Share News

500 మంది భారతీయులను అక్రమంగా అమెరికా సరిహద్దుల్లోకి పంపించాను

ABN , Publish Date - Nov 21 , 2024 | 04:32 AM

తానొక్కడే ఐదు వందల మందికి పైగా భారతీయులను నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా కెనడా సరిహద్దులను దాటించి అమెరికాకు చేరవేశానని రాజిందర్‌సింగ్‌ అనే మానవ స్మగ్లర్‌ అమెరికా పోలీసుల ఎదుట అంగీకరించాడు.

500 మంది భారతీయులను అక్రమంగా అమెరికా సరిహద్దుల్లోకి పంపించాను

  • అమెరికాలో మానవ స్మగ్లర్‌ రాజిందర్‌ అంగీకారం

న్యూఢిల్లీ, నవంబరు 20: తానొక్కడే ఐదు వందల మందికి పైగా భారతీయులను నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా కెనడా సరిహద్దులను దాటించి అమెరికాకు చేరవేశానని రాజిందర్‌సింగ్‌ అనే మానవ స్మగ్లర్‌ అమెరికా పోలీసుల ఎదుట అంగీకరించాడు. కెనడా గుండా అమెరికాకు చేరవేస్తామని చెప్తూ ఆశావహులను కెనడాకు పంపే ఏజెంట్లు భారత్‌లో ఉన్నారని తెలిపాడు. గుజరాత్‌కు చెందిన జగదీశ్‌ పటేల్‌, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు 2022లో కెనడాలోని మానవ స్మగ్లర్ల సాయంతో అమెరికా సరిహద్దులు దాటే క్రమంలో చలికి తట్టుకోలేక చనిపోయారు. ఈ కేసు దర్యాప్తులో రాజిందర్‌ సింగ్‌(పంజాబ్‌ నుంచి వెళ్లి కెనడాలో స్థిరపడ్డాడు) అమెరికా పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చాడు. అయితే, తనకు జగదీశ్‌ కుటుంబం చనిపోవడానికి సంబంధం లేదన్నాడు. 2022 జనవరిలో ఫెనిల్‌ పటేల్‌ అనే స్మగ్లర్‌ సాయంతో జగదీశ్‌ పటేల్‌ కుటుంబం అమెరికాలోకి వెళ్లడానికి ప్రయత్నించింది. సరిహద్దుల నుంచి తమను తీసుకువెళ్లాల్సిన కారు రాకపోవడంతో మంచుకు గడ్డకట్టుకుపోయి వారు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో పోలీసులు ఫెనిల్‌తో పాటు హర్ష్‌కుమార్‌ పటేల్‌, స్టీవ్‌ షాండ్‌లను కూడా అమెరికా పోలీసులు నిందితులుగా చేర్చారు. అయితే, మనుషుల స్మగ్లింగ్‌ గురించిన సమాచారం కోసం.. తమ అదుపులో ఉన్న రాజిందర్‌ నుంచి వివరాలు రాబట్టారు. ఫెనిల్‌ను తాను 2015లో కలిసినట్లు రాజిందర్‌ చెప్పాడు. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి పనిచేసినట్లు వివరించాడు. రాజిందర్‌ 2023 ఫిబ్రవరిలో పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

Updated Date - Nov 21 , 2024 | 04:35 AM