Cyclone Chido: తుపాన్‍తో చిగురుటాకులా వణుకుతోన్న ‘మయోట్’
ABN , Publish Date - Dec 16 , 2024 | 09:00 AM
ఫ్రెంచ్ భూభాగంలోని మయోట్‍లో చిడో తుపాన్ బీభత్సం సృష్టించింది. దీంతో 11 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు తెలిపింది.
పారిస్, డిసెంబర్ 16: చిడో తుపాన్ కారణంగా.. ఫ్రాన్స్ భూభాగమైన మయోట్ ద్వీపం చిరుగుటాకులా వణికింది. ఈ తుపాన్ కారణంగా.. 11 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వందలాది మంది గాయపడ్డారని చెప్పింది. వారంతా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని.. వారిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసింది.
Also Read: రాజ్యసభ సభ్యులుగా నేడు ప్రమాణ స్వీకారం
హిందూ మహాసముద్రంలో ఏర్పడిన ఈ చిడో తుపాన్ కారణంగా.. ఫ్రెంచ్ భూభాగమైన మయోట్ ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లిందని స్పష్టం చేసింది. ఈ తుపాన్ కారణంగా.. చాలా బలమైన గాలులు వీస్తున్నాయని పేర్కొంది. ఈ గాలుల దాటికి.. ఇంటి పైకప్పులు పూర్తిగా ధ్వంసమైనాయని తెలిపింది. దీంతో ఎక్కడికక్కడ ఇంటి పైకప్పులు కూలి పోయి కుప్పులుగా ఏర్పడ్డాయి. అలాగే వందలాది చెట్లు సైతం నేలకొరిగాయని పేర్కొంది. కొన్ని భారీ వృక్షాలు.. నివాస ప్రాంతాలు, రహదారులపై పడ్డాయి. దీంతో సహాయక చర్యలు తీవ్ర ఆటంకం ఎదురవుతోందని తెలిపింది.
ఇక తీర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పడవలు మునిగిపోయాయని వివరించింది. దాదాపు 3 లక్షల మందిపై ఈ తుపాన్ ప్రభావం చూపిందని వెల్లడించింది. గత 90 ఏళ్లో.. అంటే 1934 నుంచి ఈ తరహాలో ఇంత ఉధృతంగా వచ్చిన తుపాన్ ఇదేనని హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తుపాన్ కారణంగా.. మయోట్ ద్వీపం అతలాకుతలంగా మారడంతో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు విపత్తు సంభవించిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతోన్నాయని వివరించింది. అలాగే తుపాన్ బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు తెలిపింది.
For International News And Telugu News