పిడి వ్యతిరేక నిబంధనలు ఒక్కసారిగా అమల్లోకి రాకపోయినా.. వాటిని కావాలని ఓటేసిన వారు అంత తొందరగా మారరుగా..’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.